బలమైన ఉద్యమాలతోనే చెక్‌ !

Telugu Lo Computer
0


సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చే సవరణలను గత వారం ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసుకుంది. సమాచార హక్కు చట్టం కోసం మొదట ఉద్యమించినవారిలో సామాజిక కార్యకర్త అరుణ రాయ్ ఒకరు. సమాచార హక్కు చట్టానికి తాజాగా తీసుకొచ్చిన సవరణలు ప్రభుత్వ పారదర్శకత, జవాబుదారీకి తూట్లు పొడిచేవిగా ఉన్నాయని ఆమె అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు...

ప్రశ్న:- చట్టబద్ద సంస్థలైన సమాచార కమిషన్లలో వున్న లొసుగులను సరిచేసేందుకే స.హ చట్ట సవరణలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది? ఇందులో సమస్య ఏమిటి?

అరుణరాయ్ :- కేంద్ర ఎన్నికల కమిషన్‌తో సమాన ప్రతిపత్తి కల్పించిన సమాచార కమిషన్లను చట్టపరంగా నియంత్రించేందుకే ప్రభుత్వం ఈ సవరణలు ప్రతిపాదిస్తోంది. వాస్తవానికి ఎన్డీయే సభ్యులు క్రియాశీలకంగా వున్న పార్లమెంటు స్థాయీ సంఘం సిఫార్సు మేరకే పార్లమెంట్‌ స.హ కమిషన్లకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీలుగా కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సివిసి), లోక్‌పాల్‌ వ్యవస్థలకు కూడా ఇదే తరహా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన సవరణలతో ప్రభుత్వం ఈ స్వతంత్ర ప్రతిపత్తికి గండి కొడుతున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ప్రశ్న:- ప్రభుత్వం భయమేమిటి?

అరుణరాయ్ :- స.హ చట్టం ప్రజలకు ప్రశ్నించే హక్కును కల్పిస్తోంది. తమ నుండి సమాచారాన్ని సేకరించేందుకు ప్రజలు చేస్తున్న ప్రయత్నం ఈ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోంది. ఎన్నికల నిధుల సమీకరణ, అనుత్పాదక ఆస్తులు, ఎన్నికల అఫిడవిట్లపై సరైన సమా చారం అందచేయటం, స్పెక్ట్రమ్‌ కేటాయింపులు,రక్షణ ఒప్పందాల వంటి అనేక అంశాలపై స.హ చట్టం ద్వారా ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. వివిధ అంశాలకు సంబంధించిన సమాచారం కోసం ఏటా దాదాపు 60 లక్షలకు పైగా దరఖాస్తులు అందుతున్నాయి. అధికారంలో వున్న వారెవరూ పారదర్శకతతో లేదా బాధ్యతాయుతంగా వ్యవహరించాలను కోవటం లేదు.

ప్రశ్న:- ఇప్పుడు ప్రతిపాదిస్తున్న సవరణలు స.హ కమిషన్‌ స్వతంత్రతపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయి?

అరుణరాయ్:- ఎటువంటి బదిలీలు, ప్రభుత్వ జోక్యం లేకుండా కమిషనర్లు చట్టం అమలులో తమ బాధ్యతలను స్వతంత్రంగా నిర్వహించేందుకు చట్టం హామీ ఇస్తోంది. ఈ కమిషన్ల పదవీ కాలం, హోదా, వేతనాలు, ఇతర విధి విధానాలను నిర్ణయించే అధికారాలను ప్రభుత్వం తమ వద్దే వుంచుకోవటంతో వారే డిఫాక్టో మాస్టర్లుగా మారుతు న్నారు. కమిషన్లు జారీ చేసే ఆదేశాలు, అధికారాల వినియోగం, అన్ని నిర్ణయాలను ప్రభావితం చేయటం వంటి అంశాలను నియంత్రించే స్థితికి చేరుకుంటున్నారు.

ప్రశ్న:- ఈ సవరణల్లో ప్రతిపాదించిన ఇతర అంశాలేమిటి?

అరుణారాయ్:-  స.హ కమిషన్ల పదవీకాలాన్ని, వారికి, రాష్ట్రాల సమాచార కమిషనర్ల వేతనాలను నిర్ణయించే అధికారాన్ని ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతోంది. సమాఖ్య స్ఫూర్తిలో తమకు విశ్వాసం వుందని చెబుతున్న ప్రధాని మాటలకు ఈ సవరణ బిల్లు పూర్తి విరుద్ధంగా వుంటోంది.

ప్రశ్న:- ఒక చట్టాన్ని ఆమోదించుకునేందుకు తన పార్లమెంటరీ మెజార్టీని వినియోగించే హక్కు ప్రభుత్వానికి వుండదా?

అరుణారాయ్:-ఈ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు ఈ సవరణను ఎందుకు ప్రతిపాదిస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం వెల్లడించాలి. ప్రజాస్వామ్యానికి ఓటు ఎంత ముఖ్యమని నమ్ముతున్నారో చర్చ కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని వారు తెలుసుకోవాలి. ఎన్నికల్లో భారీ మెజార్టీ లభించినంత మాత్రాన ప్రజాభిప్రాయాన్ని కాలరాసే హక్కు వారికి లభించినట్లు కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. నిర్ణయాత్మక అంశాల భాగస్వామ్యం విషయంలో తమ ప్రతినిధిని ప్రశ్నించే హక్కు వారికి ఎప్పుడూ వుంటుంది. పారదర్శకత, సమాచార హక్కు అన్నవి పటిష్టమైన భాగస్వామ్యానికి, ప్రజాస్వామ్యానికి పునాది. తమకు ఓట్లు వేసిన ప్రజల హక్కులను కాలరాసే అధికారం పార్లమెంటరీ మెజార్టీకి లేదు.

ప్రశ్న:- బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షం డిమాండ్‌ జాప్యం చేసే ఎత్తుగడ అని మీరు భావిస్తున్నారా?

అరుణారాయ్:-ఇటువంటి ప్రధానమైన బిల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపటం హేతుబద్ధం, అవసరం కూడా.. దీనివల్ల ఈ రంగానికి సంబంధించిన నిపుణులు, సామాన్య ప్రజలు తమ అభిప్రాయాలను కమిటీ ముందు తెలియచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు బిల్లుపై సక్రమమైన చర్చ జరుగుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)