సంజీవ్ కుమార్

Telugu Lo Computer
0


సంజీవ్ కుమార్ అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా (హరిభాయ్ అని కూడా వ్యవహరించ బడేవారు) ఇతడు గుజరాత్ లోని సూరత్ లో ఒక గుజరాతీ పటేల్ కుటుంబంలో జన్మించారు.  ఇతని బాల్యం సూరత్‌లో గడచింది. తరువాత ఇతని కుటుంబం ముంబాయికి తరలి వెళ్ళింది. అక్కడ ఒక ఫిలిం స్కూలులో సంజీవ్ కుమార్ శిక్షణ పొందారు. తద్వారా బాలీవుడ్‌లో నటుడిగా స్థిరపడ్డారు. ఇతని ఇరువులు సోదరులు ఒక సోదరి ఉన్నారు. తన నట జీవితాన్ని నాటకరంగం ద్వారా ప్రారంభించారు. మొదట ఇతడు ముంబాయిలోని "ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్(IPTA)", పిమ్మట "ఇండియన్ నేషనల్ థియేటర్" సంస్థల నాటకాలలో వేషాలు వేశారు. రంగస్థల నటుడిగా ఇతడు 22 ఏళ్ల వయసులో ముసలి వేషాలు వేసేవారు.

ఇతని సినిమా ప్రస్థానం 1960లో హమ్‌ హిందుస్తానీ అనే సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా ఆరంభమైంది. 1965లో నిశాన్ అనే సినిమా ద్వారా కథా నాయకుడి వేషాలు వేయడం మొదలు పెట్టారు. 1968లో సంఘర్ష్ సినిమాలో ప్రముఖ నటుడు దిలీప్ కుమార్‌తో కలిసి నటించారు. హిందీ సినిమాలలోనే కాక మారాఠీ, తెలుగు, పంజాబీ, సింధీ, తమిళ, గుజరాతీ సినిమాలలో కూడా నటించారు.  గుల్జార్, ఎ.కె.హంగల్, హృషీకేశ్ ముఖర్జీ, యశ్ చోప్రా, సుభాష్ ఘాయ్, సత్యజిత్ రే మొదలైన దర్శకులతో పనిచేశారు.  సంజీవ్ కుమార్ నటించిన  షోలే చిత్రంలో ఠాకూర్ పాత్ర ఈయనకి  మంచి పేరు తెచ్చిపెట్టింది. నయా దిన్ నయీ రాత్ సినిమాలో తొమ్మిది పాత్రలను ధరించాడు. ఈ పాత్రలను తమిళం (నవరాత్రి)లో శివాజీ గణేశన్, తెలుగు (నవరాత్రి)లో అక్కినేని నాగేశ్వరరావు పోషించారు. ఈయన జీవితాంతం అవివాహితుడిగానే ఉండిపోయారు. సంజీవ్ కుమార్ సులక్షణా పండిట్‌ను వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఆమె అవివాహితగానే ఉండి పోయింది. 

ఇతడికి పుట్టుకతోనే గుండె సంబంధమైన లోపంతో జన్మించారు.  ఈయనకు 1979లో తొలిసారి గుండెపోటు వచ్చింది. అప్పుడు అమెరికాలో బైపాస్ సర్జరీ చేయించుకున్నాఋ.  అయినా 1985, నవంబర్ 6న 47వ యేట తీవ్రమైన గుండెపోటు వచ్చి మరణించారు. ఇతని తమ్ముడు నికుల్ ఇతని కంటే ముందు మరణించారు.  మరొక సోదరుడు కిశోర్ ఇతని తరువాత 6 నెలలకు గతించారు.  సినిమాలలో అనేక వృద్ధ పాత్రలను పోషించినప్పటికీ నిజ జీవితంలో 50 యేళ్లు కూడా బ్రతకలేక పోవడం విషాదకరమైన విషయం. ఈయన నటించిన సుమారు పది సినిమాలు  మరణానంతరం విడుదలయ్యాయి. 1993లో విడుదలైన ప్రొఫెసర్ కి పడోసన్ ఇతడు నటించిన ఆఖరి చిత్రం. 

గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ఒక వీధికి సంజీవ్ కుమార్  స్మృత్యర్థం "సంజీవ్ కుమార్ మార్గ్" అని నామకరణం చేశారు. ఇతనిపేరుతో సూరత్‌లో ఒక పాఠశాల నెలకొల్పారు. 2013, మే 3వ తేదీ భారతప్రభుత్వం ఇతనిపై ఒక తపాలాబిళ్ల విడుదల చేసింది. 14 ఫిబ్రవరి 2014లో ఇతని స్వంత పట్టణం సూరత్‌లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ 108 కోట్ల విలువైన సమావేశ మందిరాన్ని "సంజీవ్ కుమార్ ఆడిటోరియం" పేరుతో ప్రారంభించారు. ఈయన  పేరుతో "సంజీవ్ కుమార్ ఫౌండేషన్" ఒక జాతీయ స్థాయి సేవా సంస్థ ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ బాలల విద్య, ఆరోగ్య, సాంస్కృతిక అభ్యున్నతికై పనిచేస్తున్నది. 2015 నుండి ఈ సంస్థ సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న సంజీవ్ కుమార్ నాటక పోటీలను స్పాన్సర్ చేస్తున్నది. ప్రతియేటా సంజీవ్ కుమార్ పేరుమీద ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు విభాగాలలో నగదు బహుమతులను ఇస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)