అంతిమ పోరాటం

Telugu Lo Computer
0


ఇది 1757 ప్రాంతాల్లో అమెరికా ఖండంలో వలసల స్థాపన విషయంలో బ్రిటీష్ వారికి ఫ్రెంచ్ వారికీ మధ్య దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఆధిపత్యం కోసం యుద్ధం జరిగింది. అదికూడా అమెరికాలోని వర్జీనియా నుండి నోవా స్కోటియావరకు వున్న బ్రిటీష్ వలసల సరిహద్దులవెంటనే జరిగాయి. చిత్రమేమిటంటే రెండు వలసవాద దేశాలు గూడా అమెరికా ఆదివాసీలైన రెడ్ ఇండియన్స్ తెగల మద్ధత్తుదార్ల మీదనే ఆధారపడి యుద్ధాలు కొనసాగించడం.

బ్రిటిష్ వారి విలియం హెన్రీ కోటకు లెఫ్టినెంట్ కల్నల్ జార్జి మన్రో సేనానిగా వున్నాడు. ఆ కోటను ఫ్రెంచ్ మేజర్ జనరల్ లూయిస్ జోసఫ్ డి మాంట్ కామ్ ముట్టడించాడు. ఆ విషయం తెలిసి ఎడ్వర్డ్ కోటలో మకాం వేసివున్న బ్రిటిష్ జనరల్ వెబ్ 200 మంది సైనికులను 800 మంది స్థానిక రెడ్ ఇండియన్స్ ను హేన్రీ కోట సహాయం కోసం పంపిస్తాడు.ఆ బృందంలో మన్రో కుమార్తెలు కోరా,ఏలిస్ లుకూడా వుంటారు. వారి రక్షణ బాధ్యత మేజర్ డన్ కన్ హెవార్డ్ కి ఒప్పజెప్ప బడుతుంది.ఆ బృందానికి మాగ్వా అనే రెడ్ ఇండియన్ గైడ్ గావుంటాడు. వారట్లా కొంతదూరం వెళ్ళిన తరువాత దారిలో హక్ ఐ అనే బ్రిటీష్ స్కౌట్,ఛింగష్ హుక్ అతని కొడుకు అన్ కాస్ లు జతకలుస్తారు.వారికి గైడ్ మాగ్వా ఫ్రెంచ్ వారి ఏజెంట్ అని, దగ్గరి దారి అన్న వంకతో వాళ్ళను తప్పుదారి పట్టించాడని తెలుస్తుంది.దాంతో అతను తప్పించుకుని పారిపోయి బలాన్ని సమీకరించుకొనివచ్చి హేవార్డ్,మన్రో సోదరీమణులను బందీలుగా పట్టుకుంటాడు.
ఇంతలోయుద్ధానికి సహాయంగా మరికొంత సైనిక సహాయాన్ని కోరుతూ మన్రో జనరల్ వెబ్ కి ఉత్తరం పంపుతాడు. వెబ్ అందుకు అంగీకరించడు.ఆ ఉత్తరం ఫ్రెంచ్ జనరల్ మాంట్ కామ్ కి చేరుతుంది.ఇకదాంతో అతను హెన్రీ కోటమీద దాడికి తెగిస్తాడు.బలహీనుడైన మన్రో లొంగిపోతాడు. ఆ లొంగుబాటును ఆసరాగా చేసుకొని ఫ్రెంచ్ మద్దత్తుదారులైన రెడ్ ఇండియన్స్ బ్రిటీష్ వారి సైన్యాన్ని,దాని మద్దత్తుదార్లనూ ఊచకోత కోస్తారు. మన్రో సోదరీమణుల్లో ఏలిస్ ను హెవార్డ్ అప్పటికే ప్రేమిస్తాడు. ఆ బృందాన్ని బంధీలుగా పట్టుకున్న మగ్వా తనను పెండ్లి చేసుకోవాలంటూ కోరా మీద వత్తిడి చేస్తుంటాడు.
మగ్వా బారినుండి హెవార్డ్ బృందాన్ని ఛింగష్ హుక్, అతని కొడుకు అన్ కాస్ ఏవిధంగా కాపాడారు? ఆ ప్రయత్నంలో ఎందరు చనిపోయారు? ఎందరు మిగిలారు?కోరాను మగ్వా పెండ్లాడాడా?లేదా? ఇవన్నీ ఎంతో ఉత్కంఠ భరితంగా వివరించబడ్డాయి.
నవల మొత్తం దారీ తెన్నూలేని దట్టమైన అడవుల్లో బ్రిటీష్, ఫ్రెంచ్ మద్దత్తు దార్లయిన రెడ్ ఇండియన్స్ తెగల మధ్య జరిగే మొరటు యుద్ధ తంత్రాలమధ్యన నడుస్తుంది. దాదాపు 220 పేజీల నవలంతా అడవి,పోరాటాల నేపథ్యంలోనే జరగడాన్ని నరాలుతెగేంత ఉత్కంఠభరితంగా వ్రాయడం వెనుక నవలా రచయిత జేమ్స్ ఫెన్నీమోర్ కూపర్ పరిశోధన, పరిశ్రమ అసలు మన ఊహకందని.ఫెన్నీమోర్ ఆంగ్లంలో " The last of the Mohicans" అనే పేరుతో వ్రాసిన ఈ నవలను ధనికొండ హనుమంతరావు గారు "అంతిమ పోరాటం" పేరుతో తెలుగులో అనువాదం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)