మార్క్సిజమే మాకు శిరోధార్యం

Telugu Lo Computer
0


చైనా కమ్యూనిస్టు పార్టీ తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. చైనా దేశపు చరిత్రలోనూ, చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలోనూ జూలై 1 అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు. చైనా ప్రజలు, దేశంలోని అన్ని అల్పసంఖ్యాక తరగతులకు చెందిన ప్రజలు చైనా కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు.

ఈ దేశ ప్రజలు, యావత్‌ పార్టీ శ్రేణులు నిర్విరామంగా సాగించిన కృషి వలన చైనా కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాల నాటికి దేశాన్ని అన్ని రంగాల్లనూ ఒక మోస్తరు ఆధునిక దేశంగా అభివృద్ధి చేసుకోవాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నామని ప్రకటిస్తున్నాను. అంటే చైనా ఎదుర్కొంటున్న నిష్టదరిద్రం నుంచి రెండో శతాబ్ది ఉత్సవాల నాటికి దేశాన్ని విముక్తి చేసుకుని దేశాన్ని సర్వతోముఖ అభివృద్ధి సాధించే ఆధునిక సోషలిస్టు చైనాగా తీర్చిదిద్దే దిశగా ప్రయాణం ప్రారంభిస్తున్నాం. ఇది చైనాకు, చైనా ప్రజలకు, చైనా కమ్యూనిస్టు పార్టీకి మహత్తరమైన విజయం.
చైనాను పరిరక్షించుకోవటానికి ప్రజలు అమోఘమైన ధైర్యసాహనాలతో పోరాడారు. వలసపాలన కాలంలో చీలికలు, పేలికలైన చైనాను ఏకం చేసేందుకు తైపింగ్‌ విప్లవం, 1898 నాటి సంస్కరణోద్యమం, యుథాన్‌ ఉద్యమం, 1911 నాటి విప్లవం ఒకదాని తర్వాత ఒకటిగా ఎగసిపడ్డాయి. జాతీయ పునరుద్ధరణ కోసం అనేక వ్యూహాలు రూపొందించినా ఈ ప్రయత్నాలు చివరకు విఫలమయ్యాయి. చైనా జాతిని, దేశాన్ని కాపాడుకోవటానికి సరికొత్త ఆలోచనలు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. విప్లవ శక్తులను సమీకరించటాని కి నూతన సంస్థ అవసరమైంది.
రష్యా విప్లవం విజయవంతం అయ్యాక మార్క్సిజం-లెనినిజం పవనాలు చైనాకు వ్యాపించాయి. 1921 నాటికి చైనా జాతీయ చైతన్యం ఓ గొప్ప మలుపు తిరుగుతున్న సమయం. మార్క్సిజం-లెనినిజం చైనా కార్మికోద్యమంతో మమేకమవుతున్న సమయం కూడా ఇదే. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. చైనాలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు ఓ చారిత్రక సందర్భం. ఇది ఆధునిక చైనా గమనాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన సందర్భం. చైనా దేశం, ప్రజల భవిష్యత్తును సమూలంగా మార్చేయటానికి పునాదులు వేసింది. ప్రపంచ ఉద్యమం రూపురేఖలు మార్చేసింది.
గత శతాబ్ద కాలంలో పోరాటాలు, త్యాగాలు, సృజనాత్మకతలతో కమ్యూనిస్టు పార్టీ చైనా సమాజాన్ని సంఘటితం చేసింది. చైనా దేశాన్ని ఒకే లక్ష్యం కోసం ఏకోన్ముఖంగా పని చేసేలా తయారు చేసింది. చైనా జాతీయ పునరుద్ధరణ దిశగా నడిపించింది.
ఉత్తరాది జైత్రయాత్ర, వ్యవసాయక యుద్ధం, జపాన్‌ దురాక్రమణ వ్యతిరేక యుద్ధం, విముక్తి యుద్ధాల ద్వారా సాయుధ ప్రతీఘాత దళాలతో విప్లవ దళాలు భీకరపోరాటం చేశాయి.ఈ పోరాటమే సామ్రాజ్యవాదం , భూస్వామ్య వ్యవస్థ, బ్యూరోక్రటిక్‌ పెట్టుబడిదారీ వ్యవస్థలనే మూడు కొండలను తుత్తునీయలు చేసి ప్రజాతంత్ర జనచైనా నిర్మాణాన్ని ఆచరణ సాధ్యం చేసింది. ప్రజాతంత్ర జనచైనాలో ప్రజలే పాలకులయ్యారు. ఈ విధంగా చైనా స్వాతంత్య్రాన్ని, చైనా ప్రజల విముక్తిని సాధించుకున్నాం.
ఈ పరిణామం అర్థ వలస, అర్థ భూస్వామ్య చైనా సమాజాన్ని విముక్తి చేసింది. పూర్తిగా చీలికలు పేలికలుగా ఉన్న సమాజాన్ని ఏకం చేసింది. విదేశీ శక్తులు చైనాపై మోపిన అసమాన ఒప్పందాలను రద్దు చేసింది. అప్పటి వరకూ చైనాలో ఉన్న సామ్రాజ్యవాద శక్తుల ఆధిపత్యానికి స్వస్తి చెప్పింది. జాతీయ పునరుద్ధరణకు కావల్సిన మౌలిక పరిస్థితులను సిద్ధం చేసింది.
సుదీర్ఘ పోరాటం ద్వారా చైనా ప్రజలు తమ కాళ్లపై తాము నిలబడ్డామని ప్రపంచానికి చాటి చెప్పారు. చైనాను బెదిరించే రోజులు, ప్రలోభ పెట్టే రోజులకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు.
వేల సంవత్సరాలు చైనాకూ సమాజానికీ ప్రతినిధిగా నిలిచిన భూస్వామ్య దోపిడీ వ్యవస్థకు స్వస్తి చెప్పిన కమ్యూనిస్టు పార్టీ, సోషలిజం ప్రాధమిక వ్యవస్థగా స్థాపించింది. సామ్యవాద సమాజ నిర్మాణ క్రమంలో సామ్రాజ్యవాద ఆధిపత్య శక్తుల వెన్నుపోట్లు, సాయుధ ప్రతిఘటనలు వంటి అనేక అవాంతరాలు ఎదుర్కొని చైనా సమాజంలో కనీవినీ ఎరుగని మార్పులను సాధించుకున్నాం. తూర్పు ప్రాంతంలో మధ్యయుగానికి వారసురాలిగా విస్తృత ప్రజానీకంతో ఉన్న నిరుపేద దేశం నేడు సోషలిస్టు శక్తిగా ఎదిగి జాతీయ పునరుద్ధరణకు కావల్సిన రంగాన్ని సిద్ధం చేసింది.
సుదీర్ఘ పోరాటం ద్వారా చైనా తన ప్రజలు పాతకాలపు సమాజాన్ని ధ్వంసం చేసే సామర్థ్యమే కాక, వినూత్న సమాజాన్ని నిర్మించగల సామర్థ్యం కలిగినవారని నిరూపించింది. సోషలిజం ఒక్కటే చైనాను కాపాడగలగదని, చైనా లక్షణాలతో కూడిన సోషలిజమే చైనా అభివృద్ధికి మార్గం సుగమం చేయగలుగుతుందని నిరూపించింది.
ప్రాథమిక దశ సోషలిజం నిర్మాణంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి పార్టీ తన అవగాహనను ఖరారు చేసుకుంది. పట్టుదలతో సంస్కరణల దిశగా ముందడుగు వేసింది. బయటి ప్రపంచానికి తలుపులు తెరిచింది. నలుదిక్కుల నుంచీ ఎదురైన సమస్యలను, సవాళ్లను అధిగమించింది. చైనా లక్షణాలతో సోషలిజాన్ని ప్రతిపాదించి, పరిరక్షించి అభివృద్ధి చేసింది. పార్టీ చరిత్రలో ఓ కీలకమైన మైలురాయిని అధిగమించింది. జనచైనా నిర్మాణానికి పునాదులు వేసింది.
మధ్యయుగాలనాటి వెనకబడిన ఉత్పత్తి శక్తులతో ఉన్న దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలో రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ మహాసభ తర్వాత చైనా లక్షణాలతో సోషలిజం నిర్మాణం నూతన దశలోకి ప్రవేశించింది. ఈ దశలో పార్టీ సర్వతోముఖ నాయకత్వస్థాయిని ప్రదర్శిస్తుంది. చైనా తరహా సోషలిజం నిర్మాణ ప్రయత్నాలను పరిరక్షించి అభివృద్ధిచేసింది. చైనా వ్యవస్థలను ఆధునీకరించింది. పాలనా వ్యవస్థ సామర్థ్యం పెంపొందించింది. పార్టీలో అంతర్గత నియంత్రణ వ్యవస్థలను బలోపేతం చేసింది. ఈ కాలంలో చైనా అధిగమించిన ప్రధాన సమస్యలు సవాళ్ల జాబితా చాలానే ఉంది. తొలి శతాబ్దిలోపు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించింది. సోషలిజం నిర్మాణం రెండో శతాబ్ది ఉత్సవాలకు సాధించాల్సిన వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది.
వందేండ్ల క్రితం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని చైనాలోకి ఆహ్వానించిన తొలితరం కమ్యూనిస్టులు చైనా కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. దేశం నలుమూలలా పార్టీ స్ఫూర్తికాంతులు వెదజల్లారు. సిద్ధాంతం, సత్యాన్ని నిలబెట్టి ఉంచటం, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక లక్ష్యాలకు కట్టుబడి ఉండటం, త్యాగాలకు వెరవకుండా పోరాడటం, పార్టీకి, ప్రజలకు అంకిత భావంతో కట్టుబడి ఉండటం నాలుగు మౌలిక లక్ష్యాలుగా పార్టీ వ్యవస్థాపకులు నిర్దేశించారు.
గత వందేండ్లలో పార్టీ ఈ వ్యవస్థాపక స్ఫూర్తిని కాపాడి కొనసాగించుకుంటూ వచ్చింది. సుదీర్ఘ పోరాటం ద్వారా చైనా కమ్యూనిస్టులకు విలక్షణతను తెచ్చిపెట్టే విధి విధానాలను నియమ నిబంధనలను వ్యవస్థాగతం చేసింది. చరిత్ర పురోగమించే కొద్దీ పార్టీ స్ఫూర్తి కూడా తరం నుంచి తరానికి అందుతూ వచ్చాయి. ఈ మహత్తర సాంప్రదాయాలు, వారసత్వాన్ని కాపాడి కొనసాగించటానికి, విప్లవ వారసత్వాన్ని పరిరక్షించటం ద్వారా పార్టీ వ్యవస్థాపక లక్ష్యాలు, స్ఫూర్తిని సజీవంగా కొనసాగంచటానికి సిద్ధమవుతోంది.
గత శతాబ్ది కాలంలో చైనా సాధించిన విజయాలన్నింటికీ కారణం నిరంతరం చైనా, చైనాలోని కమ్యూనిస్టులు, చైనా ప్రజలు సాగిస్తున్న కృషే ప్రధాన కారణం. కామ్రేడ్‌ మావో సేటుంగ్‌, డెంగ్‌ జియావో పింగ్‌, జియాంగ్‌ జెమిన్‌, హుజింటావో వంటి మహౌన్నత కమ్యూనిస్టు నేతలు తమ కృషి త్యాగంతో పాటు చైనా జాతీయ పునరుద్థానానికి ఎంతగానో తోడ్పాటునందించారు. వాళ్లందరినీ సగౌరవంగా స్మరించుకుంటున్నాం. సత్కరించు కుంటున్నాం.
చైనా విప్లవానికి, ఆధునిక చైనా నిర్మాణానికి, సంస్కరణలకు, పునాదులు వేసి సంఘటితం చేసి, చైనా కమ్యూనిస్టు పార్టీని అభివృద్ధి చేసిన మావో సేటుంగ్‌, చౌ ఎన్‌ లై, లీ షావోచి, ఝుడె, డెంగ్‌ జియావో పింగ్‌, చెన్‌ యున్‌ వంటి పాతతరం విప్లవకారులను సంస్మరించుకుందాం. జనచైనా వ్యవస్థాపన, నిర్మాణం, పురోగమనంలో అనేక రకాల త్యాగాలు చేసిన అశేష చైనా ప్రజానీకానికి స్మృత్యంజలి ఘటిద్దాం.
పార్టీ వ్యవస్థాపక లక్ష్యాలను నిర్వచించటం తేలికే. కానీ ఆ లక్ష్యాల పట్ల మన నిబద్ధతను నిలిపి ఉంచుకోవటమే కష్టం. చరిత్రను అధ్యయనం చేస్తే సామ్రాజ్యాలు ఎందుకు పతనమవుతాయో అర్థమవుతుంది. చరిత్రను పరిశీలిస్తే నేడు చైనా ఎక్కడ ఉంది, భవిష్యత్తు కోసం ఏమి చేయాలి అన్న విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ వందేండ్ల చరిత్రను గమనిస్తే మనం ఎందుకు జయ ప్రదమయ్యాము, ఈ విజయాలను కొనసాగించాలంటే భవిష్య త్తులో ఏమి చేయాలి అన్నది అర్థమవుతుంది. పార్టీ వ్యవస్థాపక లక్ష్యాల పట్ల మరింత నిబద్ధత కలిగి ఉండటం, భవిష్యత్తు లక్ష్యాల సాధనకు సిద్ధం కావటమే మనముందున్న కర్తవ్యం.
మెరుగైన భవిష్యత్తు కోసం చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోవటానికి సిద్ధపడ్డప్పడు ఈ క్రింది విషయాలు గుర్తు పెట్టుకోవాలి.
చైనా విజయాలు చైనా కమ్యూనిస్టు పార్టీపైనే ఆధారపడి ఉన్నాయి. 180 ఏండ్ల చైనా ఆధునిక చరిత్రలో 100ఏండ్ల చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో 70ఏండ్లకు పైగా ఉన్న జనచైనా చరిత్రను పరిశీలిస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ ఉనికి లేకుండా ఆధునిక చైనా లేదు. చైనా జాతీయ పునరుద్ధరణ లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీని చరిత్ర, ప్రజలే ఆహ్వానించారు.
రానున్న కాలంలో కూడా పార్టీ నాయకత్వం నీడనే కొనసాగాలి. నాయకత్వ పరిధిని మరింత విస్తరించాలి. రాజకీయ సమైక్యత, విస్తృతమైన విషయాలను గుర్తించటం, శిఖరాగ్ర నాయకత్వాన్ని అనుసరించటం, కేంద్ర పార్టీ నాయకత్వంతో సమన్వయం చేసుకోవటం, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం సిద్ధాంతం, ఆచరణ, సంస్కృతిల పట్ల ఎనలేని విశ్వాసం ప్రదర్శించటం వంటి విషయాల్లో జాగరూకతతో వ్యవహ రించాలి.
దేశమే ప్రజలు. ప్రజలే దేశం. దేశంపై ప్రజల ప్రత్యక్ష అధికారాన్ని నెలకొల్పటానికి పోరాడినట్లే ప్రజల మద్దతు పొందటానికి నిజానికి నేటికీ పోరాడు తున్నాము. ప్రజల్లోనే పార్టీ మూలాలున్నాయి. ప్రజలే పార్టీకి రక్తమాంసాలు. ఆయువు పట్టు. పార్టీకంటూ తనదైన ప్రత్యేక ప్రయోజనాలేమీ లేవు. ఏనాడూ పార్టీ ఏ వ్యక్తి ప్రయోజనాలకో, ఏ వర్గం లేదా బృందం ప్రయోజనాలకో లేక ప్రత్యేక అవకాశాలు పొందే సమూహం ప్రయోజనాలకో ప్రాతినిధ్యం వహించటం లేదు. రానున్న కాలంలో నూతన చరిత్ర నిర్మాణానికి ప్రజలపైనే ఆధారపడాలి. ప్రజా ప్రయోజనా లకు అంకితమై ఉండాలన్న పార్టీ మౌలిక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ప్రజల పక్షాన గట్టిగా నిలబడదాం. జనబాహుళ్య పార్టీ వైఖరిని అమలు చేద్దాం. ప్రజల్లోని సృజనాత్మకతను గౌరవిద్దాం. ప్రజలే కేంద్రంగా ఉండే అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేద్దాం. సంపూర్ణమైన జనతా ప్రజాస్వామ్యాన్ని ఆచరణ సాధ్యం చేయాలి. సామాజిక పారదర్శకత, న్యాయాలను కాపాడాలి. అభివృద్ధి క్రమంలో ఎదరయ్యే అసమానతలు, కొరతలను అధిగమించాలి. ప్రజలు ఎదర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలి.
చైనా కమ్యూనిస్టు పార్టీ, జనచైనాల ఏర్పాటుకు మార్క్సిజమే మూల పునాదిగా ఉంది. పార్టీకి మార్క్సిజమే ఆత్మ. మార్క్సిజం పతాకాన్ని ఎగరవేయటానికి శాయశక్తులా పని చేస్తుంది. మార్క్సిజం మౌలిక సూత్రాలు, సత్యాల నుంచి వాస్తవాలను గ్రహించాలన్న ప్రమాణాలే చైనా కమ్యూనిస్టు పార్టీకి శిరోధార్యం. చైనా ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని వర్తమాన పరిణామాల్లో ప్రధాన లక్షణాలను గ్రహించాం. చొరవ ప్రదర్శించాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అన్వేషణలు గావించాం. ఇటువంటి కృషి ద్వారానే చైనా నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా, వర్తమాన సమస్యలు పరిష్కరించు కునేందుకు వీలుగా మార్క్సిజాన్ని వర్తింప చేసుకుంటూ వచ్చాం. మహత్తరమైన సామాజిక విప్లవ పయనంలో చైనా ప్రజలకు మార్గదర్శిగా నిలిచాం. స్థూలంగా చూసినప్పుడు పెరుగుతున్న పార్టీ సామర్థ్యం, చైనా లక్షణాలతో సోషలిజం నిర్మాణాన్ని బలోపేతం చేయటానికి అందుబాటులోకి వస్తున్న అవకాశాలే మార్క్సిజం సజీవశాస్త్రమని నిరూపించటానికి తిరుగులేని ఉదాహరణలు.
నూతన దశలో చైనా ప్రత్యేక లక్షణాలతో కూడిన సోషలిజం గురించిన అవగాహనను సంపూర్ణంగా అమలు చేయాలి. మార్క్సిజం ప్రాతిపదికగా సమకాలీన పరిణామాలను, ఘటనలను గుర్తించటానికి, అధ్యయనం చేయటానికి, అర్థం చేసుకోవటం ద్వారా 21వ శతాబ్దిలో సమకాలీన చైనాకు వర్తింపచేయాల్సిన మార్క్సిస్టు పంథాను రూపొందించుకుంటాం.
మనదైన విలక్షణ పంథాను, మార్గాన్నే మనం అనుసరిస్తాం. మన విలక్షణ పంథాకు గత శతాబ్ది కాలంలో మనం అమలు చేసిన పార్టీ విధానాలే ప్రాతిపదికగా ఉంటాయి. గత శతాబ్దకాలంలో పార్టీ సాగించిన నిరంతర పోరాటాల్లో రూపొందించుకున్న సూత్రాలు, అవగాహనలే ఈ విధానాలు.
రానున్నకాలంలో పార్టీ మౌలిక సిద్ధాంతానికి, వైఖరికి, విధానానికి కట్టుబడి ఐదు కోణాల్లో సమీకృత ప్రణాళికను , నాలుగంచెల సమగ్ర వ్యూహాన్ని అమలు చేయాలి. మెరుగైన నాణ్యతతో కూడిన అభివృద్ధిని సాధించాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైనాను అగ్రగామిగా మల్చాలి. ప్రాధమిక న్యాయసూత్రాల ఆధారంగా పాలన సాగించాలి. మౌలిక సోషలిస్టు విలువలను పరిరక్షించాలి. ప్రజా సంక్షేమం, సౌభాగ్యం కేంద్రంగా అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించాలి. ప్రకృతికి, ప్రజలకు మధ్య సంబంధాల్లో సమతుల్యత సాధించాలి. ప్రజల సిరిసంపదలు, ఆయురారోగ్యాలు పెంపొదించేందుకు, చైనాను శక్తివంతమైన సుందర దేశంగా మల్చాలి.
గత వందేండ్ల పార్టీ నిర్మాణం ద్వారానూ, 70ఏండ్ల జనచైనా పరిపాలన ద్వారానూ పార్టీ తన సంపన్నవంతమైన అనుభవాలు సంపాదించింది. అదేసమయంలో ఇతర దేశాల అనుభవాల నుంచి నేర్చుకునేందుకు కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ ఆతృతతో ఉంది. నిర్మాణాత్మక విమర్శకు, ఉపయుక్త సూచనలకు చైనా కమ్యూనిస్టు ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుంది. మాకు ఎవరో పాఠాలు చెప్పాలని పూనుకుంటే సహించేది లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీ, చైనా ప్రజలు పూర్తి భరోసాతో మేము ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తాం. చైనా అభివృద్ధి పంథాను మేమే నిర్ణయించుకుంటాం. ప్రగతి, ప్రగతి ఫలాలు మా చేతుల్లోనే ఉండేలా వ్యవహరిస్తాం.
మానవాళి భవిష్యత్తు గురించి పార్టీ ఆందోళన చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రగతిశీల శక్తులతో భుజం భుజం కలిపి నడటానికి సిద్ధమవుతోంది.
రానున్న కాలంలో శాంతి, అభివృద్ధి, సహకారం, పరస్పర ప్రయోజనం, స్వతంత్ర విదేశాంగ విధానం, శాంతియుతమైన అభివృద్ధి పంథాలకు చైనా కమ్యూనిస్టు పార్టీ కట్టుబడి ఉంటుంది. నూతన తరహా అంతర్జాతీయ సంబంధాలు పెంపొందించేందుకు కృషి చేస్తాం. ఉమ్మడి భవిష్యత్తు, ఉమ్మడి బెల్డ్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు ద్వారా నాణ్యమైన మన్నికైన అభివృద్ధితో అభివృద్ధి క్రమంలో చైనా సాధించిన నూతన విజయాలు ప్రపంచాభివృద్ధికి నూతన అవకాశాలను అందించనున్నాయి. శాంతి, అభివృద్ధి, పారదర్శకత, న్యాయం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి ఉమ్మడి విలువలు పాటించటం కోసం చైనాతో శాంతియుత సంబంధాలు కాంక్షించే అన్ని దేశాలతో చైనా సంబంధ బాంధవ్యాలు నెరుపుతుంది.
ఘర్షణకంటే సహకారానికే చైనా ప్రాధాన్యతనిస్తుంది. సంబంధాలు రద్దు చేసుకునేకంటే కొనసాగించేందుకే ఆసక్తి చూపుతుంది. ఎవరో ఒకరు లబ్ది పొందే సంబంధాలకంటే ఉభయులకూ ఉపయోగపడే సంబంధాలవైపే చైనా మొగ్గు చూపుతుంది. ఆధిపత్య రాజకీయాలను వ్యతిరేకిస్తుంది. మెరుగైన భవిష్యత్తు దిశగా ప్రపంచాన్ని నడిపించటంలో చైనా తనవంతు పాత్ర పోషిస్తుంది.
న్యాయాన్ని నిలబెట్టడానికి కట్టుబడిన చైనాను ఎవరూ బెదిరించలేరు. రెచ్చగొట్టలేరు. చైనా జాతి గర్వించదగిన జాతి. ఆత్మవిశ్వాసం కలిగిన ప్రజలు. మేము ఏ దేశాన్ని ఎన్నడూ లోబర్చుకోలేదు. అణచివేయలేదు. వలసగా మార్చుకోలేదు. భవిష్యత్తులో సైతం అలాంటి చర్యలకు అవకాశం ఇవ్వబోం. అదేవిధంగా ఏ దేశమూ చైనాను అణచివేయటానికి, లోబర్చుకోడానికి, బలప్రయోగంతో లొంగదీసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. అలా ప్రయత్నించేవాళ్లు 140 కోట్లమంది చైనా ప్రజల ఉక్కు క్రమశిక్షణతో కూడిన జాతితో తలపడటానికి సిద్ధమైతేనే కాలుదువ్వాలి.
ప్రతికూల పరిస్థితులతో పోరాడి విజయం సాధించటమే చైనా కమ్యూనిస్టు పార్టీకి విలక్షణతను తెచ్చి పెట్టింది. రానున్నకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అనూహ్యంగా తలెత్తే ప్రమాదాలను ఎదుర్కోవటానికి సర్వదా సన్నద్ధంగా ఉండాలి. ఇటువంటి ప్రమాదాలు శాంతియుత సమయాల్లోనూ తలెత్తవచ్చు. జాతీయ భధ్రత వ్యూహం జాతీయాభివృద్ధి, రక్షణ అవసరాలు, విస్తృతార్థంలో జాతీయ పునరుద్థాన లక్ష్యాలు, శతాబ్దికాలంలో అరుదుగా చోటుచేసుకునే పరిణామాలను గమనంలోకి తీసుకుని రూపొందించ బడుతుంది. చైనా సమాజంలోని మౌలిక వైరుధ్యం నేపథ్యంలో ముందుకొస్తున్న మార్పులు, వాటి లక్షణాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అనుకోకుండా తలెత్తే సమస్యలు వంటివాటిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. ఈ సవాళ్లను అధిగమించటంలో నిరంతరం పోరాట పటిమను ప్రదర్శించేందుకు, విన్నూత మార్గాలు అన్వేషించేందుకు, నూతన సంబంధాలు నెలకొల్పుకునేందుకు కావల్సిన అన్ని చర్యలూ చేపట్టాలి.
పార్టీని రాజకీయంగా బలోపేతం చేయటమే మన ప్రాధాన్యత కలిగిన కర్తవ్యంగా ఉంటుంది. నూతన దశకు అవసరమైన నూతన పార్టీ నిర్మాణం కోసం మనం కృషి చేయాలి. పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలి. పకడ్బందీగా మల్చాలి. మెరుగైన నైపుణ్యం కలిగిన అధికారులను తయారు చేసుకోవాలి. ఈ శ్రేణికి చెందిన పార్టీ సిబ్బంది వృత్తిపరమైన సామర్ధ్యాన్ని నైతికతను కలిగి ఉండాలి. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి. పార్టీ విస్తరణకు ఎదరయ్యే అవరోధాలను అధిగమించేందుకు కృషి చేయాలి. పార్టీ నిర్మాణానికి ఎటువంటి వైరస్‌లు సోకుండా జాగ్రత్తపడాలి. పార్టీ తన స్ఫూర్తి, రంగు, స్వభావం పరిరక్షించుకునేలా మన పని ఉండాలి. నూతన దశలో చైనా ప్రత్యేకతలతో కూడిన సోషలిజాన్ని అభివృద్ధి చేయటానికి వీలుగా సమర్థవంతమైన పార్టీ కేంద్రాన్ని, కేంద్ర నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలి.
భవిష్యత్తు యువతరానిదే. మా ఆశలు కూడా వాళ్లపైనే ఉన్నాయి. శతాబ్ది క్రితం కొద్దిమంది ప్రగతిశీలురైన యువకులు మార్క్సిజం అనే దీపంతో అంధకారబంధురమైన చైనాకు జ్ఞానవెలుగులు అందించే అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. నాటి నుంచీ చైనా కమ్యూనిస్టు పతాకం నీడలో ఒక తరం తర్వాత మరో తరం యువకులు పార్టీ నిర్మాణానికి, ప్రజా ప్రయోజనాలకు తమ జీవితాలను అంకితం చేశారు. చైనా జాతీయ పునర్నిర్మాణ యజ్ఞంలో కవచంగా నిలిచారు.
*ప్రియమైన పార్టీ సభ్యులారా*
పార్టీ సభ్యులందరూ పార్టీ వ్యవస్థాపక లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి. ఆదర్శాలకు, నిబద్ధతలకు అంకితమై ఉండాలి. పార్టీ కేటాయించిన కర్తవ్యాన్ని నెరవేర్చే క్రమంలో నిరంరతం ప్రజలతో మమేకం కావాలి. వాళ్ల సాధకాల పట్ల సానుభూతి కలిగి ఉండాలి. అనుకూల ప్రతికూల సమయాల్లో ప్రజల పక్షాన నిలవాలి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చటానికి విశ్రమించకుండా పని చేయాలి. ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించేందుకు కృషి చేయటం ద్వారా పార్టీ కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలి.
పార్టీ ఏర్పాటు చేసిన వందేళ్ల తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ చైనా దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దే కృషిలో నిమగమై ఉంది. ఇప్పటివరకూ సాగిన ప్రయాణాన్ని, మనముందున్న లక్ష్యాన్ని, దానికోసం ప్రయాణించాల్సిన దూరాన్ని గమనిస్తే స్పష్టమైన పార్టీ నాయకత్వం, చైనాలోని వివిధ జాతుల ప్రజల మధ్య ఐక్యతతోనే సర్వతో ముఖాభివృద్ధిని సాధించగలం. చైనాను ఆధునిక సోషలిస్టు దేశంగా తీర్చిదిద్దగలం. చైనా జాతీయ పునర్నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోగలం.
- జీ జిన్పింగ్
- అనువాదం: కొండూరి వీరయ్య

Post a Comment

0Comments

Post a Comment (0)