ఎడారులు...!

Telugu Lo Computer
0


దీపు సెలవులకి దుబాయ్ లో ఉన్న పిన్ని గారింటికి వెళ్ళొచ్చాడు. సినిమాల్లో చూడటమే కానీ, ప్రత్యక్షంగా ఎడారిని చూడటం ఇప్పుడే! ఫొటోల్లో ఒంటెలు బారులుగా నడిచిపోతూ, బంగారు రంగు ఇసుకతో ఎంతో అందంగా కనిపించే  ఎడారి దగ్గరగా చూస్తే ఎంతో వేడిగా, నడుస్తుంటే కాళ్ళు కూరుకుపోతూ వింత అనుభూతి కలిగించింది. 

దుబాయ్ లో టూరిజం వాళ్ళు ఎడారిలో "డ్యూన్ రైడ్" కి తీసుకెళతారు. ఆ ప్రయాణం కూడా ఎంతో సాహసోపేతంగా అనిపించింది. ఇసుక మేటలమీద పైకి ఎగురుతూ, హఠాత్తుగా కిందికి దిగుతూ చేసే జీప్ ప్రయాణం కడుపులో తిప్పేసినట్టయింది. 

ఈ విశేషాలన్నీ స్కూల్ కి వచ్చి స్నేహితులకి కధలుకధలుగా చెప్పాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పద్మజ టీచర్ క్లాస్ లోకొచ్చారు. 

"దీపు మొహంలో ఏదో  కొత్తకాంతి కనిపిస్తోంది, ఏంటి విశేషం" అనడిగారు. 

"మన దీపు ఈ సెలవుల్లో దుబాయ్ వెళ్ళొచ్చాడు టీచర్. అక్కడ ఎడారిలో రైడ్ కి వెళ్ళాడుట. ఆ విశేషాలు చెపుతున్నాడు" అన్నాడు రఘు. 

"ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎడారులు ఉన్నాయి? అసలు ఎడారులు ఎలా ఏర్పడతాయి టీచర్" అనడిగారు పిల్లలంతా ఆసక్తిగా! 

"స్థూలంగా చెప్పాలంటే....వాతావరణంలో వచ్చే మార్పులు, బలంగా వీచే గాలులకి పెద్ద పెద్ద రాళ్ళు పగిలి చూర్ణమై చిన్న ఇసుక రేణువుల్లాగా ఏర్పడి ఎడారులుగా రూపొందుతాయి. దీనికి చాలా కాలం పడుతుంది."

"మన దేశం లో రాజస్థాన్ రాష్ట్రంలో పడమటి దిశగా విస్తరించి ఉన్న ఎడారే "థార్ ఎడారి". ఎడారుల్లో పగలు అతి వేడిగాను, రాత్రుళ్ళు అతి చల్లగాను ఉంటుంది. 

"సరే ఇక మన ఎడారుల విషయానికి వస్తే.... వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో సాధారణంగా ఎడారులు ఏర్పడతాయి. పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు పగలు ఎండకి బాగా వేడెక్కి వ్యాకోచం చెందుతాయి. రాత్రుళ్ళు చలికి మళ్ళీ సంకోచం పొందుతాయి. ఒక్కోసారి ఎండకి బాగా వ్యాకోచం చెందిన కొండల మీద హఠాత్తుగా వర్షం పడితే అవి సంకోచం చెంది రాళ్ళు పగులుతాయి. ఇలా ఎన్నో వందలు, వేలు ఏళ్ళు గడిచాక ఆ ప్రాంతంలో వర్షపాతం లేనప్పుడు ఈ సంకోచ వ్యాకోచాలకి పగిలి చిన్న రాళ్ళుగా, ఆ తరువాత వీచే విసురు గాలికి చూర్ణంగా మారతాయి.  ఇలా అతి చిన్నవిగా పగిలిన రాళ్ళు ఇసుకగా ఎడారుల్లోను, నదుల అడుగు భాగంలో ఒక బెడ్ లాగాను ఏర్పడతాయి. భూమి మీద కప్పబడిన రాతి చూర్ణం మొక్కలు మొలవటానికి ఉపయోగ పడుతుంది."

"నదుల్లో చేరిన ఇసుకని, నీరు ఎండిపోయినప్పుడు తవ్వి నిర్మాణ రంగానికి ఉపయోగిస్తారు. మీరందరు ఇళ్ళ నిర్మాణం చూసే ఉంటారు. అందులో వాడే ఇసుక ఇలా నదుల అడుగు భాగం నించి తవ్వి తీసినదే." 

"మొక్కలు ఉండి పంటలు పండే చోట కూడా, ఒక్కోసారి కొన్నేళ్ళపాటు వర్షాలు పడక అక్కడుండే మొక్కలు క్రమేణా ఎండిపోయి, చనిపోయి ఆ భూమి బంజరుగా మారుతుంది. అదే కొన్ని ఏళ్ళకి ఎడారిగా మారిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు మన దేశంలో ఉన్న "థార్ ఎడారి" మీదుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం సరస్వతి నది ప్రవహించేదని...అక్కడ మనుషులు వందలు, వేలల్లో జీవించేవారని మన భూగర్భ శాస్త్ర పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ సరస్వతి నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, నేటి థార్ ఎడారి మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసిందని మన ఉపగ్రహ చిత్రాలు నిరూపిస్తున్నాయి. ఆ విషయాన్ని మన జాతీయ గీతం లోని  "వింధ్య హిమాచల జమునా, గంగా, సరస్వతి" అనే మాట ద్వారాను, మన వేద మంత్రాల సంకల్పంలోని "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి" అనే మాటల ద్వారా తెలుసుకోవచ్చు."

"ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే, ఒకప్పుడు నిండుగా ప్రవహించిన నదులు కూడా క్రమేణా తమ జల సంపదని అనేక చారిత్రక కారణాలవల్ల కోల్పోయి ఎడారులుగా మారటానికి అవకాశం ఉంది". 

"ఎండ, గాలి వల్ల రాళ్ళు ఇసుకగా మారి ఎడారులుఏర్పడుతున్నాయి అని తెలుసుకున్నాం కదా! ఎడారుల్లో వర్షం ఉండదు కనుక పంటలు పండవు. నీరు ఉండదు. అందువల్ల అక్కడ ఉండే వాతావరణం ప్రజలు నివసించటానికి యోగ్యంగా ఉండదు. ఉత్తర, దక్షిణ ధృవాల్లో కూడా వర్షపాతం లేక పంటలు పండని బంజరు భూములున్నాయి. వాటిని శీతల ఎడారులంటారు. అక్కడ సాధారణ మానవులు, జంతువులు బ్రతకలేవు."

"కానీ అక్కడ కూడా కొన్నిరకాల జంతువులు బ్రతుకుతున్నాయి. అవే ఒంటెలు, ధృవ ప్రాంతపు ఎలుగుబంట్లు, గాడిదలు, ఎడారి పాములు, పెద్ద పెద్ద బల్లులు."

"కాక్టస్ అనే ఒక రకం మొక్కలు ఎడారుల్లో బాగా పెరుగటం మనం చూస్తుంటాము. ఎడారుల్లో బ్రతికే ఈ జంతువులు, మొక్కలు తమ మనుగడకి అవసరమైన నీటిని ఉషోదయాన ఉండే మంచి బిందువులనించి గ్రహిస్తాయి."

"ఎడారుల్లో వీచే గాలులవల్ల ఒక చోటి నించిమరొక చోటికి కొట్టుకుపోయిన ఇసుక పెద్ద మేటలుగా ఏర్పడుతుంది. ఆ ఇసుక మేటలు చూడటానికి పెద్ద పర్వతాల లాగా ఉంటాయి. ఎడారుల్లో ఒక్కొక్క సారి కొన్ని చోట్ల చిన్న గుంతలు ఏర్పడతాయి. అరుదుగా వచ్చే వర్షం వల్ల ఆ గుంతల్లో నీరు చేరుతుంది. ఆ నీటితో ఎడారిపంటలైన ఖర్జూరాలు,
ఈత పండ్లు పండుతాయి. ఈ నీరు సరిపోయే తాటి చెట్లు కూడా ఎడారుల్లో పెరుగుతాయి."
"ఎడారుల్లో లభించే ఈ నీటిని 'ఒయాసిస్సులు ' అంటారు.
ప్రపంచం లో ఉన్న ముఖ్యమైన ఎడారులు: (చ. కి మీ లలో)
అరేబియా ఎడారి. 26,౦౦,౦౦౦
మంగోలియా లోని గోబి ఎడారి 13,00,000.
ఆస్ట్రేలియా లోని గ్రేట్ విక్టోరియా ఎడారి 6,47,000
ఆఫ్రికాలోని కలహరి ఎడారి 5,70,000
సిరియన్ ఎడారి. 4,90,000
అంటార్క్ టికా ఎడారి
అనే చోట్ల విస్తరించి ఉన్నాయి.
"ఇదర్రా, ఎడారుల చరిత్ర! ఇలా జరిగే అనేక క్రియ-ప్రతిక్రియలవల్ల ప్రకృతిలో అనేక అద్భుతాలు ఆవిష్కరించబడతాయన్నమాట!"
"ఈ సారి ప్రకృతిలోని మరిన్ని వింతల గురించి మాట్లాడుకుందాము" అని టీచర్ బయటికి నడిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)