శ్రీ విజయేంద్ర సరస్వతి

Telugu Lo Computer
0


*క్రీస్తుకు పూర్వం సుమారు 5శతాబ్దాల కిందట     ఆద్య శంకరాచార్యులచే స్థాపించబడిన శ్రీ కంచికామకోటిపీఠం అధిపతుల పరంపరలో 1983,  మే నెల 24 తేది సోమవారంనాడు ఆ పీఠాన్ని అధిష్ఠించిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి 70వ వారు.

*శ్రీశంకరభగవత్పాదులనుంచి నేటివరకు రమారమి రెండువేలఅయిదు వందల సంవత్సరాలు కామకోటిపీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా,    నిరంతరాయంగా కొనసాగడం మఠానుయాయులకేకాక, హిందువు లందరికీ హర్షదాయకం. ఆరేడు సంవత్సరాలక్రితం కామకోటిపీఠాధిపతి శ్రీజయేంద్రసరస్వతి స్వామి, అప్పటికి పదునాలుగేళ్ళు నిండీనిండని శంకరం అనే ఒక వేదవిద్యార్థికి కంచిలో,    శ్రీ కామాక్షీఅమ్మవారి సన్నిధిలో యధావిధిగా గురూపదేశం చేసి, సన్యాసదీక్ష ఇచ్చారు.

*పద్నాలుగేళ్లు నిండని ప్రాయంలో           శ్రీ జయేంద్ర సరస్వతులచే గురూపదేశం పొంది ఆశ్రమస్వీకారం చేసిన        ఆ బాలసన్యాసి ఎవరు? ఏమా బాలుని బుద్ధికుశలత? ఎందరో వేదవిద్యార్థు లుండగా, ఏ కారణం చేత అతడే కాంచికామకోటి భవిష్యత్‌ పీఠాధిపతిగా వరించబడవలసి వచ్చింది?

*’పొన్నేరి’కి సమీపాన ‘తండలం’ అనే చిన్నగ్రామంలో ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబం.    ఆ గ్రామంలో బ్రహ్మ శ్రీ ముక్కామల కృష్ణమూర్తిశాస్త్రి అనే వేదపండితుని నాల్గవ పుత్రరత్నం నేటి విజయేంద్రుడు. 

*పూర్వాశ్రమంలో తల్లితండ్రులు ఆ బాలుడికి పెట్టిన పేరు శంకరం. అయిదవతరగతివరకు శంకరం మామూలు పాఠశాలలో చదివాడు. అప్పటినుంచే తన అన్నదమ్ముల కంటే, తన క్లాసులోని తోటి విద్యార్థుల కంటె కూడా కుశాగ్రబుద్ధిగా గుర్తించబడుతూ వచ్చాడు.

*తండ్రి శ్రీ కృష్ణమూర్తిశాస్త్రి తన తనయుని మేధాసంపత్తిని గుర్తించారు. మామూలు పాఠశాలచదువుకు స్వస్తి చెప్పించి, తనవద్దనే పోలూరు వేదపాఠశాలలో వేదం చెప్పసాగారు.*

*అదిమొదలు ఏడుసంవత్సరాలు శంకరం వేదాధ్యయనం చేశాడు. వేద విద్యార్థులకు ఏటేటా తంజావూరు, తిరుచిరాపల్లిజిల్లాలలో జరిగే వేదపరీక్షలన్నిటిలో శంకరం ప్రథమబహుమతిని పొందుతూ, విద్యార్థులలో అగ్రగణ్యుడవుతూ వచ్చాడు.

*సామాన్యంగా ఏడేళ్లు చదవవలసిన ఋగ్వేదాన్ని మూడుసంవత్సరాలలోనే పూర్తి చేశాడు.

*ముసిరిలో జరిగిన వేదపరీక్షలో తమిళనాడులోని 48 వేదపాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అన్ని వందలమంది విద్యార్థులలోనూ   ఆ సంవత్సరం శంకరమే అగ్రేసరుడై ప్రథమబహుమతిని సంపాదించాడు. శంకరం ఏకసంథాగ్రాహిగా పండితులు గుర్తించారు.

*బాలశంకరుని మేధాసంపత్తికి, సమయస్ఫూర్తికి తార్కాణంగా మరొక సందర్భాన్ని పేర్కొనవచ్చు….   ఒక సంవత్సరం కంచికామకోటిపీఠంలో      శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి ఆధ్వర్యంలో నవరాత్రిపూజ జరుగుతూ ఉండగా పండితులు చదివే వేదమంత్రాలలో             ఒక ప్రమాదం వాటిల్లింది. అంతటి మహాసభలో పండితు లెవ్వరూ గమనించని ఆ దోషాన్ని శంకరం ఒక్కడే కనిపెట్టి, దానిని సభవారి దృష్టికి తేవడం, అప్పు డా బాలుని థీశక్తిని               శ్రీ జయేంద్రసరస్వతు లెంతో ప్రశంసించడం జరిగింది. తన అనంతరం కామకోటిపీఠాధిపతిగా ప్రతిభావంతుడైన ఈ బాలుని నియమించుకోవాలనే సంకల్పం                       శ్రీ జయేంద్రసరస్వతికి అప్పుడే ఉదయించిందేమో!*

*అటు తరువాత శ్రీ జయేంద్రసరస్వతి             ఈ విషయం పరమాచార్యులకు నివేదించి, ఉభయులూ సంప్రతించుకొనిన పిమ్మటనే శంకరం తల్లిదండ్రులకు తమ నిశ్చయాన్ని వెల్లడించారు.

*తల్లిమాత్రం ప్రేమాస్పదుడైన తన కుమారుడు తన కంటిఎదుట లేకుండ, విరాగి కావలసివచ్చెనే అని ఆదిలో కొంత విచారపడినా, కొడుకు    కామకోటి మహా పీఠాన్ని అధిష్ఠించి, జగద్గురువు కాగలడన్న ఉత్సాహంతో ఆమె తన సమ్మతిని కూడా తెలియజేసింది.

*శంకరం సన్యాసదీక్ష వహించడానికి 1983 మే నెల 29 తేదీన ముహూర్తం నిర్ణయించబడింది. దీక్ష స్వీకారానికి ముందు వ్రతాలు, ఉపవాసాలు, నియమనిష్ఠలు మొదలైన కార్యకలాపమంతా, పితృకర్మతో సహా యధావిధిగా, సంప్రదాయ బద్ధంగా                శ్రీ జయేంద్రసరస్వతుల పర్యవేక్షణలో కొనసాగించాడు శంకరం.

*ఒక రాత్రి రాత్రంతా గాయత్రీమంత్రం జపించి, మరుసటి ఉదయం శ్రీకామాక్షీదేవి ఆలయ తటాకంలో వేలాది పురజనుల సమక్షంలో జయేంద్రసరస్వతిచే గురూపదేశం పొంది శంకరం కాషాయాన్ని దండకమండలాలను ధరించి విజయేంద్రసరస్వతిగా అవతరించారు.

*కాషాయవస్త్రాలను, రుద్రాక్షలను, దండకమండలాలను ధరించిన విజయేంద్రుని చూసినవారంతా ఆదిశంకరుడు భూమిమీద తిరిగి అవతరించాడా అని భావించారు. 

*ఆశ్చర్యకరమైన విషయమేమంటే 'యథాకృతి స్తత్రగుణా భవంతి' అన్నట్టు సకలజనాకర్షకమైన ఆకృతికి తోడు, దానికి సదృశ#మైన గుణమూ, తదనుగుణమైన నామధేయమూ - ఇన్ని గుణాలు ఒక్క వ్యక్తిలో మూర్తీభవించడం నాన్యతో లభ్యం.

*వేదానికీ, ఇతరమతాలకూ భేదం… ఇతరమతాలు తమ మార్గమేహేతువు, తక్కినవి నరక హేతువు అని చెబుతున్నాయి. ఒక గమ్యానికే పెక్కుమార్గా లున్నాయని వేదం ఒక్కటే చెబుతున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)