మీనాక్షీ సుందరేశ్వర స్వామి ఆలయం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 26 July 2021

మీనాక్షీ సుందరేశ్వర స్వామి ఆలయం

ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటి " మదురై ". వేగాయి నది ఒడ్డున ఉన్న ఈ నగరం తమిళనాడులోని అతి పెద్ద నగరాలలో రెండవది. చోళ , పాండ్య , విజయనగర రాజుల పాలనలో అభివృద్ధి చెందిన ఈ నగరం పురాణకాలం నుండీ ఎంతో ప్రసిద్ధమైన అతి ప్రాచీనమైన నగరం భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో ఒకటైన ఈ మదురై నగరంలో సుందరేశ్వర సమేత మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. ఈ ఆలయం గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు

స్థలపురాణం ప్రకారం పాండ్యరాజైన మలయధ్వజుని కుమార్తె ఈ మీనాక్షి అమ్మవారు. మహాభారతం ప్రకారం ఈ మలయధ్వజుడు భారత యుద్ధంలో పాండవుల తరుపు యుద్ధం చేసాడు. ఆయన తపస్సుకి మెచ్చి పార్వతీదేవి ఆయనకు కుమార్తెగా జన్మించి పెరిగి పెద్దదై ఈ నగరాన్ని పాలించి పరమశివుడిని ప్రేమించి ఆయనను వివాహం చేసుకుంటుంది. ఈ ఆలయం పరమశివుడు నటరాజ రూపంలో నృత్యం చేసిన పంచ సభలలో ఒకటి. పద్నాల్గవ శతాబ్దంలో అల్లావుద్ధీన్ ఖిల్జీ , అతని సేనాని అయిన " మాలిక్ కాఫర్  " కూరత్వానికి మన భారతదేశంలో ఎన్నో పట్టణాలు, ఆలయాలు ధ్వంసం అయ్యాయి వాటిలో ఈ మధురై మీనాక్షి అమ్మన్ ఆలయం కూడా ఒకటి. ఆ ముష్కర సేనలు ఈ ఆలయాన్ని శిధిలం చేసి ఇందులోని సంపదను దోచుకొని వెళ్లారు. అలా ముష్కరుల దాడితో దెబ్బ తిని ప్రాముఖ్యాన్ని కోల్పోయిన మధురైకి పునః వైభవాన్ని తెచ్చినది విజయ నగర సామంతులైన నాయక రాజులు.


16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథ నాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు ఈ ఆలయ అభివృద్ధికి పెద్ద ఎత్తున సహాయం చేశాడు. తమిళనాడులో ద్రావిడ సంప్రదాయ శిల్ప సౌందర్యాన్ని అతి స్పష్టంగా చూపే ఆలయాలలో ఈ మీనాక్షీ సుందరేశ్వర స్వామి ఆలయం ఒకటి. మధురై పట్టణానికి నడిబొడ్డున సువిశాల ప్రాంగణంలో నాలుగు మాడ వీధులతో నాలుగు దిక్కులా ఎత్తైన రాజగోపురాలతో అలరారే ఆలయ శోభ ఇంతని వర్ణించలేము. రాజ గోపురాలతో కలిపి మొత్తం పదునాలుగు గోపురాలుంటాయి ఇక్కడ. పదమూడో శతాబ్దంలో పాండ్య రాజులు నిర్మించిన తూర్పు గోపురం అన్నింట్లోనికి పురాతనమైనది కాగా, దక్షిణ గోపురం బాగా ఎత్తైనది. ప్రాంగణ మధ్య భాగంలో శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం, దక్షిణం పక్కన శ్రీ మీనాక్షీ దేవి ఆలయం ఉంటాయి. ఈ రెండు ఆలయ విమానాలను బంగారు రేకులతో నిర్మించారు. భక్తులు ఏ ద్వారం నుండి ఆలయం లోనికి ప్రవేశించినా దక్షిణం పక్క నుండి లోనికి వెళ్లి శ్రీ మీనాక్షి అమ్మన్ ను దర్శించుకోవాలి. ఆ తర్వాతే సుందరేశుని దర్శనం ప్రాంగణంలో ఉన్న " కిలి కూండు మండపం, పుథు మండపం, అష్ట శక్తి మండపం, పాండవ మండపం, వీరవసంత రాయ మండపం" ఇలా ఎన్నో మండపాలు చక్కని శిల్పాలను ప్రదర్శిస్తాయి. అన్నిటిలోకి శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయం ధ్వజస్థంభం, నంది  మండపం ఉన్న " కంబతాది మండపం " అపురూప శిల్పాలకు నిలయం. ఇక్కడి స్తంభాల పైన శ్రీ మీనాక్షి సోమసుందరేశ్వర కళ్యాణ శిల్పాలు, శివ కాళీ తాండవము ,  పాండవ మధ్యముడైన అర్జునుడు పరమేశ్వరుని నుండి పాశుపతాస్త్రం స్వీకరిస్తున్న దృశ్యం ఇలా ఎన్నో శిల్పాలు చూపరుల దృష్టిని ఆకట్టుకొంటాయి. ప్రస్తుతం మ్యూజియంగా మార్చిన వెయ్యికాళ్ల మండపంలో అరుదైన సంగీత స్తంభాలు ఉంటాయి. ఎన్నో అరుదైన రాతి మరియు లోహ శిల్పాలను ఇక్కడ మనం చూడవచ్చు ఉదయం అయిదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తుల కొరకు శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి వార్ల ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతి నిత్యం ఎన్నో అభిషేకాలు, అలంకరణలు, ఆరగింపులు  ,సేవలు జరిగే ఈ ఆలయంలో ప్రతీ ఏటా ఏప్రిల్ నెలలో జరిపే మీనాక్షి సుందరేశ్వరుల " తిరుకళ్యాణం " తప్పకుండా చూడాల్సిన ఓ గొప్ప ఉత్సవం. 

No comments:

Post a Comment