కోవిడ్ శవాలను దోచుకున్నారు!

Telugu Lo Computer
0


గచ్చిబౌలీలోని టిమ్స్ ఆస్పత్రిలో కేర్ టేకర్లుగా చేరిన ఈ దంపతులు ఆ మాటకే కళంకం తెచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా ధర్మపురికి చెందిన చింతపల్లి రాజు, లతశ్రీ లు ప్రేమ వివాహాం చేసుకుని కూకట్‌పల్లి రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్నారు. రాజు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  కరోనా సెకండ్ వేవ్ లో టిమ్స్ లో పనిచేసే వైద్య సిబ్బందిని జగద్గిరి గుట్టనుంచి గచ్చి బౌలీ లోని టిమ్స్ కు తీసుకువచ్చేందుకు నియమించుకున్నారు. వారి పరిచయంతో తన భార్య లతశ్రీని టిమ్స్ లో పేషెంట్ కేర్ టేకర్ గా చేర్పించాడు. కొన్నాళ్లకు రాజుకూడా డ్రైవర్ ఉద్యోగం మానేసి టిమ్స్ లో కేర్ టేకర్ గా చేరాడు. అప్పుల్లో కూరుకుపోయిన వారి దృష్టి టిమ్స్ లో చేరిన పేషెంట్ల బంగారు ఆభరణాలపై పడింది. ఏప్రిల్ 17- మే 25 మధ్య వారు ఏడు నేరాలు చేసారు. మొదటగా లతశ్రీ మృతదేహాలను ఉంచే చోటుకు వెళ్లేది. ఏ మృత దేహంపై బంగారు నగలు ఉన్నాయో గుర్తించేది. అక్కడ ఎవరూ లేనప్పుడు చూసి భర్తను పిలిచేది. రాజు అక్కడకు వెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా శవాలపై ఉన్ననగలు తీసి జేబులో వేసుకుని వెళ్లి పోయేవాడు. తర్వాత తన డ్యూటీ తను చేసుకునేవాడు. ఇలా దొంగిలించిన బంగారాన్ని జగద్గిరి గుట్టలోని జగదాంబ జూవెలర్స్ లో కుదువ పెట్టి అప్పులు తీర్చాడు.

ఇలా వుండగా ఉప్పరపల్లికి చెందిన ఉమాదేవి అనే మహిళ కోవిడ్ తో మరణించింది. ఆమె ఒంటిపై ఉన్న మూడు తులాల పుస్తెలతాడు, చెవి దిద్దులు, యూసఫ్ గూడ కు చెందిన సుల్తానా ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారు గాజులు దిద్దులు, జవహర్ నగర్ కు చెందిన భిక్షపతి తల్లిమెడలోంచి గుండ్లమాల దొంగిలించారు. నాచారానికి చెందిన కోటమ్మ ఐసీయూలో ఉండగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు కాజేశారు కొన్నాళ్లకు ఆమెను టిమ్స్ నుంచి వేరొక ఆస్పత్రికి మార్చాల్సి వచ్చింది. ఆసమయంలో వారి కుటుంబ సభ్యులు ఈ విషయం గుర్తించారు. ఈ మేరకు ఆభరణాలు మాయమవ్వడంపై గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు. టిమ్స్ లో ఉన్న తమ పేషెంట్ల నగలు పోయాయని మొత్తం ఏడు కేసులు గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ లో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రాజు దంపతులు ఒక మృతదేహం నుంచి బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్ కూడా దొచుకున్నారు. ఇటీవల ఆ సెల్ ఫోన్ ను ఆన్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ సెల్ ఫోన్ ఆచూకి కనుగొన్నారు. దీంతో పోలీసులు రాజు, లతశ్రీలను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా తాము చేసిననేరాలు అంగీకరించారు. వీరి వద్దనుంచి 10 తులాల బంగారం, రూ. 10లక్షల విలువైన ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు సంస్ధల్లో తాకట్టుపెట్టిన నాలుగు బంగారు గాజుల్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)