శెభాష్‌ కేరళ

Telugu Lo Computer
0


కట్న పిశాచాలకు కేరళలో కళ్లెం వేస్తున్నారు. పదండి! మనమూ ఒక చేయ్యేద్దాం. అతి పెద్ద సామాజిక రుగ్మత 'వరకట్నం'. డబ్బే అన్నిటికీ తలమానికమైన వేళ, డబ్బులోనే మానవ సంబంధాలతో సహా అన్నీ నిర్వహించబడే వేళ ఒక రాష్ట్రంలో ఒక పార్టీ పూనుకుంటే అంతమయ్యే జాడ్యం కాదు. కానీ, ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు మొదలుపెట్టాల్సిందే కదా! కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం చేసిన అంకురార్పణ దేశ సామాజిక జీవితంలో పెను ప్రకంపనలు సృష్టిస్తుందనడంలో ఎట్టి సందేహం లేదు. వరకట్న దురాచారం అన్ని కులాల్లోకి, మతాల్లోకి సైతం చొచ్చుకుపోయింది. బహుశా ఇది అతిపెద్ద సామాజిక తిరుగుబాటుకు దోహదం చేస్తుందనడం అతిశయోక్తి కాదు.

''ఆడపిల్ల గుండెల మీద కుంపటి'' వంటి డైలాగులు సినిమాల్లోనే కాదు నిత్యజీవితంలోనూ తారాస పడుతుంటాయి. ఆడపిల్ల పుడితే ఆ తల్లే తిరస్కరణకు గురవుతున్న సందర్భాలు కోకోల్లలు. భ్రూణహత్యలకూ ఈ దురాచారమే మూలకారణం. నేటి హిందుత్వ రాజకీయాల్లో గత ఏడేండ్ల పాలనలో స్త్రీ స్థానం సమాజంలో దిగజారుతూనే ఉంది. తాజాల్లో తాజా ఉదాహరణ గోవా బీచ్‌లో లైంగిక వేధింపులకు గురైన ఇద్దరు ఆడపిల్లల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ''అసలు రాత్రి పూట ఆడపిల్లలు బీచ్‌కు ఎందుకు వెళ్లారు?'' అని ప్రశ్నించడాన్ని ఏమని వర్ణించాలి? ''వంటింట్లో ఉండల్సిన ఆడది రోడ్డు మీదకు రాకపోతే అసలీ ఘటనే జరక్కపోదు'' అన్న సంఫ్‌ుపరివార్‌ నేతల పైత్యాన్ని ఏమని ''కీర్తించాగలం?''
కట్నం ఇచ్చుకోలేని స్త్రీలను మానసిక క్షోభకు గురిచేయడమే కాదు, చంపడానికి సైతం వెనుకాడటం లేదంటే ఇంతకంటే క్రూరమైన చర్య మరొకటి లేదేమో. కట్నం కోసం వ్యక్తిత్వాలను అమ్ముకొని మానవత్వాలను మరిచి స్త్రీనొక ఆటబొమ్మగా చూడడం శోచనీయం. ఇలాంటి కేసులు విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రే తెలిపారు. పెండ్లి కావడం లేదని అవమానాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న అమ్మాయిలెందరో? కట్నం ఇచ్చి పెండ్ల్లి చేయలేని తల్లిదండ్రులు కన్నకూతురిని రాత్రికి రాత్రే కడతేర్చి, తామూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయి. వరకట్న వృక్షాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాల్సింది పోయి మన సమాజం దానికి జీవం పోస్తోంది. వరకట్న నిషేధం కోసం చట్టాలు చేసినా ప్రయోజనం కన్పించడం లేదు. వివాహ సమయంలో ఇచ్చిన కట్నం తక్కువైందని, మళ్ళీ ఇవ్వాలంటూ వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.
వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండింటినీ నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం 1961 జులైలో చట్టం తెచ్చింది. ఈ చట్టంలోని లోపాలను సవరిస్తూ 1984లో డౌరీ ప్రొహిబిషన్‌ ఎమెండ్‌మెంట్‌ యాక్ట్‌ తెచ్చారు. అంతేకాకుండా శిక్షకు సంబంధించి 1988లో మళ్ళీ సవరణ చేశారు. వివాహ సమయంలో కానీ, ముందు కానీ వరకట్నం ఇవ్వడం నేరం. ప్రభుత్వ ఉద్యోగులు తాము కట్నం తీసుకోలేదని తెలియజేయాలి. అయినప్పటికీ నూటికి 90శాతం మంది కట్నం తీసుకుంటున్నారు. నూటికో కోటికో ఒకరికి శిక్ష పడుతోంది. వరకట్న హత్యలను కొంతవరకు నిరోధించవచ్చుననే ఆశయంతో 1956 నాటి హిందూ వారసత్వ చట్టం మహిళా హక్కులను మెరుగుపరిచి ఆస్తి హక్కు కల్పించింది. కానీ, ఆశించిన ఫలితం రాలేదు.
వరకట్న వేధింపులకు గురవుతున్న వారిలో పేద, మధ్య తరగతి మహిళలే కాదు.. సంపన్న వర్గాల వారు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, సినీ యాక్టర్లు, వివిధ ఫ్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలూ ఉన్నారు. ఈ వేధింపులు తాళలేక మహిళలు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలనేకం. వివాహిత మహిళల పట్ల భర్త, ఇతర కుటుంబ సభ్యుల శారీరక, మానసిక హింస అమానుషమైనదైనప్పటికీ దానికి తగిన శిక్షలు చట్టాల్లో లేకపోవడం ఆశ్చర్యకరం. కానీ, ఆ తరువాత దానిని సవరించారు. అయినా అమలులో చాలా లోపాలున్నాయి. త్వరిత గతిన కేసులు పరిష్కారం కాకపోతే ఎన్ని చట్టాలున్నా ఉపయోగం ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో సఖి కేంద్రాలు, ఫ్రెండ్లీ పోలీసు, షీటీంలు వంటివి ఉన్నప్పటికి న్యాయవిచారణ జరగడంతో ఆలస్యం అవుతుంది. ఇప్పటికీ నాయ్యస్థానాల్లో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కేరళ ఈ నిర్ణయం ద్వారా భాధితులకు సత్వర న్యాయం అందించనుంది.
కేరళలో గత ఐదేండ్లలో 54 ఇలాంటి మరణాలు చోటుచేసుకున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువే అయినప్పటికి ఇలాంటి మరణాలు ఒక్కటి కూడా సంభవించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని సీఎం విజయన్‌ అసెంబ్లీలోనే స్పష్టం చేశారు. ప్రతీ వ్యక్తి కట్నం ఇవ్వకుండా, తీసుకోకుండా సమాజం మైండ్‌సెట్‌ మారాలన్నది స్పష్టం. వరకట్న నిరోధక చట్టం ఉన్నా, గృహ హింస నిరోధ చట్టం ఉన్నా స్త్రీలు నిశ్శబ్దంగా ఈ హింసను భరిస్తూ ఉండటంతో వరకట్న సమస్య లేనట్టుగా నేడు సమాజం భావిస్తుంది. ఆ స్థితికి చేరుకున్న 'ఫార్మాలిటీస్‌' ఎవరికి వారు పరిశీలించుకుంటే 'నో టు డౌరీ' అని గట్టిగా ఎలుగెత్తే అవసరం తెలుస్తుంది. కేరళ ఆ మేరకు హెచ్చరిక చేస్తోంది. ఆ బాటలో ఇతర రాష్ట్రాలు కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)