డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Monday, 5 July 2021

డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ


డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ తూర్పు గోదావరి జిల్లా శంకరగుప్తం గ్రామంలో జులై 6, 1930లో జన్మించారు. గానంతోపాటు, వయోలిన్, మృందంగం, తదితర వాయిద్యాలలో బాలమురళి నిష్ణాతులు.

 కర్ణాటక సంగీతంలో సమున్నత స్థానాన్ని అధిరోహించిన బాలమురళీకృష్ణ హిందుస్థానీ సంగీతం, పాశ్యాత్య సంగీతాల్లోనూ గొప్ప నైపుణ్యం సంపాదించారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు శిష్యులైన బాలమురళి తల్లి సూర్యకాంతమ్మ వీణ కళాకారిణి కాగా, తండ్రి పట్టాభిరామయ్య వేణువు, వయొలిన్, వీణ వాయిద్యాల్లో విద్వాంసులు. వారి నుంచి సంగీతాన్ని ఉగ్గుపాలతో అందుకున్న బాలమురళి, తొలి కచేరీని ఎనిమిది ఏళ్ల వయసులోనే విజయవాడలోని త్యాగరాజ ఆరాధనోత్సవాలలో చేశారు. 15 ఏళ్ళ వయసు వచ్చే సరికే 72 మేళకర్త రాగాల్లో పట్టు సాధించారు.  

 మాతృభాష అయిన తెలుగుతో పాటు సంస్కృతం, కన్నడ, తమిళ భాషల్లో కలిపి దాదాపు 400కు పైగా కర్ణాటక సంగీత బాణీల్లో కృతులు, వర్ణాలు, జావళులు, తిల్లానలు రచించిన బాలమురళి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందుకున్న పురస్కారాలకు లెక్కలేదు.

 కేవలం రచనలు మాత్రమే గాక, గణపతి, సర్వశ్రీ, మహతి, లవంగి తదితర రాగాలను సృష్టించి భారతీయ సంగీతంలో బాలమురళి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. గతి భేదం, సశబ్ద క్రియ వంటి కొత్త రీతులతో తాళ వ్యవస్థను కూడా బలోపేతం చేసిన ఘనత బాలమురళీ కృష్ణదే. 

 భక్త ప్రహ్లాద (1967) చిత్రంలో నారదముని పాత్ర ద్వారా వెండి తెరను అలరించిన బాలమురళీ కృష్ణ మరికొన్ని చిత్రాలలోనూ నటించినప్పటికీ, నటనకన్నా సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. హంసగీతె కన్నడ చిత్రంలో 'హిమాద్రి సుతే పాహిమాం' అన్న కీర్తన ఆలపించిన బాలమురళీ ఈ గానానికి గాను 1976లో ఉత్తమ నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. తర్వాత మాధవాచార్య అనే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారాన్ని స్వంతం చేసుకున్నారు. సినిమాల్లో ఆయన 1957 నుంచే పాటలు పాడారు. ముఖ్యంగా తెలుగులోని గుప్పెడు మనసు చిత్రంలో... మౌనమె నీభాష ఓ మూగ మనసా అన్న పాట ప్రతి హృదయాన్నీ కరిగించింది. 1976, 87లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, 1987లో బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌, 2010లో బెస్ట్‌ క్లాసిక్‌ సింగర్‌ అవార్డులు బాలమురళికి వచ్చాయి.

 జాతీయ స్థాయిలో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ తదితర అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఈ మహోన్నత సంగీత విద్వాంసుడు 2005లో ఫ్రెంచి ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక షెవాలియర్ గౌరవాన్ని పొందారు. సంగీత రంగంలో గౌరవ డాక్టరేట్లు అందుకున్న ఈ సంగీత శిరోమణి, మద్రాసులోని మ్యూజిక్ అకాడెమీ నుంచి సంగీత కళానిధి పురస్కారాన్ని సాధించారు. సంగీత రంగంలో ఈ పురస్కారాన్ని చాలా గొప్పదిగా భావిస్తారు. ఇవిగాక సంగీత కళానిధి, గాన కౌస్తుభ, గాన కళాభూషణ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞాన శిఖామణి, జ్ఞాన చక్రవర్తి, గాన పద్మం, నాద జ్యోతి, సంగీత కళా సరస్వతి, నాద మహర్షి, గంధర్వ గాన సామ్రాట్, జ్ఞానసాగర వంటి ఎన్నో బిరుదులు బాలమురళిని వరించాయి. తన జీవితకాలంలో 25వేలకు పైగా సంగీత కచేరీలు నిర్వహించిన బాలమురళీకృష్ణ, అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా, శ్రీలంక తదితర ఎన్నో దేశాల్లో కచేరీలు చేసి కర్ణాటక సంగీత ఘనతను ఖండాంతరాలు దాటించారు.

No comments:

Post a Comment

Post Top Ad