జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు

Telugu Lo Computer
0


జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రముఖ తెలుగు కవి, ప్రముఖ సినీ గేయ రచయిత.సుమారు 600కి పైగా పాటలు రాశారు.  తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యుడు. పేరడీలు పాటలు రాయడంలో ప్రసిద్ధుడు. తెలుగు శంఖారావం పేరుతో తెలుగు భాష మీద పాటలు రాశాడు. 2005లో రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది.

తెలంగాణా విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవనిర్మాణ దీక్షకై ప్రత్యేక గీతం రాశారు.  జొన్న విత్తుల రాసిన గీతాన్ని వందేమాతరం శ్రీనివాస్‌ గానం చేశారు.  .

జొన్నవిత్తుల స్వస్థలం విజయవాడ. వారిది పేద కుటుంబం. తండ్రి ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఆయన పౌరాణిక నాటకాల్లో పాల్గొనేవాడు. సుమారు మూడువేల పౌరాణిక నాటకాలు వేశారాయన. ఆయన తాత గారికి ఆంధ్ర గంధర్వ అనే బిరుదుండేది. అమ్మవైపు మేనమామ వరసయ్యే దైతా గోపాలం సినిమాల్లో పాటలు రాసేవాడు. చిన్నతనం నుంచి ఆయనలో కవితా ధోరణి ఉండేది. మున్నంగి పూర్ణచంద్రరావు ఈయనను అప్పట్లో బాగా ప్రోత్సహించేవాడు. భాషాప్రవీణ చదివాడు. అప్పుడే ఆయనకు పెద్ద సంస్కృత గ్రంథాలు చదివే అవకాశం కలిగింది. వ్యాకరణ పండితుడు మేడిచర్ల గోపాలకృష్ణమూర్తి, అవధాని కావూరి పూర్ణచంద్రరావు, శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వంటి వారి పరిచయం కలిగింది. భాషాప్రవీణ తర్వాత స్వాతి పత్రికలో సబ్ ఎడిటర్ గా చేరారు.  

చదువు అయిపోయిన తర్వాత 1985 లో ఆసియన్ లాంగ్వేజ్ బుక్ సొసైటీ అనే సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో భాగంగా చెన్నై వెళ్ళారు.   కొద్ది రోజులకు ఆ సంస్థ మూసేయడంతో ఆయన ఉద్యోగం పోయింది. ఒక మిత్రుడి ద్వారా నటుడు మురళీ మోహన్ తో పరిచయం అయింది. మురళీ మోహన్ ఇతన్ని దర్శకుడు కె. రాఘవేంద్ర రావుకు పరిచయం చేశారు.   ఆయన ఈయను విద్వత్తును గౌరవించి ఆయన తర్వాత సినిమా భారతంలో అర్జునుడులో అన్ని పాటలు రాసే అవకాశం కల్పించాడు. కానీ రచయితగా విడుదలైన మొదటి పాట మాత్రం రౌడీ పోలీస్ అనే చిత్రం లోనిది. తర్వాత జంధ్యాల, బాపు లాంటి దర్శకులు ఆయనకు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. ష్ గప్ చుప్ లో ఆయన రాసిన తిట్లదండకం బాగా ప్రాచుర్యం పొందింది. 1989లో వచ్చిన స్వరకల్పన అనే సినిమాలో కేవలం సప్తస్వరాలను మాత్రమే వాడి ఓ పాట రాశాడు. అది తెలుగులోనే మొట్టమొదటి ప్రయోగం. వంశీ సినిమా కోసం ఆయన సంస్కృతంలో రాసిన డిస్కో, జంధ్యాల సినిమాలకు రాసిన తిట్లదండకం, రూపాయి దండకం లాంటివి సినిమా పాటల్లో ఆయన చేసిన వినూత్నమైన ప్రయోగాలు. 1997లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన్ను తెలుగు అధికారభాషా సంఘం సభ్యుడి పదవినిచ్చాడు.

సినిమాల్లో రచయిత కాకమునుపే ఆయనకు పద్య రచయితగా గుర్తింపు ఉంది. ఆయన రాసిన కొన్ని పేరడీలు నచ్చి పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఓ పత్రికలో ప్రచురించే వాడు. దేశమును ప్రేమించుమన్నా అనే గీతానికి పేరడీగా పెండ్లమును ప్రేమించుమన్నా అనే పేరడీ రాశాడు. అది మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. శ్రీశ్రీ రచనలకు పేరడీలు కట్టి ఆయన ముందే వినిపించాడు.

2005లో రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా పెళ్ళాం పిచ్చోడు అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ అది పెద్దగా విజయవంతం కాలేదు కానీ 2005లో కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రజాదరణ పొందిన ఉత్తమ వినోదాత్మక చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకుంది. 2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యంలో అన్ని పాటలు ఆయనే రాశాడు.  పద్యపఠనం, సామాజిక చర్చలు, పాడుతా తీయగా లాంటి కార్యక్రమాల్లో పలుమార్లు అతిథిగా పాల్గొన్నారు.  తెలుగు శంఖారావం పేరుతో ఆయన రాసిన పాటల్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేశాడు.

ఇరవై సంవత్సరాల వయసు నుంచి పేరడీలు రాయడం ప్రారంభించారు.   శ్రీశ్రీ రచన మహాప్రస్థానం, జంధ్యాల పాపయ్య శాస్త్రి రాసిన పుష్ప విలాపం లాంటి వాటికి పేరడీలు రాశారు.   తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాకు రాసిన కాఫీ దండకం కూడా ప్రాచుర్యం పొందింది.

ఈయన పది శతకాలు రచించాడు. అవి శ్రీరామలింగేశ్వర శతకం, బతుకమ్మ,తెలుగమ్మ, సింగరేణి, తెలుగు భాష, నైమిశ వెంకటేశ, రామబాణం, కూచిపూడి, రామప్ప, ఆంగ్లంలో శ్రీరామలింగేశ్వర శతకం. 20 సంవత్సరాల వయసు నుంచి తల్లి సలహాతో తన పుట్టుకకు కారణమైన శ్రీరామలింగేశ్వరుని మీద పద్యాలు రాయడం ప్రారంభించాడు. వీటిలో మంచి పద్యాలను ఏరి శ్రీరామలింగేశ్వర శతకంగా ప్రచురించాడు. ఇవి సమకాలీన తెలుగు సాహిత్యంలో చాలా ప్రాచుర్యం పొందినవి.

Post a Comment

0Comments

Post a Comment (0)