హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

Telugu Lo Computer
0


వారణాసి లో సంత్ తులసీదాసు  నివసిస్తూ ఉండేవాడు. రామ గాన నిరతుడై బ్రహ్మానందము లో  తేలియాడు తుండేవాడు. మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు ఎప్పుడూ వెల్లడవుతుంటాయి. వారి ప్రభావము వల్ల ప్రభావితులయిన జనం వారి ద్వారా రామ నామ దీక్ష తీసుకొని రామనామ రసోపాసనలో తేలియాడు తుండేవారు. యెంతో మంది యితర మతాల వారు కూడా రామ భజనపరులు కావడం జరుగుతున్నది. అయితే తమ నమ్మకాల పట్ల మొండి పట్టుదల కల మతగురువులకు యిది కంటగింపుగా వుండేది. వారు తులసీదాసు మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మన మతాన్ని కించ పరుస్తున్నాడని థిల్లీ పాదుషా వారికి అభియోగాలు పంపుతూ వుండేవారు.

యిది యిలా వుండగా వారాణసిలో వుండే ఒక సదాచార పరుడయిన ఒక గృహస్తు తన ఏకైక కుమారునికి  కుందనపు బొమ్మ లాంటి అమ్మాయితో వివాహం చేశాడు. వారిద్దరూ చిలకా గోరింకల్లా అన్యోన్యంగా కాపురం చేస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు ఒకనాడు  వున్నట్టుండి చనిపోయాడు. ఆ అమ్మాయి గుండెలు  పగిలేలా రోదించింది. ఆ యువతీ   శోకానికి అందరి గుండెలూ ద్రవించి పోయాయి. ఎవరెంత బాధ పడినా జరగవలిసిన వి ఆగవు కదా! ఆ శవాన్ని పాడే మీద పెట్టి తీసుకుని పోతుండగా ఆ అమ్మాయి ఎవరు చెబుతున్నా వినకుండా ఆ పాడే వెనకే రాసాగింది. కొంత మంది  స్త్రీలు ఆమెను గట్టిగా పట్టుకొని వున్నారు. శవయాత్ర సాగిపోతున్నది. త్రోవలో తులసీదాసు ఆశ్రమం ముందుగా వెళుతూ వుంది. ఆ ఆశ్రమము దగ్గరకు రాగానే  ఆ అమ్మాయి అందరినీ విడిపించు కొని ఆశ్రమము లోపలికి పరుగుతీసింది ఆయన ముందు ప్రణ మిల్లింది. ఆయన కన్నులు మూసుకొని వున్నాడు. అందెల, గాజుల  శబ్దము విని కళ్ళు తెరచి తనకు ప్రణ మిల్లిన ఆమెను దీర్ఘ సుమంగళీ భవయని దీవించారు. ఆ యువతీ మరింత బిగ్గరగా ఏడుస్తూ తండ్రీ ఈ నిర్భాగ్యురాలిని దీవించిన తమ లాంటి మహాత్ముల వాక్కు కూడా వ్యర్థమేనని దుఖిస్తున్నాను అన్నది. అప్పుడు ఆయన అమ్మా! రాముడు నా నోట అసత్యం పలికించడే అన్నాడు. బయటకు వచ్చి చూడండి మహాత్మా! నా భర్త విగతజీవుడై వున్నాడు అని చెప్పింది.  ఆయన లేచి వెళ్లి అయ్యా! కొంచెం ఆ పాడెను  దింపండి అని ఆపించి ఆ శవం కట్లు విప్పి రామ నామం జపించి తన కమండలములోని నీళ్ళు ఆ శవముపై చల్లెను. దానితో ఆ శవములో చైతన్యము వచ్చి ఆ యువకుడు లేచి కూర్చుండెను. అది చూసిన జనం ఆయనకు జేజేలు పలుకుతూ భక్తి పూర్వకంగా  నమస్కరించిరి. దీనితో ఆయనకు ప్రాచుర్యం పెరిగి ప్రజలు తండోప తండాలుగా వచ్చి ఆయనను దర్శించి రామనామ దీక్ష తీసుకుని రామ నామాన్ని జపించటం ఎక్కువై పోయింది. మహమ్మదీయ గురువులు థిల్లీ పాదుషా  వారి దగ్గరకి  వెళ్లి తులసీదాసు రామ నామము గొప్పదని అమాయకులైన ప్రజలను మోసగిస్తున్నారని ఫిర్యాదు చేసినారు. దానితో పాదుషావారు తులసీదాసును పిలిపించారు. తులసీ దాసు గారూ మీరు రామనామము అన్నిటికన్నా  గొప్పదని ప్రచారము చేస్తున్నారట నిజమేనా? అని అడిగారు. అందుకు తులసీదాసు అవును ప్రభూ! సృష్టి లో సకలమునకూ ఆధార మయిన రామనామ మహిమను  వర్ణించనెవరి తరము? అనెను. రామ నామము తో సాధించ లేనిది  ఏదీ లేదు. అన్నాడు.

అయితే మేము ఒక శవమును తెప్పించేదము దానికి ప్రాణం పోసి మీ మహత్వమును నిరూపించుకోండి. అన్నాడు పాదుషా. అప్పుడు తులసీదాసు క్షమించండి పాదుషా గారూ జనన మరణాలని ఆపేందుకు మన  మెవరము? అంతా ఆ ప్రభువు ఇచ్చానుసరముగా జరుగు తాయి. మన కోరికలతో ఆయనకు  పని లేదు. అన్నాడు. అప్పుడు పాదుషా రామ నామము అంతా మోసమని మీరు చెప్పేవి అన్నీ అబద్దాలని ఒప్పుకోండి. లేకపోతె మీకు శిక్ష తప్పదు అని బెదిరించాడు.తులసీదాసు ఒప్పుకోన లేదు. అప్పుడు ఆయనను బంధించమని తన సైనికులను ఆజ్ఞాపించాడు పాదుషా. తులసీదాసు మాత్రము చలించకుండా రామ నామము జపిస్తూ  ధ్యాన నిమగ్నుడయ్యాడు. సైనికులు ఆయుధాలు ధరించి ఆయనను బంధించుటకు రాగా ఎక్కడి నుండి వచ్చినాయో వేల కోతులు వచ్చి సైనికుల ఆయుధాలు లాగుకొని వారికే గురిపెట్టి వారిని కదలనీ కుండా చేశాయి. అందరూ ఏ కోతి తమ మీద పడి కరుస్తుంది అని హడలిపోతూ పరుగులు తీశారు. ఈ కలకలానికి కారణమేమని తులసీదాసు కనులు తెరిచి చూశాడు. ఆయనకు సింహ ద్వారము మీద హనుమంతుడు కనిపించాడు. ఆయన దర్శనముతో పులకించిపోయి 40 దోహాలతో "జయ హనుమాన జ్ఞాన గుణ సాగర " అంటూ చాలీసాను ఆశువుగా  గానం చేశాడు.. హనుమంతుడు ఈ  స్తోత్రం తో మాకు ఆనందమును కలిగించావు. నీకేమి కావాలో కోరుకో అని అడిగాడు. మహాత్ము లెప్పుడూ తమ కోసంగాక పరుల కోసమే బ్రతుకుతారు కనుక ఆయన తండ్రీ ఈ స్తోత్రంతో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమిచ్చి కాపాడాలని నా కోరిక అన్నాడు.దానితో సంతోషించిన హనుమంతుడు తులసీ! మాకు అత్యంత ప్రీతీ పాత్ర మైన ఈ చాలీసా తో నన్నెవరు స్తుతించినా వారి రక్షణ భారాన్ని నేను వహిస్తాను అని వాగ్దానం చేశారు. అప్పటినుండీ యిప్పటి వరకూ హనుమాన్ చాలీసా  భక్తుల అభీష్టాలను కామధేనువై తీరుస్తూనే వున్నది  

Post a Comment

0Comments

Post a Comment (0)