ఏటీఎం ద్వారా రేషన్ ...!

Telugu Lo Computer
0


ఒకప్పుడు డబ్బు కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. టెక్నాలజీ రాకతో ఏటియంల ద్వారా డబ్బులు తీసుకోవటం సులభతరమైపోయింది. అయితే ప్రస్తుతం రేషన్ సరుకులు తీసుకునేందుకు చౌక ధరల దుకాణాల వద్ద బారులు తీరాల్సిన పనిలేదు. కొత్తగా ఏటిఎం టెన్నాలజీ వచ్చేసింది. దేశంలోనే తొలిసారిగా హరియాణా   ప్రభుత్వం గురుగావ్ లోని ఫరూక్ నగర్ లో ఈ తరహా ఏటిఎంను ఏర్పాటు చేసింది. రేషన్ ఏటిఎం పేరుతో ప్రజాపంపిణీ వ్యవస్ధలో పారదర్శకతకు అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బయో మెట్రిక్ విధానం ద్వారా ఈ రేషన్ ఏటిఎం వ్యవస్ధ పనిచేస్తుంది. ముందుగా రేషన్ కార్డు దారుడు టచ్ స్ర్కీన్ ద్వారా అధార్ నెంబర్ కాని, రేషన్ కార్డు నెంబరు కాని నమోదు చేయాల్సి ఉంటుంది. సిస్టం ఓకే చేసిన వెంటనే కార్డులో ఎంత మంది పేర్లు ఉంటే దానికి తగ్గట్టుగా బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు ఒకదాని తరువాత ఒకటిగా విడుదలవుతాయి. కార్డు దారుడు చేయవలసిందల్లా మిషన్ క్రింద తాము ఇంటి నుండి తెచ్చుకున్న ఖాళీ సంచిని పెట్టటమే. హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం పట్ల ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో కూడా ఈ తరహా రేషన్ ఏటిఎంలను ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నాయి. తూకాల్లో తేడాలు లేకుండా ఈ విధానం కార్డు దారునికి బాగానే ఉపయోగపడుతున్నా, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఏమేరకు విజయవంతం అవుతుందోనన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా దీనికి ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి.. గ్రామాల్లో నెట్  సిగ్నల్ వ్యవస్ధ సక్రమంగా ఉండకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)