భారత దేశంలో ఆయనదొక శకం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 8 July 2021

భారత దేశంలో ఆయనదొక శకం


ఈ శతాబ్దానికే ఆయన ఆదర్శవంతమైన నాయకుడు. 

ఏడు దశాబ్దాల ప్రజాజీవితంలో మచ్చలేని వ్యక్తిత్వం. 

ఉన్నత విలువలకు ప్రతిరూపం. విప్లవ యోధుడు. 

గొప్ప పరిపాలనాదక్షుడు. మార్క్సిస్టు మేరునగ ధీరుడు. 

పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు. 

ఆయన కోల్‌కతా (కలకత్తా)లో ఇప్పుడు 'మహాత్మా గాంధీ మార్గ్‌'గా మార్చబడిన ఆనాటి 'మారిసన్‌ రోడు'్డలో గల ఓ ఇంటిలో 1914 జులై 8న జన్మించారు. 

1930లో జ్యోతిబసు ఎనిమిదో తరగతి చదివేటప్పుడు బెంగాల్‌లో ఉద్రిక్త వాతావరణం ఉండేది. విప్లవ కార్యకలాపాలు ముమ్మరంగా సాగేవి. రాజకీయాలతో సంబంధంలేని జ్యోతిబసు కుటుంబం కూడా వాటి ప్రభావం కింద ఉండేది.

1930లో గాంధీజీ నిరాహార దీక్ష పూనారు. ఏదో ఒకటి చేయాలని జ్యోతిబసు ఆరోజు కళాశాలకు వెళ్లడం మానేశారు. కొద్ది కాలానికి నేడు షహీద్‌ మీనార్‌ ఉన్న ప్రదేశంలో జరిగిన నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ శాసనోల్లంఘన ఉద్యమ ప్రారంభ కార్యక్రమానికి బసు తన పెదనాన్న కుమారుడితో కలిసి వెళ్లారు. ఖద్దరు ధరించి ఆ సభకు వెళ్లిన ఇద్దరూ పోలీసులు లాఠీలు ఝుళిపించినా అక్కడి నుంచి కదలలేదు. బసు 1935లో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి ఇంగ్లీషు ఆనర్స్‌తో పాసయ్యాడు. తండ్రి కోరికపై బారిష్టరు చదివేందుకు 1935 చివరిలో లండన్‌ చేరుకున్నారు. బసు లండన్‌ చేరుకునేటప్పటికి శరవేగంతో వ్యాపిస్తున్న ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమాలు బసును ఆకర్షించాయి. ఆనాడక్కడ భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఉద్దేశించిన 'ఇండియా లీగ్‌'ద్వారా బసుకు కృష్ణమీనన్‌తో పరిచయం ఏర్పడింది. కొంత కాలానికి భూపేష్‌గుప్తా (అనంతరకాలంలో భారత్‌లో సిపిఐ ప్రముఖ నేత)ను ఓ మిత్రుని నివాసంలో కలుసుకున్నారు. బ్రిటీష్‌ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సంబంధాలు ఏర్పడ్డాయి. అది ఒక విధంగా బసు జీవితంలో ఒక మలుపు. ఆయనను రాజకీయాల్లోకి తెచ్చినవి ఈ ఘటనలే. 1940 జనవరిలో భారత్‌కు తిరిగి వచ్చారు. బసు ప్రభృతులంతా ఇండియాకు తిరిగి వెళ్లగానే పార్టీ హౌల్‌ టైమర్లుగా పనిచేయాలని ఇంగ్లండ్‌లోనే నిర్ణయించారు. ఈ నిర్ణయంతో బసు తండ్రి అసంతృప్తి చెందారు. అదే సమయంలో బసు వివాహ ప్రతిపాదన చేశారు. ప్రెసిడెన్సీ కళాశాలలో తనకు ఇంగ్లీషు అధ్యాపకుడుగా పనిచేసిన ప్రొఫెసర్‌ అనుకుప్‌ ఘోష్‌ కుమార్తె విమలా ఘోష్‌ను వివాహం చేసుకున్నారు. వివాహమైన కొద్ది రోజులకే ఆమె అనారోగ్యంతో మరణించారు. 1941లో బసు తల్లి మరణించారు. నాటి నుంచి బసు పార్టీ కార్యకర్తగా యావత్‌ కాలాన్నీ వినియోగించడం ప్రారంభిం చారు. అక్కణ్ణుంచి బసు బెంగాల్‌ రాజకీయ యవనికపై అంచెలంచెలుగా ఎదిగారు. నాయకత్వ స్థాయీ పెరిగింది. 1941-43 మధ్య బెంగాల్‌, అస్సాం రైల్వే వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1946- 47లో బెంగాల్‌లో సాగిన తెభాగా పోరాటంలోనూ, కార్మిక వర్గ సమ్మెల్లోనూ, మత ఘర్షణల నిరోధంలోనూ గొప్ప పాత్ర వహించారు. 1948లో బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించారు. ఆ సందర్భంగా బసు అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. 1950లో అవిభక్త కమ్యూనిస్టు పార్టీ బెంగాల్‌ రాష్ట్ర కమిటీకి ఎన్నికయ్యారు. 1953 నుంచి 1961 వరకూ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1951లో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి పార్టీ మార్క్సిస్టు పథం నుంచి పక్కకు మళ్లి వక్ర మార్గం పట్టిన 1962లో జాతీయ కౌన్సిల్‌ నుంచి వాకౌట్‌ చేసిన 32 మందిలో జ్యోతిబసు ఒకరు. 1964లో సిపిఐ(ఎం) ఏర్పడిననాటి నుంచి పొలిట్‌బ్యూరో సభ్యునిగా, 2008 నుంచి ఆహ్వానితునిగా బాధ్యతలు నిర్వహించారు. 1948, 49, 53, 55, 63, 65 సంవత్సరాల్లో జైలు జీవితం అనుభవించారు. 1970 మార్చి 31న బీహార్‌ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్‌లో జ్యోతిబసు రైలు దిగుతున్నప్పుడు ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపాడు. అయితే ఆ సమయంలో సిపిఎం అభిమాని అలీ ఇమాం జ్యోతిబసుతో కరచాలనం చేసేందుకు ముందుకు రావడంతో తుపాకీ గుండు ఆయనకు తగిలింది. దానితో ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఆ సమయంలో జ్యోతిబసు నిశ్చలంగా ఉండిపోయారు. ఇమాం ఇంటికి వెళ్లి కుటుంబీకులను ఓదార్చి వారికి తగిన సాయం కోసం ఏర్పాట్లు చేశారు. 1971లో రెండుసార్లు కాంగ్రెస్‌ దుండగులు జ్యోతిబసుపై దాడికి యత్నించారు. దేశం మొత్తం మీద శాసనసభ్యుడిగానూ, ముఖ్యమంత్రిగానూ ఎక్కువ కాలం బాధ్యతలను నిర్వహించింది ఆయనే. స్వాతంత్య్రానికి పూర్వం ఒకసారి, స్వాతంత్య్రానంతరం 11 సార్లు శాసన సభ్యుడిగా పనిచేశారు. 1946లో తొలిసారిగా అవిభక్త బెంగాల్‌ శాసనసభలోకి అడుగుపెట్టారు. 1946 నుంచి 2000లో పార్లమెంటరీ రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా తప్పుకునే వరకూ ప్రతి ఎన్నికలోనూ ఆయన విజయదుందుభి మోగించారు. (1972లో కాంగ్రెస్‌ అర్ధఫాసిస్టు బీభత్సకాండకు పాల్పడి సైన్యం సాయంతో ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటాన్ని నిరసిస్తూ పోటీ నుంచి తప్పుకున్నారు). 1977 జూన్‌ నుంచి 2000 సంవత్సరం నవంబర్‌ వరకూ సిపిఎం నేతృత్వంలోని వామపక్ష సంఘటన పక్షాన 23 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి భారత రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించారు.1977లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెలువరించిన తొలి ప్రసంగంలోనే . 'మా ప్రభుత్వం కేవలం రైటర్స్‌ బిల్డింగ్‌ (బెంగాల్‌ సచివాలయం) నుంచి గాక ప్రజల మధ్య నుంచి పాలన సాగిస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా లేదా శ్రామిక, రైతు పోరాటాలను అణచడానికి పోలీసులను ఉపయోగించ బోము' అని చెప్పారు. తదనంతర కాలంలో ఆ వాగ్దానాన్ని ఆయన నిజం చేశారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. మన దేశ లౌకిక, ప్రజాతంత్ర స్వభావానికీ జ్యోతిబసు దృఢంగా కట్టుబడ్డారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం సిక్కులపై దాడులను నిలువరించడంలోనూ, బాబరీ మసీదు కూల్చివేత అనంతరం బెంగాల్‌లో ఎలాంటి ఘర్షణలూ చోటు చేసుకోకుండా జ్యోతిబసు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఆధునిక భారత భావజాలానికి ఆయన అంతగా సన్నిహితమయ్యారు.

No comments:

Post a Comment

Post Top Ad