ఇరకాటంలో భారత్‌

Telugu Lo Computer
0


2001 నుండి వరుసగా వచ్చిన భారత ప్రభుత్వాలన్నీ కూడా అమెరికా దురాక్రమణకు మద్దతిచ్చేలానే ఆఫ్ఘన్‌ విధానాన్ని అనుసరిస్తూ వచ్చాయి. ఆఫ్ఘన్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణాలకు కోట్లాది డాలర్లను ఖర్చు పెట్టడం ద్వారా జాతి నిర్మాణంలో సాయపడుతూ వస్తున్నాయి. పర్యవసానాల గురించి ఏమాత్రమూ పట్టించుకోకుండానే అమెరికా బలగాల ఉపసంహరణ జరిగిన నేపథ్యంలో ... మోడీ ప్రభుత్వం తన ఏకపక్ష అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని పున:పరిశీలించుకోవాల్సి వుంది. అమెరికాతో అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక పొత్తును కూడా సమీక్షించుకోవాల్సి వుంది.

 ఆఫ్ఘనిస్తాన్‌లో కింది స్థాయి మౌలిక పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. అమెరికా బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తి కావస్తున్న నేపథ్యంలో గత కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా తాలిబన్లు రెచ్చిపోయి, ముందుకు చొచ్చుకు పోతున్నారు. దేశంలో 85 శాతానికి పైగా భూభాగం తమ అధీనంలోనే వుందని తాలిబన్‌ ప్రకటించింది. అయితే, ఇది వాస్తవమా కాదా అనేది పక్కనబెడితే తాలిబన్లు ముందుకు చొచ్చుకుపోవడం ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో రెచ్చిపోతున్న వేగం చూస్తుంటే ప్రతి ఒక్కరూ విస్మయం చెందుతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్ళ యుద్ధం సాగించిన తర్వాత అమెరికా అవమానకరమైన రీతిలో పరాజయాన్ని మూటకట్టుకుంది. 2001 సెప్టెంబరులో అమెరికాలో తీవ్రవాద దాడుల తర్వాత అప్పటి అధ్యక్షుడు బుష్‌ ఆఫ్ఘనిస్తాన్‌పై దాడికి ఆదేశించారు. తీవ్రవాదంపై పోరును ప్రారంభించాలన్నారు. చక్రం గిర్రున తిరిగింది. 1980వ దశకంలో సోవియట్‌ మద్దతు వున్న ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ముజాహిదీన్లకు అమెరికా నిధులు, ఆయుధాలు అందచేసింది. జిహాద్‌లో చేరిన వారిలో ఒసామా బిన్‌ లాడెన్‌ వంటి శక్తులు వున్నాయి. దశాబ్దం తర్వాత, అమెరికా, ముజాహిదీన్ల వారసులైన తాలిబన్లపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అధికారం నుండి తాలిబన్లను కూలదోసిన తర్వాత, అమెరికా తన ఇష్టానుసారం 'ప్రజాస్వామ్య ముసుగు'లో ఒక సరళమైన పాలనను నెలకొల్పింది.

రెండు దశాబ్దాల పాటు వైమానిక యుద్ధం, ప్రత్యేక బలగాల కార్యకలాపాలు ఏవీ కూడా తాలిబన్ల చర్యలను అణచివేయలేకపోయాయి. గత కొన్నేళ్ళలో రెండు లక్షల కోట్ల డాలర్లను ఖర్చు పెట్టిన తర్వాత, 2,312 మంది సైనికుల ప్రాణ త్యాగాల తర్వాత వరుసగా వచ్చిన అమెరికా ప్రభుత్వాలన్నీ తమ ఆక్రమణను, సైనిక బలగాల మోహరింపును తగ్గిస్తూ వచ్చాయి. ఎట్టకేలకు సెప్టెంబరు నాటికల్లా అమెరికా-నాటో బలగాలన్నీ వైదొలగుతాయని బైడెన్‌ ప్రకటించారు. ఈ 20 ఏళ్ళ యుద్ధం ఇప్పటికి 47,600 మంది పౌరుల ప్రాణాలను బలిగొంది. అందులో 40 శాతం అమెరికా వైమానిక దాడుల్లో మరణించినవారే. దోహాలో తాలిబన్లతో ట్రంప్‌ ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. శాంతి ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. కానీ, తాత్కాలిక పరివర్తనా ప్రణాళికకు సంబంధించి ఆఫ్ఘన్‌ ప్రభుత్వ ప్రతినిధులతో తాలిబన్లు జరిపిన చర్చలు స్తంభించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను ఈనాడు అమెరికన్లు వదిలిపెట్టిన తీరు చాలా విచిత్రంగా వుంది. తాము ఆక్రమించుకున్న దేశాలు శిధిలమైన తర్వాత ఆ దేశాలను విడిచి వెళ్లిపోతారు. ఇరాక్‌లో జరిగింది ఇదే.

అమెరికా రూపొందించిన, శిక్షణ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ నేషనల్‌ ఆర్మీ ప్రస్తుత పరిస్థితులకు సరిపోయేలా లేదు. చాలామంది సైనికులు లొంగిపోవడమో లేదా పారిపోవడమో చేస్తున్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ జరిగిన ఆరు మాసాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌ను మొత్తంగా తాలిబన్‌ స్వాధీనం చేసుకుంటుందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేశాయి. అయితే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నంత మాత్రాన సుస్థిరత వచ్చేయదు. ప్రస్తుతం, ప్రభావితం చేయగల జాతుల నేతలతో సంబంధాలు వున్న మిలీషియన్లు రంగంలో వున్నారు. అమెరికాచే శిక్షణ పొందిన సైనికులు వున్నారు. వీరందరూ కలిసి ప్రచ్ఛన్న యుద్ధం నెలకొల్పే పరిస్థితులు సృష్టిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా హింస, ఘర్షణలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇదొక అత్యంత అధ్వాన్నమైన పరిస్థితి కానుంది.

 సంబంధిత పక్షాల అవగాహన ఆధారంగా తాలిబన్‌ ప్రాతినిధ్యంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడమే ఇటువంటి విపత్కర పరిస్థితులను నివారించగలిగేందుకు గల ఏకైక మార్గం. తాలిబన్‌, ఆఫ్ఘన్‌ ప్రభుత్వం, ఇతర ప్రతినిధుల మధ్య ఒక ఒప్పందం కుదరడానికి దోహాలో చివరి యత్నం జరిగింది.

అయితే, ఈ ప్రయత్నాలన్నిటికీ భారత్‌ చాలా దూరంగా వుంది. తాలిబన్లతో తనకు గల సంబంధాలను గతంలోనే విడిచిపెట్టింది. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా దాడికి గానూ సైనిక పరమైన మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చింది. కానీ పాకిస్తాన్‌ ద్వారా తమ కార్యకలాపాలు చక్కబెట్టుకోవాలని అమెరికా భావించింది. ఇది, అప్పటి బిజెపి ప్రభుత్వానికి తీవ్ర నిరాశను కలిగించింది. అప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్‌ వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణ కార్యక్రమాల్లో అమెరికాతో కలిసి భారత్‌ పని చేస్తోంది. మోడీ ప్రభుత్వానికి మరింత అవమాన భారం కల్పించేలా, తాలిబన్లతో చర్చలు చేపట్టాలని అమెరికా నిర్ణయించింది. ఎలాంటి సూత్రబద్ధత లేకుండానే చర్చలకు దిగింది.

ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న మోడీ ప్రభుత్వం దోహాలో తాలిబన్లతో సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నించింది. తాలిబన్లతో అనుసంధానకర్తలుగా వున్న ఇరాన్‌, రష్యా ప్రభుత్వాలతో చర్చలు జరపడానికి విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఆ దేశాలకు పలుసార్లు పర్యటించారు. అయితే, బలవంతంగా తాలిబన్‌ స్వాధీనం చేసుకోవడంలోని చట్టబద్ధతపై సందేహాలు వ్యక్తం చేస్తూ మాస్కోలో పత్రికా సమావేశంలో జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, ప్రస్తుతం తలెత్తుతున్న వాస్తవికతలకు భారత్‌ దూరంగా ఎలా వుందో తేటతెల్లమవుతోంది.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ నుండి అమెరికన్లు వైదొలగుతుండడంతో, ఇప్పుడు దృష్టి అంతా, అక్కడ శాంతి భద్రతలతో ప్రత్యక్ష ప్రమేయమున్న ప్రాంతీయ శక్తులపైకి మళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్‌ పొరుగు దేశాలైన రష్యా, చైనా, భారత్‌, పాకిస్తాన్‌, సెంట్రల్‌ ఆసియా దేశాలైన తజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, కిర్గిస్తాన్‌, కజకస్తాన్‌లు సభ్య దేశాలుగా వున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ)లో ఆఫ్ఘనిస్తాన్‌,  ఇరాన్‌లు అబ్జర్వర్‌ హోదాలో వున్నాయి. ప్రస్తుతం తజకిస్తాన్‌ రాజధాని నగరమైన దుషాంబెలో 13, 14 తేదీల్లో ఎస్‌సిఓ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఎస్‌సిఓ కాంటాక్ట్‌ గ్రూపు కూడా సమావేశమైంది. ఈ సమావేశానికి హాజరవుతున్న జై శంకర్‌ ప్రాంతీయ దేశాల మద్దతు కలిగిన రాజకీయ పరిష్కారం కోసం ఎస్‌సిఓ చేస్తున్న సమిష్టి కృషిలో చేతులు కలపగలరని ఆశిస్తున్నారు.

తాలిబన్‌కి సాంప్రదాయ మద్దతుదారైన పాకిస్తాన్‌కి సంబంధించినంత వరకు, ఇదొక అనూహ్యమైన పరిస్థితే. దీనివల్ల ఆ దేశ ప్రయోజనాలు, సుస్థిరత దెబ్బతినవచ్చు. పాక్‌ జాతీయ భద్రతా సలహాదారు మొయీద్‌ యూసుఫ్‌ ఈ నెల 9న పాకిస్తానీ పార్లమెంట్‌ విదేశీ సంబంధాల కమిటీ సెనెట్‌ ముందు హాజరై మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్‌ విస్తృత విధాన చట్రాన్ని వెల్లడించారు. మొదటగా, తాలిబన్‌, ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి మధ్య అధికార పంపిణీ ఒప్పందం జరిగేలా ప్రయత్నాలు చేయాలి. రెండవది, ఆఫ్ఘనిస్తాన్‌లో అస్థిరత కారణంగా పాకిస్తాన్‌ లోకి వస్తున్న శరణార్ధుల వెల్లువను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా కింది స్థాయిలో నెలకొన్న పరిస్థితులు ప్రతీదాన్నీ అధిగమిస్తున్నాయి. మొదటి మార్గం అంతలా హామీ కల్పించేలా కనిపించడం లేదు.

ఈ విధానాన్ని బట్టి చూస్తే, ప్రాంతీయ సమిష్టి కృషిలో భాగం కావడానికి భారత్‌ ఏ మాత్రమూ వెనుకాడకూడదు. ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ లేని ఇస్లామిక్‌ ఎమిరేట్‌ను స్థాపిస్తామని తాలిబన్‌ ఇప్పటికే స్పష్టం చేసిందని పాకిస్తానీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మహిళలు, బాలికల పట్ల తాలిబన్‌ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నదే ఇక్కడ ప్రధాన అందోళనగా వుంది. ఉన్నత స్థాయి వరకు మహిళల విద్యకు అనుమతిస్తామని తాలిబన్‌ ప్రతినిధి చెప్పారు. అయితే ఇది జరిగినపుడు మాత్రమే విశ్వసించగలం. గతంలో తాలిబన్ల పాలనలో అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న మహిళల హక్కులను కాపాడేందుకు చర్యలు తీసుకునేలా ఏ ప్రాంతీయ సమిష్టి ప్రయత్నమైనా వుండాలి.

2001 నుండి వరుసగా వచ్చిన భారత ప్రభుత్వాలన్నీ కూడా అమెరికా దురాక్రమణకు మద్దతిచ్చేలానే ఆఫ్ఘన్‌ విధానాన్ని అనుసరిస్తూ వచ్చాయి. ఆఫ్ఘన్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల నిర్మాణాలకు కోట్లాది డాలర్లను ఖర్చు పెట్టడం ద్వారా జాతి నిర్మాణంలో సాయపడుతూ వస్తున్నాయి. పర్యవసానాల గురించి ఏమాత్రమూ పట్టించుకోకుండానే అమెరికా బలగాల ఉపసంహరణ జరిగిన నేపథ్యంలో మోడీ ప్రభుత్వం తన ఏకపక్ష అమెరికా అనుకూల విదేశాంగ విధానాన్ని పున:పరిశీలించుకోవాల్సి వుంది. అమెరికాతో అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక పొత్తును కూడా సమీక్షించుకోవాల్సి వుంది. ఆఫ్ఘన్‌ విధానం మాదిరిగానే, చైనాకు వ్యతిరేకంగా అమెరికా సంస్థల కోసం చర్యలు తీసుకోవడం వల్ల భారత్‌ ఏకాకి అవుతుంది. దాని వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మరింతగా పట్టాలు తప్పుతుంది.

/'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం/

Post a Comment

0Comments

Post a Comment (0)