బొమ్మే భవిష్యత్తు !

Telugu Lo Computer
0

 


"ఇలా బొమ్మలు గీస్తూ వుంటే బుక్స్ ఎప్పుడు చదువుతావు? 

చదువుకోకుంటే చద్ది కూడు కూడా దొరకదు!" నాన్న గద్దించాడు.

" బుక్స్ చదువుకుంటే పెద్దయ్యాక భృతి లభిస్తుంది నిజమే కాని బొమ్మ వేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది నాన్నా!"  ఆ కుర్రాడి సమాధానం.

" మాటకి మాట చెప్పడం కాదురా! ముందు చదువుకుని మంచి మార్కులతో పాసవ్వు. మంచి ఉద్యోగం వస్తుంది. హాయిగా జీవించవచ్చు."  తండ్రి హెచ్చరిక. 

ఇది సవాలుగా తీసుకున్నాడు ఆ అబ్బాయి.  మైసూరు నగరంలో 1921, అక్టోబరు 24వ తేదీన ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుని ఇంట్లో ఆరుగురు సోదరులు, ఒక సోదరి తర్వాత చివరి సంతానంగా జన్మించాడు. చేతికున్న ఐదు వేళ్ళు ఐదు రకాలుగా వున్నట్లుగా పాండిత్యమంటే కేవలం పాఠాలు చదవడం, చెప్పడమే కాదు మరో కోణంలో కూడా వుండవచ్చని బొమ్మలు వేసి నిరూపించాడీయన.

ఒకసారి పాఠశాలలో  " రాబోయే సంక్రాంతి పండుగ గురించి ఒక వ్యాసం రాసుకురండి! ఎవరు బాగా రాస్తే వారికి మంచి బహుమానం"  అని ఉపాధ్యాయుడు పోటీ పెట్టగా విద్యార్థులందరూ " అందరి కంటే కొత్తగా, భిన్నంగా రాయాలని ఎవరికి వారు ఆలోచించుకుని, తమ గ్రామం లోనే కాకుండా, తమ బంధువులు ఉండే ఇతర ప్రాంతాలలోనూ ఈ సంక్రాంతివేడుకలుఎలాచేసు

కుంటారో తెల్సుకుని చక్కగా వ్యాసాలు రాసుకొచ్చారు.  కాని ఈ కుర్రాడు మాత్రం 'ఒకే ఒక బొమ్మ' కాగితం మీద " సంక్రాంతి ముగ్గు, గొబ్బెమ్మ పెడుతున్న ఓ యువతి, 

గంగిరెద్దులు, ఎడ్ల పందాలు, కోడిపందాలు, హరిదాసులు వంటివి వేసి తీసుకువచ్చాడు. ఆ చిత్రం చూసి అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఒకేసారి షాక్అయారట!. పిల్లలంతా ఒక్కొక్కరు ఒక్కోరకంగా రాశారుగాని ఏ వ్యాసానికయినా సరిగ్గా సరిపోయేలా వుందీ చిత్రం.

చాలా బాగుంది అనే కితాబుతో బహుమతి ఈ అబ్బాయి సొంతమైంది.

 'వంద మాటలు చెప్పలేనిది, ఒక బొమ్మ చెబుతుంది' అన్నమాట ఈ సంఘటనతో ఋజువైంది.

పెరిగి పెద్దవాడై ఇతడు ఒక ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడైనాడు. పద్మ విభూషణ్, రామన్ మెగసేసే వంటి గొప్ప పురస్కారాలు అందుకున్నాడు."కామన్ మేన్" అనే ఓ పాత్రను సృష్టించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఇతడే ఆర్. కే. లక్ష్మణ్గా ప్రసిద్ధి కెక్కిన ' రాసిపురం కృష్ణ స్వామి లక్ష్మణ్. ఈయన 2015 జనవరి 26 న పూనెలో కన్నుమూశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)