రాజద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా?

Telugu Lo Computer
1


బ్రిటిష్‌ వాళ్లు తెచ్చినదాన్ని రద్దు చేయలేదెందుకు?

స్వాతంత్య్ర సమరయోధుల నోరు మూయించడానికే వారు వాడారు

దాని కింద తిలక్‌, గాంధీలను శిక్షించారు
ఎవరినైనా ఇందులో ఇరికించవచ్చు
అధికార వ్యవస్థకు జవాబుదారీతనం ఏదీ?
కేంద్రానికి సీజేఐ జస్టిస్‌ రమణ సూటి ప్రశ్నలు
రాజద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా?
వడ్రంగి తన చేతిలో ఉన్న రంపంతో వస్తువు చేయడానికి బదులు మొత్తం అడవినే నరికేయడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఈ సెక్షన్‌ ప్రభావం కూడా అలాగే ఉంటుంది. - సీజేఐ జస్టిస్‌ రమణ
స్వాతంత్య్రోద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిషర్లు తీసుకొచ్చిన రాజద్రోహ చట్టం అవసరం ఇప్పటికీ ఉందా? అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.
మహాత్మాగాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌లాంటి వారిని మాట్లాడకుండా చేయడానికి బ్రిటిషర్లు 124-ఏ సెక్షన్‌ కింద రాజద్రోహం (సెడిషన్‌) కేసులు పెట్టారని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తికావస్తున్న సమయంలో కూడా దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందా అని అడిగారు. జవాబుదారీతనం లేని కార్యనిర్వాహక వ్యవస్థ చేతుల్లో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరు పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సెక్షన్‌ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ విశ్రాంత మేజర్‌ జనరల్‌ ఎస్‌.జి. ఒంబాట్కెరె దాఖలు చేసిన వ్యాజ్యాన్ని గురువారం జస్టిస్‌ రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ల ధర్మాసనం పరిశీలించింది.విచారణ సందర్భంగా అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌కు జస్టిస్‌ రమణ కొన్ని ప్రశ్నలు సంధించారు. ఈ చట్టాన్ని ఇంకా కొనసాగించాలా అనే ప్రశ్నపై అటార్నీ జనరల్‌ స్పందిస్తూ- న్యాయస్థానమే దీనిని నిర్ణయించాలని అభిప్రాయపడ్డారు.
దుర్వినియోగానికే అవకాశం
జస్టిస్‌ రమణ తన ప్రశ్నలను కొనసాగిస్తూ.. ‘‘చరిత్రలోకి వెళ్లి ఈ సెక్షన్‌ ప్రయోగించిన తీరును బట్టి చూస్తే ఇందులో శిక్షలు పడ్డ శాతం చాలా చాలా తక్కువ. నేను ఏ ప్రభుత్వాలను, రాష్ట్రాలను నిందించడం లేదు. కానీ దురదృష్టవశాత్తు కార్యనిర్వాహక వ్యవస్థ, అధికారులు దీన్ని దుర్వినియోగం చేస్తారు.
ఇదిగో ఉదాహరణ
ఉదాహరణకు ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏని చూడండి. ఎంతో కాలం క్రితం దాన్ని కోర్టు కొట్టేసినా దానికింద ఎన్ని వేల కేసులు నమోదు చేసి, ఎంతమందిని అరెస్టు చేశారో మీకు తెలుసు. ఇక్కడ చట్టం దుర్వినియోగం జరిగినా జవాబుదారీతనం లేదు. పోలీసు అధికారి అనుకుంటే ఎవరిపైనైనా దీనికింద కేసులు పెట్టొచ్చు. ఒకసారి ఎఫ్‌ఐఆర్‌లో 124ఏ కనిపిస్తే అందరూ భయపడిపోతారు. మా ఆందోళన అంతా చట్టం దుర్వినియోగం... కార్యనిర్వాహక వ్యవస్థలకు జవాబుదారీతనం లేకపోవడంపైనే. అందువల్ల దీనికి సంబంధించిన అన్ని కేసులనూ ఒక ధర్మాసనానికి పంపించి పరిశీలిస్తాం.
ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఎన్నో పనికిరాని చట్టాలను రద్దుచేసింది. ఈ సెక్షన్‌ గురించి వారెందుకు పట్టించుకోవడంలేదో తెలియడంలేదు’’ అన్నారు. అటార్నీ జనరల్‌ స్పందిస్తూ ‘‘మొత్తం సెక్షన్‌ను కొట్టేయకుండా దీని కింద అధికారాలను ప్రయోగించడానికి కొలమానాలను పెడితే బాగుంటుంది. ఈ సెక్షన్‌ను ఎందుకోసమైతే ఉద్దేశించారో అంతవరకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది’’ అని అన్నారు.
క్షేత్రస్థాయిలో తీవ్రత చూడాలి
ఏజీ వాదనపై జస్టిస్‌ రమణ స్పందిస్తూ ‘‘కచ్చితంగా మేం అన్ని విషయాలనూ పరిశీలిస్తాం. క్షేత్రస్థాయిలో పరిస్థితుల తీవ్రతను చూడాలి. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వంకానీ, ఏదైనా పార్టీకానీ ఎదుటివారి గొంతు వినడానికి, ఎదుటివారు మనుగడ సాగించడానికి ఇష్టపడనప్పుడు అలాంటివారిని ఇరికించడానికి ఇలాంటి చట్టాన్ని ప్రయోగించవచ్చు. ఫ్యాక్షనిస్టులు ఇలాంటి సెక్షన్లను ఉపయోగించి గ్రామాల్లోని తమ ఎదుటి పార్టీని ఇరికించవచ్చు. వ్యక్తులు, సంస్థల పనితీరుకు ఇది తీవ్రమైన ముప్పు. అందువల్ల మేం అన్ని కోణాలనూ పరిశీలిస్తాం’’ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు చెప్పారు.
మరో కేసు వేసిన శౌరి
ఈ సెక్షన్‌ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరి మరో కేసు వేశారు. రాజద్రోహం అంటే సరైన నిర్వచనం లేదని, దీన్ని ఆసరాగా తీసుకొని పోలీసులు ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులైన... 14వ అధికరణం (చట్టం ముందు సమానత్వం), 19(1)(ఎ)వ అధికరణం (వాక్‌స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ), 21వ అధికరణం (జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ)లకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. దీన్ని రద్దు చేయడం సాధ్యం కాకపోతే, తప్పుడు కేసులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉండేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
కేసు పెట్టింది ఎవరో చూడండి
భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 124ఏ భావప్రకటన స్వేచ్ఛపై ‘వణికించే ప్రభావం’ చూపిస్తోందని ఆరోపిస్తూ విశ్రాంత మేజర్‌ జనరల్‌ ఒంబాట్కెరె ఈ కేసును దాఖలు చేశారని జస్టిస్‌ రమణ గుర్తుచేశారు. ‘‘పిటిషనర్‌ మాజీ సైనికాధికారి. దేశ రక్షణ కోసం జీవితాన్ని ధారపోశారు. అందువల్ల దీన్ని ఉద్దేశపూర్వక కేసుగా పరిగణించలేం’’ అని అన్నారు. ఎడిటర్స్‌ గిల్డ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపిస్తూ ఇదే విషయమై తాము విడిగా వ్యాజ్యం దాఖలు చేశామని, దానిని కూడా దీనికి జోడించాలని కోరారు.
తదుపరి విచారణ తేదీని తర్వాత ప్రకటిస్తామని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.
బుట్ట దాఖలు చేయాల్సిందే
రాజద్రోహం సెక్షన్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పలువురు ప్రముఖులు స్వాగతించారు. దీన్ని రద్దు చేయాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
* సుప్రీంకోర్టు వ్యాఖ్యను స్వాగతిస్తున్నాం -రాహుల్‌ గాంధీ
* హరియాణాలో డిప్యూటీ స్పీకర్‌ (భాజపా)కారుపై దాడి చేశారన్న ఆరోపణపై దాదాపు 100 మంది రైతుల మీద పలు సెక్షన్లతో పాటు, రాజద్రోహం సెక్షన్‌ కింద కూడా కేసులు పెట్టారు. - యోగేంద్ర యాదవ్‌, స్వరాజ్‌ ఇండియా అధ్యక్షుడు
* కేంద్ర ప్రభుత్వం దీన్ని దుర్వినియోగం చేస్తోంది. దీన్ని రద్దు చేయాల్సిందే. - మొహువా మొయిత్రా, తృణమూల్‌ ఎంపీ
* 2014 తరువాత రాజద్రోహం కేసుల్లో 28% పెరుగుదల కనిపిస్తోంది. -జైవీర్‌ షెర్గిల్‌, కాంగ్రెస్‌ నాయకుడు
* మంచి పాయింటే.
ఇంతవరకు గొంతు బొంగురు పట్టినట్టు ఉండేది. ఈ మాటతో ఇప్పుడు అది పోయింది. -ప్రీతిష్‌ నంది, సినీ నిర్మాత
- భిన్నాభిప్రాయాలు చెప్పేవారి నోరు మూయించడానికి పరాయిపాలన నాటి చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ప్రభుత్వానికి ఎదురుగా నిలుచున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అభినందనలు. - న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్

Post a Comment

1Comments

  1. సీ:
    ఏనాడు?ఎవ్వారు?ఎక్కడ?పరధన
    మాశించి పుడింగి మాదిరి తమ

    రొకరే పరుల కన్న రొంత గోటులమని
    పేట్రేగి పోవుచు పొరుగువారి

    సంపదలను తమ సొంతమునకు జమ
    చేసుకొనంగను చైద్యములకు

    పాల్పడువారు సుప్రభవము నొందిరి?
    పాపము, శునకపు చావు దక్కె!
    తే:
    రావణుడు పోయె!పోయెను రాజరాజు!
    మొన్నటి ఘనుడు ఔరంగ ముస్లిమేడి?
    నిన్నటి వయాసురుడి చావు నేటి పాత
    కులకు నిక రాక తప్పదు - కాల మహిమ.
    (16/07/2021)

    ReplyDelete
Post a Comment