తలలో తెల్ల వెంట్రుకలు !

Telugu Lo Computer
0

 

రాజస్థాన్ లోని ఉదయపూర్ అనే గ్రామంలో దేవేశ అనే పేరుతో ఒక పూజారి వుండేవాడు. అతడు మహారాణా వారి గుడిలో దేవునికి సేవలు చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజూ రాత్రి హారతి ఇచ్చిన తరువాత బాలకృష్ణుని శిరోజములకు అలంకరించిన పూలదండను తీసి కళ్లకద్దుకుని

తన కొప్పులో పెట్టుకుని ( ఆ రోజుల్లో మగవారు కూడా తలలో పూలు పెట్టుకునేవారు) ఇంటికి వెళ్లేవాడు. 

   ఒకరోజు రాత్రి గుడి తలుపులు మూసివేస్తూండగా మహారాజు గుడికి వచ్చాడు. వచ్చినదే తడవుగా దేవునికి నమస్కరించి తనకు ఆ రోజు శ్రీకృష్ణుని తలలో అలంకరింపబడిన పూలదండలు ప్రసాదముగా ఇమ్మని కోరాడు.పూజారిదేవేశ గజగజ వణికి పోయాడు. అప్పటికే దేవుడి పూల దండను తాను శిరస్సులో పెట్టుకున్నాడు మరి.ఏంచేయాలో తోచలేదు. గబగబా గర్భగుడి

లోని శ్రీకృష్ణుని విగ్రహము వెనుకకు వెళ్లి తన కొప్పున ధరించిన మాలను ఊడబెరికి ఒక బుట్టలో పెట్టి బయటకు వచ్చి ప్రసాదంగా ఇచ్చాడు. మహారాజు ఆ దండను కళ్లకద్దుకుని కన్నులు తెరచి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. 

ఆ దండలో ఒక తెల్ల వెంట్రుక కనిపించింది. వెంటనే పూజారిని ప్రశ్నించాడు. " ఏమి అయ్యవారూ! నా కృష్ణునకు అప్పుడే తల నెరిసినదా!" పూజారికి దిక్కుతోచలేదు. ఏం చెప్పాలో తెలియడం లేదు.  " మహారాజా! నిజమే!" "సరే ఆయితే!నేను తిరిగి ఉదయం వచ్చి చూస్తాను." మహారాజు వెళ్లిపోయాడు. పూజారికి రాత్రి నిద్రపట్టలేదు. చింతిస్తూ కూర్చున్నాడు.

   " అయ్యో! నిగనిగ మెరిసే నా బాలకృష్ణుని నల్ల వెండ్రుకలు తెల్లగా మారినవని చెప్పానే! ఎంత పాపం చేసాను! అసలు దేవుడికి ముసలితనం వుంటుందా! అతడు నిత్య యవ్వనుడు కదా! చేసిన పాపానికి నేను శిక్ష అనుభవించాల్సిందే!"

   ఉదయమైనది. కంగారుగా గుడి చేరుకున్నాడు. మహారాణా వారు వేంచేసారు. ఇద్దరూ కలిసి గర్భగుడిలో విగ్రహం వెనక్కివెళ్లారు.  కృష్ణుని తలవెండ్రుకలను నిశితంగా మహారాణా పరీక్షించాడు. ఆ శ్యామసుందరుని వెంట్రుకలన్నీ తెల్లగా వున్నవి. మహారాణాకు సందేహం కలిగి ఒక వెంట్రుకను పట్టి లాగాడు. ఆ వెంట్రుక మొదలు నుండి కొంచెం రక్తము బయటకు వచ్చినది.

కొసమెరుపు: భక్తునిమానసంరక్షణకై భగవంతుడు ఏ రూపమైనా ధరిస్తాడు. ఏ పనైనా చేస్తాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)