డి.వి.నరసరాజు

Telugu Lo Computer
0


1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించారు. ఈయన హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత. ఈనాడు పత్రికలో కొంతకాలం పనిచేశారు.  డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు. నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశారు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నారు.  ఈ ఇల్లు అమ్మబడును, వాపసు నాటకం రాశారు. 

నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాru. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ రచయితగా స్థిరపడ్డారు.  1951లో పాతాళభైరవి సినిమా వంద రోజుల ఉత్సవం సందర్భంగా ప్రదర్శించబడిన నరసరాజు నాటకం "నాటకం" చూసి దర్శకుడు కె.వి.రెడ్డి ఈయన్ను సినిమా రంగానికి పరిచయం చేశారు. గుండమ్మ కథ, భక్త ప్రహ్లాద, యమగోల, రంగులరాట్నం, మనసు మమత, దొంగరాముడు వంటి 92కు పైగా సినిమాలకు కథను, మాటలను సమకూర్చారు.  ఈయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలలో కారు దిద్దిన కాపురం ఒకటి. చెవిలో పువ్వు చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా పోషించారు.  ఈయన చివరి సినిమా, రాజ, భూమిక ప్రధానపాత్రధారులుగా 2006లో విడుదలైన మాయాబజార్. 2006 ఆగష్టు 28న హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో మరణించారు. ఈయనకు ఒక కూతురు కవిత. సినీ నటుడు సుమన్ భార్య నరసరాజు మనవరాలే.

నరసరాజు  ఉషాకిరణ్ మూవీస్ వారి 'కారు దిద్దిన కాపురం' డైరెక్టు చేశారు. కథ తయారు చేసి, స్క్రీన్‌ప్లే సంభాషణలు రాసిన తర్వాత మొత్తం నిర్మాత రామోజీరావుకి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. అప్పుడు వచ్చింది ప్రశ్న. ఎవరు దర్శకుడు? అని. ఒక్క నిమిషం ఆలోచించి, మీరే డైరక్టు చెయ్యండి. మొత్తం అంటే అందులోనే వుంది కదా- అంతా మీరే చేశారు అన్నారట రామోజీరావు. నరసరాజు ఆఁ? అని ముందు ఆశ్చర్యపోయి, తర్వాత 'అబ్బే' అన్నారట. తర్వాత రామోజీరావు  బలవంతంతో అంగీకరించారు. ఒక మిట్టమధ్యాహ్నం విజయ గార్డెన్స్‌లో ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు రావి కొండలరావు అక్కడికి వెళ్లారు. వెళితే నరసరాజు గారు కనిపించలేదు. అడిగితే, కాస్త దూరంలో వున్న చెట్టు చూపించారు. నరసరాజు గారు చెట్టు నీడన నిలబడి ఉన్నారు. రావి కొండలరావు వెళ్లి అడిగారు షాట్స్ రాసి ఇచ్చేశానయ్యా- డైలాగ్స్ ఏంలేవు. అంచేత వాళ్లు తీసేయొచ్చు. నీడగా వుందని ఇలా నించున్నాను అన్నారాయన. హాయిగా ఏసి రూమ్‌లో కూచుని స్క్రిప్ట్ రాసుకునే మీకు ఇప్పుడు తెలిసి వచ్చినట్టుంది దర్శకత్వం అంటే అన్నారు రావి కొండలరావు ఆయనకున్న చనువుతో. ఆయన నవ్వి, అవుననుకో, కానీలే, ఇదొక అనుభవం. మళ్లీ డైరక్టు చేస్తానాయేం? అన్నారు నరసరాజు. 

Post a Comment

0Comments

Post a Comment (0)