కన్నడ ఆదికవి పంప

Telugu Lo Computer
0




కన్నడ ఆదికవిగా పేరొందిన పంపడు లేదా పంప కవి సమాధి మన తెలుగునేల పైన తెలంగాణాలోని  ఇందూరు (నిజామాబాద్) ప్రాంతములోని పోదనపురము (బోధన్)  బసవతారక నగర్ లో ప్రాంతంలో వుంది. శాతవాహన సామ్రాజ్యములో అశ్మక రాష్ట్రమునకు ఇది రాజధాని. ఈ ప్రాంతమును సపాదలక్ష, సబ్బినాడు, పోదననాడు అని కూడ అంటారు.  కన్నడ ఆదికవి సమాధి ఇక్కడ వుందని చాలా ఆలస్యంగా 1970 ప్రాంతాల్లో కనుగొన్నారు. శాసనాలలోని ప్రాకృత కన్నడ భాషను ఇంకా చదవలేదు. కానీ రక్షణ లేకపోవడంతో అవ్వన్నీ చెరిగి పోయే దశలో వున్నాయి. దాని విలువ తెలియక బట్టలు ఉతుక్కునేందుకు వాడుతున్నారట. నిజానికి భోదన్ ఒకప్పుడు  కన్నడ దేశంలోని భాగమే అక్కడి ప్రజల్లో చాలా కుటుంబాలు ఇప్పటికీ కన్నడ భాషను మాట్లాడుతారు. కానీ మన సాహితీ సాంస్కృతిక పునాదులను పట్టిచూపే ఈ ఆధారాలు చాలా నిరాదరణకులోనై వున్నాయి. ‘వేములవాడ చాళుక్యుల’ కాలం కన్నడ భాషకు స్వర్ణయుగం వంటిది. కన్నడ ఆదికవి పంప రెండవ అరికేసరి (కీ.శ. 930-955)కి ఆస్థాన కవి. పంప తన ప్రభువును అర్జునుడితో పోలుస్తూ, రచించిన ‘విక్షికమార్జున విజయం’ కన్నడలో ‘పంప భారతం’గా ప్రసిద్ధి చెందింది. వ్యాస భారతాన్ని నన్నయ తెలుగులోకి అనువదించడానికి ముందే జరిగిన అనువాదంగా దీనిని చరిత్ర కారులు చెప్తారు. పంప తన 30వ ఏటే క్రీ.శ.941లో జైన మొదటి తీర్థంకరుడైన రిషబనాథుడిపై ‘ఆదిపురాణం’ రచించాడు. ఇతడి తమ్ముడు జినవల్లభుడు కరీంనగర్ జిల్లా కురిక్యాల బొమ్మల గుట్టపై వేసిన శాసనంలో తొలి తెలుగు కంద పద్యాలున్నాయి. పంప మహాకవి తమ్ముడే జినవల్లభుడు.  జైన మతాభివృద్ధి కోసం విశేష కృషి చేసినది ఈ జినవల్లభుడే, బొమ్మలమ్మే జైనచక్రేశ్వరి

ఒకప్పటి వృషభగిరే నేటి బొమ్మలమ్మ గుట్ట. దూరం నుంచి చూస్తే ఎద్దు ఆకృతిలో కనిపిస్తుంది. ఏకశిలపై ఆది తీర్థంకరుడు వృషభనాథుడి విగ్రహం చెక్కి ఉంటుంది.

వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్‌ తరువాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతాలనే ‘సపాదలక్ష దేశం’ అని అంటారు. అంటే లక్షా యాభైవేల బంగారు నాణేల ఆదాయం కలిగిన దేశం కొందరి అభిప్రాయం ప్రకారం లక్షా పాతిక వేల గ్రామాలను కలిగిన దేశం.  గోదావరి నదికి దక్షిణాన గల మంజీర నది నుంచి మహాకాళ్వేర పర్యంతం వ్యాపించి ఉన్న భూభాగమే పొదనాడు. దీన్నే సపాదలక్ష దేశం అంటారు. ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం.

Post a Comment

0Comments

Post a Comment (0)