పరిపరి విధముల!

Telugu Lo Computer
0


ఒకసారి కొందరు జాలరులు చేపలు పడుతుంటే వాళ్ళ వలలో ఒక శిలా ఫలకం పడింది దానిని సముద్రం లో పారవేద్దాము అని అనుకుంటూ వుండగా ఒక జాలరికి దానిమీద యేవో సంస్కృత అక్షరాలూ కనిపించాయి

భోజరాజు గారికి సంస్కృత శ్లోకాలంటే యిష్టం కదా!దీన్ని ఆయనకిస్తే మనకేదయినా బహుమానం యిస్తాడు అనుకొని ఆ ఫలకాన్ని ఆయనకు అందజేశారు.ఆయన వారికి తగిన బహుమానం యిచ్చి పంపేశారు.
దానిని నిపుణుల చేత పరీక్ష చేయించగా దాని మీద రామాయణానికి సంబధించిన శ్లోకం చెక్కబడి వుందని
అక్షరాలూ స్పష్టంగా తెలియడం లేదని వాళ్ళు చెప్పారు.తెలిసి నంత వరకూ నిదానంగా పరీక్షించి చూడగా ఒక శ్లోక పాదం గా తయారయింది.యిలా.
"అయిఖలు విషమః పురాకృతానాం భవతి హి జన్తుషు కర్మణాం విపాకః"
అర్థము:-- అయాయ్యో! పూర్వ కర్మల ఫలితం ప్రాణులకి చాలా కఠినంగా వుంటుంది.
ఇకనేం ఒక పాదం దొరికింది చాలు దాన్ని భోజుడు తన ఆస్థాన కవులకు పూరించమని యిచ్చాడు.
భవభూతి యిలా పూరించాడు.
"క్వ ను కులమకలంకం ఆయుతాక్ష్యా:క్వ చ రజనీచర సంగమ అపవాదః"
అర్థము :-- విశాలాక్షి సీత యొక్క అకళంక మైన కులమెక్కడ?రాక్షసునితో సంబంధం కలిపే అపనింద ఎక్కడ?
భోజరాజు యిది విని బాగానే వుంది కానీ యిదే భావం యింకా లలితంగా చెప్తే బాగుండే దేమో అనిపించింది .
ఆయన యిలాపూరిస్తే బాగుండే దేమో అనుకున్నాడు.
"క్వ జనకతనయా?క్వ రామ జాయా?క్వచ దశకంధర మందిరే నివాసః"
అర్థము:-- ఎక్కడి జనక పుత్రీ,రామపత్నీ? ఎక్కడ రావణుడి మందిరం లో నివాసం" యిలా చెప్తే బాగుండేది అనుకున్నాడు.కానీ భవభూతి మీది గౌరవం కొద్దీ పైకి ఆయన ఏమీ అనలేదు.
కాళిదాసు వంక చూసి మహాకవీ!మీరేమంటారు?అని అడిగాడు.కాళిదాసు యిలా పూరించాడు.
'శివ శిరసి శిరాంసి యాని రేజు: శివ శివా!తాని లుటంతి గృధ్ర పాదై:
అయిఖలు విషమః పురాకృతానాం భవతి హి జంతుషు కర్మణాం విపాకః
అర్థము:-- ఏ తలలు శివుని తల మీద ప్రకాశిం చాయో (రావణుడు తన తలలు కోసి శివుడికి అర్పించినప్పుడు)శివ శివా!ఆ తలలే యిప్పుడు గద్దల పాదాల చేత దొర్లించ బడు తున్నాయి.అయ్యో! పూర్వ కర్మ ఫలం ప్రాణులకి చాలా కఠినంగా వుంటుంది సుమా!
అని చెప్పి ఈ శ్లోకం హనుమంతుడు వ్రాసిన హనుమద్రామాయణం లోనిది.హనుమంతుడు వాల్మీకి రామాయణము అంత బాగా లేదని దీనిని రచించి రాముడికి చదివి వినిపించాడు.రాముడు ఆంజనేయా!
నీ గ్రంథము బాగానే వున్నది కానీ యిందు నీ శౌర్య ప్రతాప వర్ణన మే ఎక్కువగా కనిపిస్తూ వుంది.ఎక్కువ
స్వోత్కర్ష మంచిది కాదు కదా!(స్వోత్కర్ష అంటే తనను గురించి తానె గొప్పగా చెప్పుకోవడం) అన్నాడు.
రాముడికి నచ్చని నా గ్రంథ మేల?యని సముద్రమున పారవైచెను.ఈ ఫలకము దానిలో ఒకటి యై వున్నది.అన్నాడు కాళిదాసు.
మిగతా పండితులు నీ పూరణము బాగుగానే యున్నది కానీ యిది హనుమంతుడిచే వ్రాయబడి నది యనుటకు రుజువేమి? అని అడిగిరి.అప్పుడు కాళిదాసు హనుమంతుడిని ప్రార్థించెను.అప్పుడు హనుమంతుడు అక్కడ ప్రత్యక్ష మయ్యెను.వారందరూ ఆశ్చర్య చకితులై నమస్కరించి స్వామీ !కాళిదాసు వలన మిమ్మల్ని చూసి మేము ధన్యుల మైనాము.
కానీ మాకు ఒక సందేహ మున్నది. అని కాళిదాసు పూరించిన శ్లోకము చెప్పి యిది మీరు వ్రాసిన గ్రంథము లోనిదేనా?అని అడిగిరి.అప్పుడు హనుమంతుడు అది నేను వ్రాసినదే యని చెప్పిరుజువు కావలె ననిన మీ ఉద్యాన వనమున నైరుతి దిక్కులో వున్న చెట్టు యొక్క ఆకు తెప్పించి దాని పసరు తీసి దాని చే ముద్ర వేయించి చూడుడు అని చెప్పెను.రాజు అలాగుననే చేయగా కాళిదాసు పూరించిన శ్లోకమే వుండెను.హనుమంతుడు అదృస్యు డయ్యెను.భోజరాజు,పండితులు కాళిదాసును విశేషముగా స్తుతించిరి.
ఒక్కొక్క కవి ఒక్కొక్క విధముగా ఆలోచించునని చెప్పుటకే ఈ కథ.

Post a Comment

0Comments

Post a Comment (0)