చీకటి రాజ్యం దిశగా మోడీ పాలన

Telugu Lo Computer
0



జూన్‌ 26వ తేదీ అనేక విధాలా విశిష్టత కలిగి ఉంది. సరిగ్గా 46సంవత్సరాల క్రితం దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన చీకటి దినం. అలాగే ఏడు నెలల క్రితం ఇదే రోజు నవంబరు 26వ తేది రైతాంగ ఉద్యమం ఢిల్లీ ముట్టడి ఆరంభమైన రోజు కూడా. ఆ రీత్యా ఈసారి జూన్‌ 26 నిరసన దినంగా పాటించాలని 500 సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. ఐక్య కార్మిక సంఘాల వేదిక (సీటీయూ) కూడా సంఘీభావం ప్రకటించింది. యువజన, విద్యార్థి, మహిళా, సామాజిక సంఘాలు కూడా దీనితో గొంతు కలిపాయి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఎమర్జెన్సీ నాటి పరిణామాలను కూడా గుర్తు చేసుకోసుకోవడం సందర్భోచితంగా ఉంటుంది.

ఆర్థిక సంక్షోభం నుండి ఎమర్జెన్సీ వరకు
1971 పార్లమెంటు ఎన్నికల్లో ఇందిరాగాంధీ సుడిగాలి వేగంతో విజయం సాధించింది. పేద ప్రజలు కోటి ఆశలతో ఆమెకు నీరాజనాలు పలికారు. రెండు సంవత్సరాలు గడవక ముందే ధరలు ఆకాశానికంటాయి. నిరుద్యోగం పెరిగింది. గుజరాత్‌, బీహార్‌లలో విద్యార్థులు రోడ్డున పడ్డారు. జయప్రకాశ్‌ నారాయణ ఆధ్వర్యంలో సంపూర్ణ విప్లవం పేరిట యువతరం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. మధ్యతరగతి ప్రభుత్వోద్యోగులు డీఏ పెంపుదల కోసం సమ్మె సైరన్‌ మోగించారు. రైల్వే కార్మికులు చరిత్రలో మొదటిసారి రైళ్లను పూర్తిగా స్తంభింపచేశాయి. కార్మికులపై పైశాచిక నిర్భంధకాండ సాగింది. ఇదే సమయంలో జూన్‌ 25వ తేదీన ఇందిరాగాంధీ లోకసభ సభ్యత్వం చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్దించింది. రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోడానికి బదులుగా దేశాన్ని నిరంకుశంగా హస్తగతం చేసుకున్నారు. జూన్‌ 25 అర్థరాత్రి అంటే 26వ తేదీ తెల్లవారేసరికల్లా ప్రతిపక్ష నాయకులంతా జైళ్లకు పంపబడ్డారు. పౌరహక్కులు రద్దు చేయబడ్డాయి. పత్రికలపై సెన్సారుషిప్‌ విధించారు. దానికి నిరసనగా కొన్ని పత్రికలు సంపాదకీయం రాయకుండా ఆ ప్లేస్‌ను తెల్లగా వదిలేశారు. సభలు, సమావేశాలు నిషేధించారు. ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేశారు. ప్రధాని పదవిని ఐదు నుంచి ఆరేండ్లకు పొడిగించారు. ప్రశ్నించిన వారిని విదేశీ ఏజెంట్లుగా, దేశద్రోహులుగా ముద్ర వేసి మీసా, నాసా వంటి నిర్భంధ చట్టాల కింద జైళ్లలో తోశారు. ఎమెర్జీన్సీని వ్యతిరేకించిన రచయితలు, చిత్రకారులపై కేసులు పెట్టి వేధించారు. ప్రభుత్వాన్ని విమర్శించే సినిమాలను కూడా నిషేధించారు.
సీపీఐ(ఎం), ప్రజాఉద్యమాలపై నిర్భంధం
సీపీఐ(ఎం) నాయకత్వాన్ని పై నుండి కింది వరకు అరెస్టు చేశారు. అప్పటికే బెంగాల్లో సీపీఐ(ఎం)పై అర్దఫాసిస్టు భీభత్సకాండ సాగుతోంది. నాటి పార్టీ ప్రధాన కార్యదర్శి సుందరయ్య సహా అనేక మంది నాయకులు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారు. సీపీఐ(ఎం) నాయకుల ఇండ్లపై దాడులు చేశారు. అనేక మందిని చిత్రహింసల పాల్జేశారు. నేడు కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న పినరయి విజయన్‌ నాడు యువ ఎమ్మెల్యే. అరెస్టు చేసి థర్డ్‌ డిగ్రీ పద్ధతులలో వళ్లంతా కుళ్లబొడిచారు. రక్తపు మరకలతోనే ఆయన అసెంబ్లీకొచ్చి ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడారు. రాజన్‌ అనే యువకుడ్ని ఎన్‌కౌంటర్‌లో కాల్చి పారేయడంతో రాష్ట్రం అట్టుడికిపోయింది. మన ఉమ్మడి రాష్ట్రంలోనూ 300మంది అమాయకుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేశారు. నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చర్యలపై తర్వాత భార్గవ కమిషన్‌ విచారణ కూడా జరిగింది. విద్యార్థి నాయకులను కూడా నిర్భంధించారు. వామపక్ష విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ వారికి లక్ష్యంగా మారింది. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత నియమించిన షా కమిషన్‌ నివేదికతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఎమర్జెన్సీలో ఆర్‌యస్‌యస్‌ పాత్ర
నక్సలైట్‌ పార్టీలతోపాటు ఆర్‌యస్‌యస్‌, జమాయితే వంటి సంస్థలను కూడా నిషేధించారు. ఏబీవీపీ నాయకులను కూడా అరెస్టు చేశారు. ఖంగుతిన్న ఆర్‌యస్‌యస్‌ నాయకత్వం 1976 నవంబరులో ఇందిరాగాంధీకి ''డాక్యుమెంటు ఆఫ్‌ సరెండర్‌'' పత్రాన్ని సమర్పించుకొని తమ నాయకులందరినీ విడుదల చేయాలన్న షరతుపై క్షమాపణ కోరింది. ఆర్‌యస్‌యస్‌ నాయకుడు రణడే రహస్యంగా ఇందిరాగాంధీతో మంతనాలు జరిపారు. ఇందిరాగాంధీ తనయుడు సంజరు గాంధీతో రాజీపడ్డారు. చర్చలకు సహకరించిన రణడేకు ప్రభుత్వం పదవినిచ్చి సత్కరించింది. నాటి ఏబీవీపీ నాయకులు అరుణ్‌ జెట్లీ లాంటి వారు చివర వరకు జైల్లోనే ఉన్నా బల్బీర్‌ పుంజ్‌, ప్రభుచావ్లా వంటి వారు ఇందిరాగాంధీ 20 సూత్రాల పథకాన్ని సమర్థిస్తూ ప్రకటన చేశారు. ఈ వాస్తవాలను తర్వాత ఆర్‌యస్‌యస్‌కు చెందిన సుబ్రమణ్యస్వామి బహిరంగంగా వెల్లడించారు. అత్యధిక మంది బీజేపీ, ఆర్‌యస్‌యస్‌ నాయకులు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటానికి ద్రోహం చేసినట్టు 2000 సంవత్సరం హిందూకు రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు.
ప్రజల ఆగ్రహానికి గురైన ఇందిర
ప్రజల మద్దతుందన్న ఇంటెలిజెన్సు రిపోర్టుతో 21నెలల తర్వాత 1977 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ మినహా దేశమంతా తుఫాను గాలి వీచినట్టుగా ఆమెను, ఆమె పార్టీని ప్రజలు ఘోరంగా ఓడించారు. జయప్రకాశ్‌ సారథ్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టి జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. ఇదో చారిత్రాత్మక ప్రజా తీర్పు. దేశంలో తిరిగి సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడ్డాయి.
నేడు ఆచరణలో అప్రకటిత ఎమర్జెన్సీ
మోడీ పాలన నాటి ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తెస్తోంది. నాడది 21నెలలు కాగా నేడు ఏడేండ్ల నుంచి నిరంకుశ పాలన కొనసాగుతోంది. 2015లోనే మోడీ చర్యలను గమనించిన అద్వానీ ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మరల ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి తలెత్తదని చెప్పలేమని పరోక్షంగా హెచ్చరించారు. గుజరాత్‌లో మోడీ మారణకాండ, ప్రధాని కావడానికి పార్టీనే అణచివేసిన విధానం అద్వానీకి గుర్తొచ్చి ఉండొచ్చు. నాడు గుజరాత్‌లో మోడీ పాపాన్ని బలపరచిన అద్వానీ నేడు అనుభవిస్తున్నాడు. ఎమర్జెన్సీకి మందు ఇందిరాగాంధీ కనీసం కంటితుడుపుగానైనా ఫ్యూడల్‌ వ్యతిరేక చర్యలను చేపట్టారు. కానీ నేడు మోడీ అదే ఫ్యూడల్‌ పాలనను పునరుద్ధరించడానికి, వ్యవసాయాన్ని కార్పొరేట్‌ పరం చేయడానికి పూనుకున్నారు. అందుకోసం ప్రజాస్వామ్యాన్నే హతమారుస్తున్నారు. దానిపై తిరుగుబాటే నేటి రైతాంగ ఉద్యమం. చరిత్రలో ఇది మరొక సువర్ణాధ్యాయం.
రైతాంగ పోరాటంపై తప్పుడు ప్రచారం
ఏడు మాసాలుగా లక్షలాది మంది రైతులు దేశమంతటి నుంచి ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్నప్పటికీ కేవలం అదానీ, అంబానీల లాభాపేక్ష కోసం నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. రైతు ఉద్యమకారులపై రేప్‌ కేసులు బనాయించి, అభాండాలు మోపి బలహీనపరచాలని కొత్త ఎత్తుగడ పన్నారు. బీజేపీ టెక్నోసేన ఉద్యమకారులపై ట్రోలింగు చేస్తోంది. హర్యానాలో లాఠీచార్జి చేశారు. అయినా ఇంకా వేలాదిగా ప్రతిరోజూ ఢిల్లీకి రైతులు తరలి వస్తూనే ఉన్నారు. మోడీ సర్కారు చర్చలకు సిద్ధమంటూనే చట్టాన్ని వెనక్కి తీసుకునేది లేదని మొండికేస్తున్నది. పట్టువదలని విక్రమార్కునిల్లా రైతులు పోరాడుతూనే ఉన్నారు. ఒకచేత నాగలి, మరో చేత తిరుగుబాటు జెండా పట్టుకొని అటు వ్యవసాయం చేస్తూ దేశానికి తిండి పండిస్తూ, మరోవైపు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు కోసం, గిట్టుబాటుధరల చట్టం కోసం పోరాడుతున్నారు.
కొనసాగుతున్న ఆర్థిక నియంతృత్వం
ఇప్పటికే దేశంలో ఆర్థిక నియంతృత్వం అమలవుతోంది. పెద్దనోట్ల రద్దు మొదలుకొని జీఎస్టీ వరకు ఈ కోవలోవే. తాజాగా ధరల పెంపుదల తోడైంది. నిరుద్యోగం కనీవినీ ఎరుగని విధంగా పెరుగుతోంది. కరోనాను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాధితులకు పైసా విదల్చడం లేదు. విద్యా, వైద్య రంగాలలో కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ, కాషాయీకరణ విధానాలు ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నాయి. కార్మిక హక్కుల చట్టాలను రద్దు చేసి, వారిని అణచివేయడానికి లేబర్‌ కోడ్‌లను తెచ్చింది. రాజ్యాంగ విరుద్దంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను తెచ్చింది. రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తూ ఒకే దేశం ఒకే చట్టం అంటూ అధికారాన్ని కేంద్రీకరిస్తున్నారు.
ప్రజా ఉద్యమాలతోనే నిరంకుశత్వానికి చెక్‌
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీర్పుతో నిస్పృహకు గురైన మోడీ, షాల ద్వయం మరిన్ని ప్రజా వ్యతిరేక చర్యలకు, నిరంకుశ విధానాలకు తెరలేపుతున్నారు. అత్యవసర పరిస్థితి విధించకుండానే పౌరహక్కులు కాలరాయబడుతున్నాయి. రాజ్యాంగ విధ్వంసం, రాజ్యాంగ సంస్థలను నియంత్రించడం, ప్రశ్నించినవారిని ఉపా వంటి అక్రమకేసుల్లో నిర్భంధించడం యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉగ్రవాదానికి, ప్రజా ఉద్యమాలకు మధ్య విభజన గీత గీసింది. మోడీ దాడిని అడ్డుకొని రానున్న ప్రమాదాన్ని నివారించగలిగేది ప్రజాచైతన్యం, ఐక్యత, ప్రజాతంత్ర ఉద్యమాలు మాత్రమే.
                                                                                                                                 - వి. శ్రీనివాసరావు
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)