ఆ ఇద్దరి బ్యాటింగే కీలకం : సచిన్

Telugu Lo Computer
0


ఇంగ్లాండులోని సౌథాంప్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో బుధవారం ముగిసిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ జట్టు ఓటమికి గల కారణాన్ని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విశ్లేషించాడు. రిజర్వ్ డేతో కలుపుకుని ఆరు రోజులు సాగిన ఈ ఫైనల్లో భారత్ జట్టు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. చివరి రోజు 139 పరుగుల టార్గెట్‌ని న్యూజిలాండ్ ముందు టీమిండియా నిలపగా.. ఆ జట్టు 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించేసింది. ఆఖరి రోజు మ్యాచ్‌ని డ్రా చేసుకునే అవకాశం ఉన్నా.. భారత్ బ్యాట్స్‌మెన్‌ల నిర్లక్ష్యంతో ఓటమి తప్పలేదని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమిపై సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ ''చివరి రోజు మొదటి 10 ఓవర్ల ఆట చాలా కీలకమని నేను ముందే చెప్పాను. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా కేవలం 10 బంతుల వ్యవధిలోనే ఔటవడంతో భారత్ జట్టుపై ఒత్తిడి పడింది. చివరి రోజు ప్రదర్శనపై టీమిండియా ఖచ్చితంగా నిరాశ చెంది ఉంటుంది'' అని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో ఆఖరి రోజు ఇన్ స్వింగ్, ఔట్ స్వింగర్‌లతో భారత బ్యాట్స్‌మెన్‌లను పరీక్షించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జెమీషన్ తన వరుస ఓవర్లలో విరాట్ కోహ్లీ, పుజారాలను ఔట్ చేశాడు. ఇద్దరికీ వరుసగా ఇన్ స్వింగర్‌లను సంధిస్తూ.. ఒక్కసారిగా ఔట్ స్వింగ్ వేయగా.. ఆ బంతిని వెంటాడి ఔటైపోయారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)