పెరిగిన ప్రైవేట్ ఆసుపత్రుల ఆదాయం

Telugu Lo Computer
0


కరోనా ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయంలో గణనీయమైన వృద్ధి (15-17%) కనిపించిందని ప్రముఖ  రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతితో బాధితుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో, ఆసుపత్రులకు ఆదాయాలూ బాగా పెరిగాయని తెలిపింది. 2020-21లో ఆర్జించిన మొత్తంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆసుపత్రుల ఆదాయాలు 15-17% వరకు అధికంగా ఉండటానికి ఆస్కారం ఉన్నదని  వెల్లడించింది. దీనివల్ల నిర్వహణ లాభాలు 100-200 బేసిస్‌ పాయింట్లు పెరిగి, 13-14శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ నిష్పత్తి 75శాతానికి మించే ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే ఇది రెట్టింపు అని క్రిసిల్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మనీష్‌ గుప్తా అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం ఆక్యుపెన్సీ ఉండగా.. ఈసారి ఇది 65-70శాతానికి తగ్గకుండా ఉండే అవకాశం ఉందని గుప్తా పేర్కొన్నారు. ఆదాయం, లాభాల్లో వృద్ధి నమోదు కావడం వల్ల విస్తరణకు ఆసుపత్రులు ప్రణాళికలు వేసే అవకాశం ఉందని క్రిసిల్‌ పేర్కొంది. ఇందులో ఇతర ఆసుపత్రుల స్వాధీనం, పడకల సంఖ్య పెంచడం, ఇతర మౌలిక వసతుల కల్పన లాంటి వాటికి ప్రాధాన్యం ఉండవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ రాజేశ్వరి కార్తిగేయన్‌ పేర్కొన్నారు. 


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)