విశాఖ నగరంలో రాజమార్గం !

Telugu Lo Computer
0



విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేసుకుని ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యవహారాలు చూసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2, 3 నెలల్లోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం కావచ్చన్న  జోరుగా ప్రచారం సాగుతోంది.పరిపాలన రాజధానిగా నగరానికి మెరుగులు దిద్దేలా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కసరత్తు చేస్తోంది. వివిధ పర్యటనల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి విమానాశ్రయం మీదుగా నగరంలోకి ప్రవేశించే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక రహదారిని కేటాయించాలని భావిస్తోంది.

బోయపాలెం వద్ద ఒక విద్యా సంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకూ.. ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ మీదుగా వెళ్లేలా 35 కి.మీ మార్గాన్ని ఎంపిక చేసింది. ఈ మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.  ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో అంతర్గతంగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. 

2 కి.మీ మార్గం విస్తరిస్తేనే..

నగరంలో ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రాకపోకలు ఉండాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్‌ఏడీ కూడలిలో పైవంతెన పూర్తయింది. ఎన్‌ఏడీ నుంచి హనుమంతవాక వరకు బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థ (బీఆర్‌టీఎస్‌) ఉంది. ఇందులో భాగంగా సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కి.మీ రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు సాగలేదు. అక్కడి గృహాలకు టీడీఆర్‌ లేదా భూములు ఇవ్వడమా అన్నది యోచిస్తున్నారు. చట్టపరంగా ఓ పరిష్కారానికి రావాలనుకుంటున్నారు. 

ముఖ్యమంత్రి నివాసం ఎక్కడుంటుంది అనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బీచ్‌రోడ్డులోని పలు ప్రాంతాల్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో 'స్మార్ట్‌ సిటీ'లో భాగంగా పూర్తయిన కొన్ని కీలక కట్టడాలు ఉన్నాయి. వీటితో పాటు ఓ ఫంక్షన్‌ హాలునూ, ఓ అతిథి గృహాన్ని పరిశీలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)