జోనకీ (బెంగాలీ చలన చిత్రం) - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 22 June 2021

జోనకీ (బెంగాలీ చలన చిత్రం)


జీవితంలో ఆనందం అన్నదే లేక నిస్సారంగా రోజులు గడిపిన ఒక స్త్రీ, జీవించిన ప్రతి నిముషం తన కోరికలను ఆశలను చంపుకుని, ప్రేమ దొరకక, ఒంటరిగా ఎనభై సంవత్సారాలు బ్రతికిందనుకుందాం. ప్రతి నిముషం భారంగా గడిపిన ఆమె ఎదో ఒక సందర్భంలో తన గతాన్ని గుర్తుచేసుకుంటే అది దృశ్యంగా ఆమెకు ఎలా కనిపిస్తుంది ? పేలవంగా, వెలితిగా, జీవం లేకుండా, నీరసంగా, దిగులుగా, కళావిహీనంగా, అందవికారంగా, అర్ధరహితంగా, అంతే కదా. అంటే అది ఎలా ఉంటుంది? అటువంటి జీవితాన్ని వీక్షించే అనుభవం ఎలా ఉంటుంది ?

ఆ అనుభవాన్ని ఒక గంటన్నర సేపు మనదిగా చేసుకోవాలంటీ “జోనకీ” అనే ఈ బెంగాలీ సినిమా చూడాలి. 2018 లో ఆదిత్య విక్రం సేన్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఇండియా, ఫ్రాన్స్, సింగపూర్ దేశాలకు చెందిన ప్రొడక్షన్ కంపెనీ సౌజన్యంతో నిర్మీంచారు. 20వ ముంబై ఫిల్స్ ఫెస్టివల్ లో దీనికి ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది. తరువాత విదేశాలలో ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో దీన్ని ప్రదర్శించారు. ఈ సినిమా కథను దర్శకులు తన నానమ్మ జీవితం ఆధారంగా రాసుకున్నారు. ఆమె జీవితంలో అనుభవించిన ఒంటరితనాన్ని, విషాదాన్ని ఆ స్థాయిలో చూపించడానికి ఒక వినూత్నమైన టేక్నిక్ ను ఉపయోగించారు. అసలు సంతోషమనేదే లేని ఎనభై సంవత్సరాల జీవితం ఎలా ఉంటుందో ఆ జీవితాన్ని అనుభవించిన స్త్రీ మనసు ఎలా కుచించుకుపోయి ఉంటుందో సినిమా చూసిన ప్రతి వ్యక్తి స్వయంగా అనుభవిస్తాడు. ఒక గుడ్డివానికి స్పర్శతో ప్రపంచాని చూపించడానికి ప్రయత్నం చేసినట్లుగా, ఇతరుల జీవితంలోని బాధను అదే స్థాయిలో అనుభవించలేని మనిషిని ఆ అనుభవానికి అతి దగ్గరగా తీసుకువెళ్ళగలిగిన దర్శకుని ప్రతిభ కు అచ్చెరువు చెందుతాం. ఒక గంటన్నర సేపు మాత్రమే అనుభవించే ఆ విషాదాన్ని భరించలేని, చూడలేని, మనం అవే పరిస్థితులలో ఒక ఎనభై ఏళ్ళు బ్రతికిన ఒక స్త్రీ దుఖాన్ని తప్పక అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ విషాదాన్ని కొంత సేపు భరించాం కాబట్టి ఆ విషాదాన్ని తేలికగా తీసుకోలేం. ఆమె జీవితంలోని అర్ధహీనత్వానికి సంపూర్ణంగా సానుభూతి చూపించగలుగుతాం. అందుకే ఈ సినిమా చూడడం చాలా కష్టమైన, అనుభవం.
సినిమా కథకు వస్తే. జోనకి అనే ఒక ఎనభై సంవత్సరాల వృద్దురాలు మరణానికి దగ్గరగా మంచం మీద పడి ఉంది. ఆ అపస్మారక స్థితిలో ఆమెకు గడిచిన జీవితం దృశ్యాలుగా కనిపిస్తూ ఉంటే అవి ఎలా ఉంటాయి.ఈ కాన్సెప్ట్ తోనే ప్రతి షాట్ ను దర్శకులు మలిచారు. ఇది భారతీయ సినిమాలోనే ఒక విన్యూత్న ప్రయోగం. ఈ సినిమా చూసి అర్ధం చేసుకునే స్థాయి ప్రేక్షకులు మనకు చాలా తక్కువ. కాని తాత్స్కోవ్స్కీ, లుయిస్ బున్యుల్, రాబర్ట్ బ్రెస్సన్ లాంటి డైరక్టర్ల సినిమాలు చూసిన అనుభవం ఉన్న సినీ ప్రేమికులకు ఈ సినిమా గొప్పతనం అర్ధం అవుతుంది. అసలు ప్రపంచ సినిమా తో పరిచయం లేని వ్యక్తులు కూడా ఈ సినిమా చూస్తున్నంత సేపు ఒక దుఖంతో, ఒంటరితనంతో చెప్పలేని విషాదంలో మునిగిపోతారు. సినిమా ప్రతి ఫ్రెంలో జోనకి అంతరంగంలోని ఒంటరితనాన్ని, అర్దరహిత జీవితాన్ని ఆమె కళ్ళతోనే చూపించే ప్రయత్నం చేస్తారు దర్శకులు. దర్శకులు తన నాన్నమ్మ కథను, అందులో దుఖాన్ని తాను అనుభవించినట్లుగానే మనముందుకు తీసుకువస్తారు.
మన నాన్నమ్మలు చిన్న పిల్లలుగా ఎలా ఉండి ఉంటారో మనం ఊహించలేం కదా. వారి ప్రస్తావన వచ్చిన ప్రతి సారి, మనకు వారి పరిచయమైన ముఖమే గుర్తుకువస్తూ ఉంటుంది. వారి చిన్నతనాన్ని మనం మన ఆలోచనలలోదృశ్యాలుగా మలచుకోవాలనుకున్నప్పుడు ఆ దృశ్యాలలో వారు చిన్నపిల్లలుగా కనపడరు. మనకు పరిచయమయిన ఆ ముసలి మొహంతోనే వారి చిన్నతనాన్ని ఊహించుకునే ప్రయత్నం చేస్తాం. ఇది సహజం. ఆ ఊహలను యధావిధిగా చూపించే ప్రయత్నంలో దర్శకులు ఒక వినూత్నమైన టెక్నిక్ ని ఉపయోగిస్తారు. ఇక్కడ జోనకి చిన్నతనాన్ని చూపిస్తూ ఆమెను అదే ఎనభయేళ్ళ వృద్దురాలిగా చూపిస్తూ ఆమె తల్లిని ఆమె కన్నా తక్కువ వయసున్న ఆమెగా చూపిస్తారు దర్శకులు. నాయనమ్మ అమ్మను మనం ఏ ఫోటొలోనో చూస్తాం. ఆ ఫోటోలో ఆమె వయసు ఎంతుంటుందో ఆమె ప్రస్తావన వచ్చినప్పుడు అదే వయసుతో ఆమెను గుర్తుకు తెచ్చుకుంటాం. అదే పద్దతిలో ఈ సినిమా తీయడం వలన మనకు చాలా సీన్లు వింతగా కనిపిస్తాయి. ఉదాహరణకు పందొమ్మిది సంవత్సరాల జోనకి కి ఆమె తల్లి స్నానం చేయుస్తూ, ఆమెను మందలిస్తుంటుంది. ఆ సీన్ ద్వారా కూతురు జీవితం పై తల్లి అధికారం కనిపిస్తుంది. జోనకీ జీవిత కథకు అది చాలా అవసరం అయిన సీన్. అయితే ఇందులో జొనకీ మనకు ఎనభై ఏళ్ల స్త్రీ గానే కనిపిస్తుంది. ఆమెను గుర్తుకు తెచ్చుకుంటున్న ప్రతి సారి ఆమె ప్రస్తుత రూపమే దర్శకునికి కనిపిస్తుంది కదా. ఆమెకు స్నానం చేపిస్తున్న తల్లి ఆమె కన్నా వయసులో చిన్నగా ఉంటుంది. అంటే దర్శకులు ఆమె ఫోటో చూసి ఆమెను ఎలా గుర్తుంచుకున్నాడొ అదే వయసులో ఆమె ఉంటే, నానమ్మ గా మారిన జోనకి కి ఆ ముడతల శరీరంతోనే తల్లి సహాయంతో స్నానం చేస్తున్న కూతురుగా మనవడు చూస్తాడు. అంటే స్క్రీన్ పైన ఒక ముసలి స్త్రీకి, చిన్నవయసున్న స్త్రీ స్నానం చేయిస్తూ ఉంటుంది. కాని వయసులో ఉన్న స్త్రీ తల్లి, ముసలి స్త్రీ కూతురు. ఎందుకంటే కథ చెప్తున్న మనవడికి వారిద్దరూ ఆ రూపంలోనే పరిచయం. వారి ని మరో రూపంలో అతను ఊహించుకోలేడు. ఎంతటి గొప్ప లాజిక్ ఇది. ఈ లాజిక్ తో నిర్మీంచిన చిత్రం నాకింతవరకు మరొకటి కనిపించలేదు.
ఇక కథకు వద్దాం. జోనకి ఒక క్రిస్టియన్ యువకుడిని ప్రేమిస్తుంది. వారిద్దరూ చాటుగా కలుసుకుంటుంటారు. ఒకరి పట్ల మరొకరికి ఎంత ప్రేమ ఉన్నా పెద్దలు అంగీకరించరు. జోనకి తల్లికి ఈ సంబంధం ఇష్టం ఉండదు. కూతురి ప్రేమను తుంచేస్తుంది. ఆమె తండ్రి ఒక వృక్ష శాస్త్రవేత్త. అతని ప్రపంచాన్ని చాలా వింతగా చూపిస్తాడు దర్శకుడు. అతనికి అకులు మొక్కలు తప్ప ఇంకేం కనిపించవు. తన ఆరోగ్యం పై కూడా శ్రద్ద ఉండదు. ఇంటి విషయాల పై కూడా అవగాహన ఉండదు. అతన్ని ఆ పచ్చదనం చుట్టూనే చూపిస్తారు దర్శకులు. అతను చూసేది, అనుభవించేది, జీవించేది మొక్కలతోనే. అలానే వాటి మధ్య మరణిస్తాడు. కూతురి ప్రేమను తల్లి కాదంటుంది. ఆమె ప్రియుడు యుద్దంలో సైనికుడిగా వెళ్లిపోతాడు. అప్పుడే ఆమె కన్నా వయసులో ఎంతో పెద్దయన ఒక గొప్పింటి వ్యక్తితో ఆమె పెళ్ళి జరిగిపోతుంది.
వివాహంలో ఆమెకు ఎటువంటి ఆనందం లభించదు. ఆమె భర్త లోకం వేరు ఆమె ఆలోచనలు వేరు. ఒకే గదిలో అపరిచితులుగానే జీవిస్తారు వాళ్ళు. ఇద్దరి మధ్య బలవంతపు శారీరిక సంబంధం తప్ప మరేం అనుబంధం ఉండదు. ఆమెను వెతుక్కుంటూ ఆమె ప్రేమికుడు వస్తాడు. అతన్ని జానకి కలుస్తుంది. కాని వారిద్దరూ ఒకటవ్వలేని పరిస్థితి.
అలాగే ఆమె నిర్వేదంగా జీవితాన్ని గడిపేస్తుంది. ఆమె ప్రియుడు ఆమె వద్దకు చేరాలని విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఆ పరిస్థితులలోనే ఆమె తల్లి అవుతుంది. శరీరాన్ని ఈడ్చుకుంటూ పని చేసుకోవడం తప్ప, ఆమె జీవితంలో ఉత్సాహపరిచే అనుభవాలు అంటూ ఏమీ ఉండవు. జీవితంలో ఆనందం ఎండిపోతుంది. అన్ని సౌకర్యాల మధ్య ఒక మోడులా ఆమె జీవితం మిగిలిపోతుంది. అలాగే అరవై సంవత్సరాలు పైగా జీవించి ఆమె మరణానికి దగ్గరవుతుంది. అన్ని సంవత్సరాల ఆమె జీవితంలో తిరిగి చూసుకుంటే విషాదం ఒంటరితనం, ఆమె దరికి చేరని ఆనందం తప్ప మరో అనుభవం ఆమెకు గుర్తుకు రాదు. ఆ స్థితిలో ఆమె ఉందని ఆమెని చూడలని వచ్చిన ఆమె ప్రియుని జీవితం కూడా దాదాపుగా అలాగే గడిచిందని ప్రేక్షకులకు అర్ధం అవుతుంది. జోనకి చివరకు అలాగే అదే స్థితిలో మరణిస్తుంది.
తాము కోరుకున్నట్లు బ్రతికే అవకాశం లేక కేవలం రోజులు గడుపుతూ జీవితాన్ని సాగించిన ఎంతమంది స్త్రీల విషాదమో ఈ సినిమాలోని ప్రతి సీన్ లో కనిపిస్తుంది. ముదుసలిగా మారిన ఆమె జీవితంలో ప్రేమ దొరకని ఒంటరితనాన్ని దర్శకుడు చిత్రించిన విధానం బావుంది. ఆమెకు గడిచిన రోజుల్లో ప్రియున్ని కలుసుకున్న రోజులు గుర్తుకు వస్తుంటాయి. అవి మనవడు తన కళ్ళతో చూస్తాడు. అక్కడ స్క్రీన్ పైన ఎనభై ఏళ్ళ వృద్దురాలు తన ప్రియుడు ప్రేమగా తినిపించే నారంజ పండు తింటూ ఉంటుంది. ఆమె ప్రియుడు ఇరవై ఏళ్ళ యువకుడు. ఆ ప్రియుడి గురించి నాన్నమ్మ ద్వారా విన్నసంగతుల ఆధారంగా ఆ సీన్ లో ప్రియుడిని చిన్నవయసు వాడుగా చూపిస్తూ నాన్నమ్మ ను ముదుసలిగా చూపించడం ద్వారా, ఆమె కోల్పోయిన జీవితంలో ని విషాదం పది రెట్లయి మన ముందు కనిపిస్తుంది. అతని కౌగిలిలో ఒదిగిపోయే ఆ ముసలమ్మ లో చేజారిన జీవితం, అతను లేకుండా ఆమె భరించిన ఒంటరితనం, చేజారిన యవ్వనం కనిపిస్తాయి. ఇంతగా ఒక స్త్రీ లోని విషాదాన్ని స్క్రీన్ పై చూపగలగడం సాధ్యం అని ఈ సినిమా చూసే దాకా తెలీయలేదు.
“జోనకి” సినిమా చూడడం చాలా కష్టం, కాని సమాజం నియంత్రించిఅన్ స్త్రీ జీవితంలోని విషాదాన్ని ఇంత కన్నా గొప్పగా మరే చిత్రం ఇప్పటి దాకా చూపించలేదని చెప్పగలను. కారణం ఈ సినిమాలో వాడిన టిక్నిక్. రచయిత కథ చెప్పడానికి ఎంచుకున్న పద్దతి. జోనకి చేజార్చుకున్న ఆనందం, ఆమె ఊహల్లో ఆ ప్రియుని యవ్వనం రూపంలో కనిపిస్తుంటే ఆమె జీవితంలోని అర్ధహీనత ఆమె ముసలితనంలో కనిపిస్తుంది. రెంటిని ఒకే షాట్లో ఒకటిగా చూపిస్తూ దర్శకుడు జోనకి గడిచిన జీవితం, నడుస్తున్న జీవితంలోని విషాదాలను కలిపి అత్యంత హృద్యంగా చూపించారు.
ప్రేమ ఫలాలు అనే సింబాలిజంతో నారింజ పళ్ళను చాలా సీన్లలలో వాడుకున్నారు. చేజారిన ఫలాలు, చేతికి చిక్కీ చిక్కని ఆనందాలు అనే భావంతో చాలా షాట్లలో ఈ పండ్లను దర్శకులు వాడుకున్నారు. ఈ ప్రయోగం కూడా చాలా వినూత్నంగా ఉంది. నల్లటి వస్త్రాల మధ్య, వెలిసిపోయిన గోడల మధ్య, పేరుకుపోయిన నాచు మధ్య ఆ మెరుస్తున్న పండ్లు జీవితంలోని ఆనందాన్ని ప్రతిపాదిస్తాయి. కాని అవి అందుకుందామన్న ప్రతి సారి జోనకి వాటికి దూరం అవుతూ ఉంటుంది. జోనకి జీవితాంలోని ఈ సత్యాన్ని దర్శకుడు చూపించిన విధానంలోనే ఒక పొయెటిక్ సెన్స్ కనిపిస్తుంది. జోనకి గా లోలితా చటర్జీ నటించారు. ఈ సినిమాలో సంగీతం కూడా వినీ వినిపించకుండా సినిమా అంతా సాగుతుంది. అతి తక్కువ సంభాషణలు ఉంటాయి. ప్రతి ప్ర్రేమ్ లో కథకు సంబంధించిన వాతావరణానికి ఎంచుకున్న రంగులు, వచ్చే సంగీతం, పాత్రల భావలు, అన్నీ అత్యంత విషాదంగా ఉంటాయి. సినిమా నిడివి 95 నిముషాలే. ఆ కాస్త సేపే ఆ మూడ్ లో ఉన్నా కూడా ఆ విషాదం మన లోపల ఇంకిపోయిన భావన కలుగుతుంది. భారతీయ సినిమా పరిణామాన్ని స్టడి చేసే ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఈ జోనకి. దర్శకుడు జోనకి కథ చెప్పిన విధానంలో ఎంతో మానసిక విశ్లేషణకు అవకాశం ఉంది. అందుకే నేను చూసిన సినిమాలలో మర్చిపోలేని సినిమా ఇది.

No comments:

Post a Comment

Post Top Ad