ఉదయ్ కిరణ్ వాజపేయాజుల

Telugu Lo Computer
0

 


 తెలుగు, తమిళ భాష చిత్రసీమల్లో ఉదయ్ కిరణ్ వాజపేయాజుల ప్రసిద్ధ కథానాయకుడు. ఇతను తెలుగులో కథానాయకుడిగా వచ్చిన మొదటి మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ కావటంతో హ్యాట్రిక్ హీరో అనే బిరుదు సంపాదించుకున్నారు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26 న హైదరాబాదులో పుట్టారు. ఇతని తల్లితండ్రులు వీవీకే మూర్తి, నిర్మల. ఇతడు కేవీ పికేట్ లో తన చదువును పూర్తి చేసారు.  ఆ పై వెస్లీ కాలేజీ నుండి బీకాంలో పట్టభద్రుడయ్యారు. చిరంజీవి కూతురు సుస్మితతో 2003లో నిశ్చితార్థం జరిగినా  కొన్ని కారణాల వల్ల పెళ్ళి కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2012లో అక్టోబరు 24న విషితను వివాహమాడారు. 2014 జనవరి 6 న అర్ధరాత్రి శ్రీనగర్ కాలనీలోని జ్యోతి హోమ్స్‌లోని తన ఫ్లాట్‌లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాru. 

తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్, ఒక కొత్త పోకడను హీరోల్లోకి తెచ్చారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను  ఇంకా మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్లయ్యాయి. నువ్వు నేను సినిమాలోని యువకుని పాత్ర పోషణకు గానూ 2001 ఫిలింఫేర్ అవార్డ్ ఇతడ్ని వరించింది. తరువాత వచ్చిన కలుసుకోవాలని సినిమాలో తన నృత్య ప్రతిభను కిరణ్ చూపారు. చిత్రం, నువ్వునేను, జై శ్రీరామ్, మనసంతా నువ్వే లాంటి విజయవంతమైన చిత్రాల్లో ఉదయ్ కిరణ్ నటించారు. తర్వాత వచ్చిన కొన్ని ఫ్లాపుల తర్వాత 2005 లో తమిళంలో బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన పాయ్ చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో ప్రవేశించారు. తరువాత మరో రెండు సినిమాలు, వంబు సందై, పెన్ సింగం అనే సినిమాలు తీసారు.

ఉదయ్ కిరణ్ శ్రీనగర్‌కాలనీలో భార్య విషితతో కలిసి మూడు బెడ్ రూమ్ ఇంటిలో అద్దెకుంటున్నారు. మూడు పడక గదులు కలిగిన ఈ ఇంటిలోని ఓ గదిని వ్యాయామశాలగా మార్చుకున్నారు. 2014 నూతన సంవత్సర వేడుకల నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఉదయ్ కిరణ్, విషిత 2014 జనవరి 2న నగరానికి చేరుకున్నారు. ఫేస్‌బుక్ సంస్థలో పనిచేస్తున్న విషిత.. తన సహోద్యోగి, స్నేహితుడు రోహిత్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు జనవరి 5 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మణికొండ వెళ్లారు. కొద్ది రోజులుగా డిప్రెషన్‌లో ఉంటున్న ఉదయ్ కిరణ్ పరిస్థితి గమనించిన ఆమె తనతో పాటు రమ్మనగా, ఉదయ్ నిరాకరించారు. దీంతో తన తల్లిదండ్రుల్ని ఇంట్లో ఉంచి విషిత పార్టీకి వెళ్లారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అత్త మేఘల, మామ గోవిందరాజన్‌లను మణికొండలోని వాళ్ల ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా ఉదయ్ చెప్పారు. తాను రాత్రి 11 గంటలకు వచ్చి విషితను పికప్ చేసుకుంటానని చెప్పడంతో మేఘల, గోవిందరాజన్ వెళ్లిపోయారు. పుట్టినరోజు వేడుకలు ముగించుకున్న విషిత 11 గంటల ప్రాంతంలో తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ఉదయ్ రాక కోసం వేచి చూశారు. పావు గంట గడచినా రాకపోయే సరికి ఫోన్ చేశారు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోవడంతో మరో మూడుసార్లు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఉదయ్ రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందిన విషిత తన మేనమామ, తండ్రితో కలిసి మణికొండ నుంచి బయల్దేరారు. ఒంటి గంట ప్రాంతంలో శ్రీనగర్‌కాలనీలోని ప్లాట్‌కు వచ్చి తలుపు తట్టగా స్పందన లేకపోవడం, ఉదయ్ అంటూ పిలిచినా పలకకపోవడంతో మారుతాళం చెవితో తలుపులు తీసుకుని లోపలకు వెళ్లారు. లోపల నుంచి మూసి ఉన్న వ్యాయామశాల తలుపు ఎంతకూ తెరుచుకోకపోవడంతో వాచ్‌మన్లు మరికొందరితో కలసి బలవంతంగా తెరిచారు. అక్కడ ఉరివేసుకుని ఉదయ్ కిరణ్ కనిపించడంతో వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అనంతరం ఉరి వేసుకున్న తాడును తొలగించి కిందకు దింపారు. కొన ప్రాణమైనా ఉంటుందని ఆశించి అపోలో ఆస్పత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్‌లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఉదయ్ మృతి చెందినట్లుగా ప్రకటించారు.


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)