మాతృత్వపు మాధుర్యం

Telugu Lo Computer
0


"బిందూ! సారీ ! నేను శలవులకు అమ్మమ్మ దగ్గరికే వెడుతున్నాను. మమ్మల్ని చూడాలి అనుకుంటే నువ్వే అక్కడకు రా. డాడీ ఎలానూ వస్తానని చెప్పారు.
అయినా నా పిచ్చిగాని నీకు తీరిక ఎక్కడ?
ఈమధ్య అనాధాశ్రమాలకు చందాలు వసూలుచేసే కార్యక్రమమొకటి చేపట్టావుట కదా! నాన్నగారు చెప్పారులే. బిందూ! నీ ఉదారబుద్ధికి నా జోహార్లు ఉంటా" అంటూ
ఫోన్ కట్ చేసేసింది అరవింద.
బిందుమాధవి ముఖం మాడిపోయింది. పద్ధెనిమిదేళ్ళ అరవింద తన కూతురు... దాని మాటల్లో ఎంత వ్యంగ్యం దాగివుంది. అవునుమరి...కన్నపిల్లలను తల్లిగా ఏనాడైనా లాలించిందా! పిల్లల ఆలన పాలన చూసిందా! తనను భర్త, ఆ భగవంతుడు క్షమించినా పిల్లలు మాత్రం క్షమించరు. తనను నోరారా 'అమ్మా' అని పిలువరు. ఎంత నిర్భాగ్యురాలు తను... కన్నీరు కారుస్తూ అలానే మంచంమీద వాలిపోయింది బిందుమాధవి.
టెన్త్ ఎగ్జామ్స్ అయిన వెంటనే బిందుమాధవి వివాహం ఆ ఊళ్ళోనే ఆంధ్రాబ్యాంక్ క్యాషియర్ అయిన మోహన్ తో అయింది. పెళ్ళయిన ఏడాదికి అరవింద తరువాత అజయ్ పుట్టారు. పిల్లలను కన్నదన్నమాటే కాని పెంపకమంతా బిందుమాధవి తల్లిదే.
పిల్లల ఆలన పాలన అమ్మమ్మే చూసుకునేది. అజయ్ పుట్టిన ఆరునెలలకు మోహన్ కు ట్రాన్స్ఫర్ అయింది పిల్లలను తల్లిదండ్రుల దగ్గరే వదిలేసి భర్తతో వెళ్ళిపోయింది బిందుమాధవి.
పిల్లలు అమ్మమ్మ కు బాగా మాలిమి అయిపోయారు. బిందుమాధవి పుట్టింటికి వచ్చినప్పుడయినా పిల్లలను చేరదీసేదికాదు. అందుకే వాళ్ళకు తల్లి దగ్గర చనువు లేదు. అమ్మమ్మనే 'అమ్మా' అనేవారు. తల్లిని పేరు పెట్టి పిలిచేవారు. అమ్మమ్మ మందలించినా తల్లిని 'అమ్మ' అని పిలవడం అలవాటు కాలేదు. పైగా వాళ్లు ఎలా పిలిచినా పట్టించుకొనేదికాదు బిందుమాధవి.
మోహన్ మాత్రం అత్తవారింటికి వచ్చినప్పుడు పిల్లలతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. అక్కడకు వాళ్ళకోసమే వచ్చేవాడు. అందుకే అతనిని తండ్రిగా గుర్తించారు
అరవింద, అజయ్.
బిందుమాధవి అన్న వాసుదేవరావుకు పెళ్ళయి భార్య కాపురానికి వచ్చాక పిల్లలను ఇంకా అక్కడ ఉంచడం భావ్యం కాదని అనిపించి...మోహన్ వాళ్ళను తనతో తీసుకెళ్ళిపోయాడు.
అయితే ఇంటిపట్టునుండక మహిళా సంఘాలు సంఘసేవ అంటూ తిరిగే బిందుమాధవి వద్ద పిల్లలకు క్రమశిక్షణ లోపించటమేకాక చదువుకూడా వంటబట్టదని తెలుసుకొని పిల్లలను హాస్టల్ లో చేర్చాడు.
అరవింద అజయ్ పెరిగి పెద్దయినా వాళ్ళకు అమ్మమ్మ తాతయ్య, మేనమామల వద్ద ఉన్న చనువు తల్లి దగ్గర లేదు. శలవులకు అమ్మమ్మగారి ఊరే వెళ్ళేవారు.
ఈ మధ్యనే బిందుమాధవి లో కొద్దిగా మార్పు వస్తోంది.
తను తల్లిగా ఏం కోల్పోతోందో మెల్లమెల్లగా అర్థం అవుతోంది. పిల్లలకు చేరువ కావాలనే తాపత్రయం పెరిగింది. వాళ్ళచేత 'అమ్మా'అని పిలిపించుకోవాలనే కోరిక కూడా కలిగింది.
సాయంత్రం ఇంటికి వచ్చిన మోహన్ తో పిల్లలను చూడడానికి వెళ్దామని అంది. ఓ వారం శలవు తీసుకొని భార్యతో అత్తవారింటికి బయలుదేరి వెళ్లారు.
అల్లుడుని పలుకరించి "ఏమ్మా బిందూ కులాసాయేనా" అన్న తల్లి పలకరింపుకు తల వూపి "అరూ, అజయ్ రాలేదామ్మా" అని అడిగింది.
"హైదరాబాద్ నుంచి రవి వచ్చాడు అందరూ కలిసి బయటకు వెళ్ళారు" అంది ఆవిడ.
రవి వాసుదేవరావు కొడుకు. వాసుదేవరావుకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి మూడు సంవత్సరములయింది. ట్రాన్స్ఫర్ ఆపుకోడానికి ప్రయత్నించాడు కాని కుదరలేదు. తల్లి తండ్రులను తనతో వచ్చేయమన్నాడు. అక్కడ తోచుబాటు కాదని వెళ్ళలేదు వీళ్ళు.
సాయంత్రం వేళ వచ్చారు పిల్లలు. "హాయ్ బిందూ! ఎప్పుడొచ్చేవ్?" అంటూ తల్లిని పలుకరించింది అరవింద. అజయ్ తల్లి వైపు చూడనైనాలేదు. తిన్నగా తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడు.
భోరున ఏడ్వాలనిపించింది ఆమెకు. వచ్చినదగ్గరనుంచి పిల్లల కోసం ఎంత ఆరాటంగా ఎదురు చూసింది. కానీ...చిన్నగా నిట్టూర్చి తండ్రితో గలగల మాట్లాడే పిల్లల వంక చూస్తూ కూర్చుండిపోయింది.
ఉన్న వారం రోజుల్లో వాళ్ళకు చేరువ కావాలని ఎంతగానో ప్రయత్నించింది. కుదరక తల్లి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంది. మోహన్ పెట్టుకొన్న శలవులు అయిపోయాయి. మర్నాడు ప్రయాణమనగా రాత్రి అరవింద, అజయ్ లను దగ్గర కూర్చోపెట్టుకున్నాడు.
"చూడమ్మా అరూ! మీరు అమ్మతో చనువుగా ఉండడం లేదని బాధపడుతోంది. తమ్ముడుకి చెప్పవలసింది పోయి నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలాగమ్మా" లాలనగా అడిగాడు.
"ఎందుకు డాడీ! బిందుతో మాకు ఎప్పుడు చనువు
వుందనీ! ఆశ్చర్యంగా వుందే!" వెటకారం ధ్వనించింది
ఆ పిల్ల గొంతులో.
"తప్పు కదమ్మా అరూ! అమ్మను అలా ఉసురు పెట్టవచ్చా" అప్పడే అటుగా వచ్చిన బిందుమాధవి తల్లి అంది.
"ఏంచేయమంటావు?" విసుగ్గా అడిగింది అరవింద.
"ఏమిటే నీ ధోరణి? తల్లితో ఎలా మసులుకోవాలో మేము చెప్పాలా? వచ్చిన దగ్గర నుంచి ఒక్కలా బాధపడుతోంది అది ఒక్కసారైనా నువ్వు, నీ తమ్ముడు దానిని నోరారా
అమ్మా అని పిలిచారా?"
"అమ్మ! హుఁ... ఒక్కనాడయినా అమ్మలా లాలించిందా అమ్మమ్మా...నీ కూతురు! మేము పెరిగింది నీ దగ్గర. మొదటిసారిగా అమ్మా...అని పిలిచింది నిన్నే అనుకుంటా. కాస్త పెద్దయాక నువ్వు అమ్మ కాదని బిందే అమ్మని చెప్పావు. అప్పుడు తనకు దగ్గరవాలనీ, అమ్మా నాన్నలతో కలిసి ఉండాలని తమ్ముడు నేను ఎంతగా తహతహ లాడామొ తెలుసా మీకు?
ఇప్పుడు కావలసివచ్చిందా కన్నపిల్లల ప్రేమ తనకు"
తీవ్రంగా ధ్వనించింది అరవింద గొంతు.
అజయ్ మౌనంగా వింటూ ఉన్నాడు. అతనికి ఏవేవో అనాలని అడగాలని వుంది. అయితే ఎక్కువగా మాట్లాడే స్వభావం కాదు ఆ కుర్రాడిది.
"జరిగిపోయిన రోజులు ఎందుకమ్మా! ఇప్పుడు మీరు మా దగ్గరే ఉందురుగాని. మీపట్ల ప్రవర్తించిన తీరుకు మీ అమ్మ పశ్చాత్తాప పడుతోంది కదా! ఇంకా ఆమెను బాధ పెట్టడం భావ్యం కాదు. మీరిద్దరూ ఆలోచించుకోండి." మోహన్ లేస్తూ అన్నాడు.
ఈ సంభాషణంతా ప్రక్కగదిలో వున్న బిందుమాధవి వింటూనేవుంది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి.
"బిందూ! బాధపడకు. పిల్లలు ఎప్పటికయినా నిన్ను అర్థం చేసుకొంటారు" భార్య కన్నీళ్ళు తుడుస్తూ అన్నాడు మోహన్.
"లేదండీ! చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాను. అరూ అన్నమాటల్లో తప్పేముంది? గోరంత ప్రేమ కూడ ఏనాడూ పంచలేదు వాళ్ళకు కనడం తప్ప.
అమ్మ ఎన్నోసార్లు హెచ్చరించింది. పిల్లలను అలావదిలేసి వారిని నీ ప్రేమకు దూరం చేయకమ్మా అని. మాతృత్వపు మమకారానికి దూరమయి వాళ్లు ఎంత అలమటించిపోయారో! ఇవాళ అరూ మాటల వలన అర్థమయింది."
రాత్రంతా ఏడుస్తూనే వుంది బిందుమాధవి. తెల్లవారి కాఫీ టిఫిన్లు అయ్యాక బయలుదేరారు మోహన్ బిందుమాధవి.
"డాడీ"! కూతురు పిలుపుకు ఆటో ఎక్కబోతోన్న
మోహన్ వెనుదిరిగి చూసాడు. "మేము కూడ మీతో వచ్చేస్తాం" తల దించుకొని మెల్లగా అంది అరవింద.
ఆ మాట విన్న బిందుమాధవి చటుక్కున ఆటోదిగింది. "అరూ! ఈ అమ్మను క్షమించగలవా?" అంది.
"అమ్మా" లోగొంతుతో పలికింది అరవింద.
ఆ పిలుపుకు పరవశించిపోయింది బిందుమాధవి.
'అమ్మా' అనే పిలుపులో ఎంత మాధుర్యం వుందో అప్పుడే గ్రహించింది మూర్ఖత్వముతో ఇన్ని సంవత్సరాలు ఈ పిలుపుకు నోచుకోకపోయానే అని వగచింది.
"అమ్మా" అజయ్ కూడ వచ్చాడు. ఇక నిలవలేకపోయింది ఆమె. ఇద్దరిని చెరోచేత్తో లాక్కుని అక్కున చేర్చుకుంది.
దుఃఖం, ఆనందం కలగలిపి అశ్రురూపంలో బయటపడ్డాయి.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)