డాబాగార్డెన్స్‌కు ఆ పేరు ఎలా వచ్చింది?

Telugu Lo Computer
0




విశాఖపట్నంలో డాబాగార్డెన్స్‌ అనే ప్రసిద్ధమైన ప్రాంతం ఉంది కదా! దానికాపేరు ఎట్లా వచ్చిందో తెలుసా? అక్కడ ఒక జమిందారుగారి తోటలో ఒక ‘అబ్జర్వేటరీ’ అంటే ఖగోళ విజ్ఞాన అన్వేషణ

భవనం ఉండేది. నక్షత్రాలు, గ్రహాలు, దివిలో సంభ వించే అద్భుతాలు శాస్త్రీ‌య విజ్ఞానంతో గమనించి పరిశోధనలు చేసి ప్రయోగ ఫలితాలు తెలుసుకొనే ప్రయోగశాల అన్నమాటఅది. దానిని ‘నక్షత్ర వేధశాల’ అంటారు. అంటే నక్షత్ర విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవసరమైన పరికరాలు ఉండే భవనమన్న మాట. అప్పట్లో అబ్జర్వేటరీ అనడం తెలీక పెద్ద మిద్దె లేదా డాబా అనేవారు. జమిందారు గారి ఉద్యాన వనంలో ఆ డాబా కట్టారు. కనుక ఆ ప్రాంతం డాబా గార్డెన్స్‌ అయింది. నేటి ఢాల్ఫిన్ హోటల్ ఉన్న స్థలమే నాటి నక్షత్రవేధశాల.
కీశేశ్రీ గోడే వెంకట జగ్గారావు గణితశాస్త్రంలో జ్యోతిశ్శాస్త్రంలో అఖండ ప్రజ్ఞావంతులు
ఆయన 1817లో విద్యావంతులైన కుటుంబంలో జన్మించారు. ఆయనకు మొదటి నుండి గణితశాస్త్రం పై ఆసక్తి ఎక్కువగా ఉండేది. 1833లో ఆయన ఖగోళ శాస్త్రంవైపు ఆకర్షితులైనారు. తన 17వయేట ఈ రంగంలో జ్ఞానాన్ని పొందుటకు మద్రాసు పయనమయ్యారు. అచట మద్రాసు వేదశాలలో Mr.టైలర్ వద్ద శిక్షణ పొందారు. ఆ కేంద్రంలో థామస్ గ్లాన్‌విల్లే టైలర్ 1830 నుండి 1848 వరకు ప్రభుత్వ ఖగోళ పరిశోధకులుగా ఉండేవారు. జగ్గారావు ఖగోళ పరిశోధకుడైన టైలర్ తో కలసి పనిచేయడం వల్ల ప్రేరణ పొంది స్వంతంగా విశాఖలో నక్షత్రశాలను ప్రారంభించారు. టైలర్ మరియు మద్రాసు జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్ పత్రిక సంపాదకుడైన మోరిస్ జగ్గారావు కృషికి ప్రోత్సాహాన్ని అందించారు. టైలర్ తాను హేలీ తోకచుక్కపై ఎం.జె.ఎల్.ఎస్ లో ప్రచురితమైన వ్యాసంలో తనకు ఈ పరిశోధనలో జగ్గారావు అందించిన సహాయాన్ని ప్రస్తుతించారు.
ఉత్తరాంధ్రలో గోడేవారిదీ, అంకితం వారిదీ అటువంటి సంపన్న జమిందారీ కుటుంబాలు. గోడే నారాయణ గజపతి ఆ రోజుల్లో ప్రసిద్ధులు. బ్రిటిషు ప్రభుత్వం ఆదరాభిమానాలు, బిరుదులు కూడా పొందాడు. సంపన్నులు, అభ్యుదయ దృక్పథం కలవాడు. దసరా పండుగలకు విశాఖ పట్నంలో గొప్ప ఉత్సవాలు నిర్వహించేవారు. నారాయణ గజపతి అన్న వెంకట జగ్గారావు.
విశాఖలో నక్షత్ర వేథశాల
ఆయన భారతదేశంలో అంతరిక్ష అబ్సర్వేటరీలకు ఆద్యుడు. ఆయన 1840లో తన స్వంత నక్షత్ర వేథశాలను విశాఖపట్నంలో నిర్మించారు. ఆయన తన ఏకైన కుమార్తె అయిన అచ్చియ్యమ్మను అంకితం వెంకట నరసింగరావుకు యిచ్చి వివాహం చేసారు. నరసింగరావు ఆ నక్షత్రశాలను కొంతకాలంపాటు కొనసాగించారు. వీరు తన మామగారి శాస్త్ర విషయక కృషియందు ఆసక్తి పొంది ఆ నక్షత్రశాలను అనేక విధములుగా అభివృద్ధి చేసి ప్రభుత్వంవారితోనూ, ఇతర దేశపు జ్యోతిశ్శాస్త్రజ్ఞులతోను ఉత్తర ప్రత్యుత్తరములు పెట్టుకొని అతి సమర్థులని పేరుపొంది రాయల్‌ ఏసియాటిక్‌ సొసైటీకి 1871లోనూ, రాయల్‌ జియో గ్రాఫికల్‌ సొసైటీకి 1872 లోనూ ఫెలో అయినారు. వెంకట జగ్గారావుగారి కుమార్తె అయిన వీరి భార్య గారు తమ తండ్రి గారిపై గల అభిమానంతో అబ్జర్వేటరీని శాశ్వత బ్రహ్మకల్పముగ కాపాడబడుటకై మూడు లక్షల రూపాయలను మూల ధనముగా నుంచారు. నరసింగరావు గారు తాము కనిపెట్టిన వింతల గురించి ఒక పుస్తకము ప్రచురించారు. ఆయన సంస్థాన వ్యవహారాలు చేసుకొనేందుకు తన పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామా చేసిన తరువాత భారత ప్రభుత్వం "రాయ్‌ బహదూర్"గా బిరుదునిచ్చింది. ఈ వేథశాల బాధ్యతలను ఆయన తన అల్లుడు అయిన అంకితం వెంకట నరసింగరావు 1892 వరకు నిర్వహించారు. తరువాత ఆయన భార్య మరియు జగ్గారావు గారి కుమార్తె అయిన అచ్చయ్యమ్మ 1894 వరకు నిర్వహించారు. ఈ వేథశాఅల 1898 వరకు మద్రాసు ప్రభుత్వంచే నిర్వహింపబడింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)