అవగాహన....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 24 June 2021

అవగాహన....!

 
పార్వతీశం పూజ చేసుకుంటున్నాడు.ఆయన తల్లి

వర్ధనమ్మ రామనామ స్మరణ చేస్తూ జపమాల తిప్పుతూ హాల్లో సోఫాలో కూర్చుని ఉంది.
ఉదయం 8 గంటల ఆ టైంలో కాలింగ్ బెల్ శబ్దం విని
వంట గదిలో నుంచి కృష్ణవేణి వచ్చి డోర్ తీసి చెప్పాపెట్టకుండా హఠాత్తుగా వచ్చిన కూతుర్ని చూసి ఆశ్చర్యపోయింది.
శరణ్య సూట్ కేస్ తోసుకుంటూ లోపలికి వచ్చి నాన్నమ్మ పక్కన సోఫాలో చతికిలబడింది.
"ఏమిటి...ఒక్కదానివే వచ్చావు...! అల్లుడు రాలేదా...?"
తల్లి అడిగినదానికి జవాబు ఇవ్వలేదు శరణ్య.
"మాట్లాడవేమే...!"
"ఇప్పుడేగా వచ్చింది...!"
పూజ అయి బయటకు వచ్చిన పార్వతీశం భార్యతో అని కూతురుతో "నువ్వు వెళ్లి బ్రష్ చేసుకునిరా బేబీ! అమ్మ కాఫీ ఇస్తుంది" అన్నాడు.
కాఫీ తాగి స్నానం చేసి వచ్చి టిఫిన్ తిని కూర్చున్న కూతుర్ని "ఏంటమ్మా ఫోన్ కూడా చేయకుండా వచ్చావు...!
అల్లుడు ఏదైనా క్యాంపుకి గాని వెళ్ళాడా?" అని అడిగాడు.
"లేదు నాన్నా...ఆయన నా మాట కాదన్నారన్న పంతంతో బయలుదేరి వచ్చేశాను" అంది.
"పంతమా...!దేనికమ్మా...?"
"జాబ్ చేస్తాను... అంటే ఒప్పుకోవడం లేదు నాన్నా!
ఇంట్లో కూర్చుని ఒకటే బోర్ గా ఉంటోంది...మీరే చెప్పండి!
ఇంట్లో కూర్చునే దానికి ఈ బియిలు,బీటెక్ లు దేనికి నాన్నా!"
"ఆ మాత్రం దానికి వచ్చేస్తావా...నచ్చ చెప్పుకోవాలి గానీ...!" అన్న తల్లి మాటలకు "వింటేగా... వారం రోజుల నుంచి బ్రతిమాలుతూనే ఉన్నాను. అందుకే ఇలా...!"
"వచ్చాను అంటావు! బాగుంది ఇంత చిన్న విషయానికి..."
"చిన్న విషయమా...! నామాటకు విలువివ్వకపోగా వెళ్ళిపోతాను అంటూ వచ్చేస్తూంటే తనకేమి పట్టనట్లుగా
ఊరుకోవడం...!"
"అయితే మాత్రం...! ఇలా వచ్చి ఏం సాధిద్దామని...!"
"ఊరుకో కృష్ణా...! తర్వాతమాట్లాడుకుందాం" అని
పార్వతీశం ఆఫీసుకు వెళ్లి పోయాడు.
సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు అల్లుడికి కాల్ చేసి విషయం తెలుసుకున్నాడు. అల్లుడు చెప్పింది సబబే అన్పించింది ఆయనకు.
"నేనేం తప్పుగా మాట్లాడలేదు మావయ్యా! తను సంపాదిస్తేనే కానీ గడవని సంసారం కాదు కదా మాది!
ఆదరాబాదరాగా బయల్దేరి సాయంత్రం ఇంటికి వచ్చాక
హడావిడిపడుతూ వంట పని, ఇంటిపని చేసుకోవడం...
ఇదంతా అవసరమా...!
చక్కగా ఇంటిపట్టున ఉండి ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన నాకు...నువ్వు చిరునవ్వుతో ఎదురు వస్తే కలిగే ఆనందం ముందు
ఈ సంపాదన ఏపాటిది... ! కాలక్షేపం కోసమైతే జాబే చేయనక్కరలేదు...ఏదో ఒక వ్యాపకం కల్పించుకోవచ్చు... నీకు ఇష్టమైతే ఎంబీఏ చేయొచ్చు...లేదా ప్రైవేటుగా చేసేది ఏదైనా సరే నీ ఇష్టం అన్నా.
'అది మాత్రం ఎందుకు...? ఇంట్లో కూర్చో డానికేగా...!' అంది.
'ఎంత మంది చదువుకున్న వాళ్ళు ఇంటిపట్టున ఉండడం లేదు!' ఇంతకన్నా నేను ఏమీ అనలేదు మవయ్యా...!
తను జాబ్ చేయడానికే నిశ్చయించుకుని మొండికేస్తే ...
నేను ఏమీ అనను...తన ఇష్టం! మీరు చెప్పి చూడండి... మీమాట వింటుందేమో...అనే ఉద్దేశ్యంతో బయలుదేరి వస్తూంటే ఆపలేదందుకే..." అన్నాడు.
కూతురు మనసు మార్చుకొని వెళ్ళిపోతుందేమోలే అనుకుని ఓ నాలుగు రోజులు ఏమీ మాట్లాడలేదు ఆయన.
ఆతర్వాత
"బేబీ! ఇలా రామ్మా..." అని కూర్చున్నాక "ఏం చేద్దామను కొంటున్నావు...! అల్లుడుతో మాట్లాడాను... అతనన్నది నిజమే
కదమ్మా!"
"ఏమిటి నాన్నా...మీరు కూడా ఇలా...!"
"నన్ను పూర్తిగా చెప్పనీ తల్లీ...! నీ చదువుకు తగ్గ జాబ్ రాకపోదు కానీ...తిరిగి రానివి గడిచి పోయిన రోజులు...!ఇలా పంతంతో అతనక్కడ నువ్విక్కడ బాధపడుతూ... ఆలోచించమ్మా!"
"నేనేం బాధపడడం లేదు...ఆయన మాత్రం...
నామీద ప్రేమ ఉంటే ఈపాటికి ఫోన్ చేయడమొ...వచ్చి తీసుకువెళ్ళడమొ జరిగేదే...!"
"ఏమిటే నీ రాద్ధాంతం!అతను కూడ నీలాగే ఆలోచిస్తే...!
ఎవరికి వాళ్ళు ఇలా భీష్మించుకు కూర్చుంటే ఎలా...?
నేనూ చదువుకున్నా! ఉద్యోగం చేయాలని అనుకోలేదె!" కృష్ణవేణి అంది.
"మీరోజులు వేరమ్మా...!"
"రోజుల్లో మార్పేమీ లేదు.ఆలోచించే విధానంలోనే...!"
"అంటే...నీ ఉద్దేశ్యం! నాకు అంటూ ఓ ఆలోచన కూడదనా...! అతను చెప్పినట్లుగానె నడుచుకోవాలనా...!"
"అలాగని నేననలేదే...అతను చెప్పింది అర్థం చేసుకోమంటున్నాను. ఇప్పుడంటే ఖాళీగా ఉన్నావు...! పిల్లలు పుట్టేక మానేస్తావా...?"
"మానవలసిన అవసరమేముంది? ఎంతమంది చంటిపిల్లల తల్లులు జాబ్ చేయడం లేదు!?
అయినా ఇప్పుడా విషయమెందుకు? ప్రస్తుతం చేస్తే తప్పేమిటి...?
ఆడదానికి ఆర్థిక స్వాతంత్య్రం అక్కరలేదనా...!"
"ఇప్పుడు నీకేం తక్కువయిందే...?!"
"ఎక్కువ తక్కువల గురించి కాదు నేననేది...
మనకంటూ సంపాదన ఉంటే అదో ధైర్యం తృప్తి..."
"బాగుందమ్మా! నువ్విలా వచ్చేయడం నాకు నచ్చలేదు... అతను నీకేం లోటు చేస్తున్నాడని...!"
"నేను మీ దగ్గరేం ఉండిపోనులే...జాబ్ చూసుకుని వెళ్ళిపోతా...భయపడకండి...!"
"ఎందుకమ్మా...నువ్వెక్కడికి వెళ్ళనక్కరలేదు. నేను చెప్పేది కాస్త విను. అతనికి నేను నచ్చచెప్తా! కాని నువ్వు కూడ ఆలోచించు." పార్వతీశం అన్నాడు.
"అది చెప్పే ప్రతిమాటకు ఔనంటు గారాబం చేయబట్టే ఇలా మాట్లాడుతోంది. బొత్తిగా ఇప్పటి పిల్లలకు సహనం లేకపోతోంది. అన్నిటికి తొందరపాటే...దంపతులిద్దరిలో ఎవరో ఒకరు సర్దకుపోయే వారు పూర్వం రోజుల్లో...
పెద్దవాళ్ళు కాదంటున్నా వినకుండా ప్రేమించాం పెళ్ళిచేసుకుంటాం అని వెళ్ళిపోవడం...సంవత్సరం తిరిగేసరికి విడాకులు తీసుకోవడం..."
"నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదుగా...! మీరు కుదిర్చిన సంబంధమేగా! అదీగాక నేను విడిపోతానని అనడంలేదు."
"నీగురించి చెప్పట్లే జనరల్ గా జరుగుతున్నదిదేగా...!
నువ్వు చేస్తోన్నపని మాత్రం....విడిగా ఉంటాననడంలో అర్థం?"
శరణ్య మాట్లాడకపోయేసరికి "బేబీ! మరొక్కసారి చెప్తున్నాను. విని నిదానంగా ఆలోచించు. అల్లుడు బుద్ధిమంతుడు. నువ్వే చాలాసార్లు అతను నిన్నెంత బాగా చూసుకుంటున్నాడో చెప్పావు. పచ్చని సంసారం పాడు చేసుకోకు... మానసికంగా శారీరకంగా హింసిస్తున్న వారి గురించి వింటున్నాం... నీకు జాబ్ చేయడం తప్పనిసరి అనుకుంటే నచ్చచెప్పి ఒప్పించుకో... నువ్వు మాకు బరువేమి కాదు. ఇంతకన్నా నేను చెప్పగలిగేది లేదు.
"మీరిద్దరూ మాట్లాడకండర్రా నేను చెప్తాను!" అంటూ వర్ధనమ్మ కలగ చేసుకుని "అమ్మాయీ! నేను చెప్పేది విను. నీలాగా నేను చదువుకోలేదు...కానీ నా జీవితానుభవం చెప్తే అర్థం చేసుకోగలవనుకొంటున్నాను! నేను నా12వ ఏట అత్తింట్లో అడుగు పెట్టాను.అందరూ కొత్త...
ఒకటే భయం...పైగా మాది ఉమ్మడి కుటుంబమాయె...!
మీ తాతగారుతో కలిపి అన్నదమ్ములు ఆరుగురు. ఆడపడుచులు ఇద్దరూ పెళ్లిళ్ళయి వెళ్ళారు.
అత్తమామలు, బావగార్లు, తోడికోడళ్ళు, వారిపిల్లలు, మరుదులు ఇంతమందిమి...
అందరం కలిసి పని చేసుకుంటే శ్రమ అనిపించదు కానీ కొందరు పని దొంగలు కూడా ఉన్నారు. వండడం వార్చడం వడ్డించడం...పొద్దంతా ఇలాగే గడిచిపోయేది. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పేదికాదు.
పని వల్ల ఒక్కోరోజు నీరసం అనిపించేది. ఆడపడుచులు వచ్చినప్పుడు మరింత పని...దానికి తోడు వాళ్లు విసిరే సూటిపోటి మాటలతో మనసు గాయపడేది. వేరేకాపురం పెట్టే ప్రసక్తా...లేదు. మీతాతగారి ఓదార్పు మాటలు టానిక్ లా పని చేసేవి. ఓపిక పట్టు. మాట తూలకు...అంటూ ఆయన చెప్పినది విని మారు మాట్లాడలేదు.
మాఅత్తమామలు కాలంచేసేవరకు కలిసే ఉన్నాము. ఎందుకు చెప్తున్నానంటే...మీ తాతగారికి నాకు మధ్యగల అవగాహన అలాంటిది."
"బామ్మా! మీది ఉమ్మడికుటుంబం... అప్పట్లో తప్పేవికావు... అమ్మకి ఆబాధలేదే... తాతయ్య, నువ్వు, అత్త అంతేగా...ఇంట్లో కాలక్షేపానికి లోటేముంది? అందుకే రోజులు వేరు అనేది..."
"అలాగా...! అయితే చెప్తావిను. మీ అమ్మ కాపరానికి వచ్చేనాటికి అత్త వయసు పదకొండు సంవత్సరాలు.
మీనాన్న తర్వాత పద్నాలుగేళ్ళకు పుట్టిన పిల్ల అని గారాబం చేయడంతో అది ఎవరి మాట వినేది కాదు. తనకు కావాలనుకున్నదేదైనా...కొనిచ్చేవరకూ ఊరుకునేదికాదు. మావరకైతే పర్వాలేదు...మీఅమ్మ దగ్గర కూడ అలాగే ప్రవర్తించేది. నేను కసిరినా వినేదికాదు.
తను ఏదికొనుక్కున్నా పేచీపెట్టి లాక్కొనేది. మీనాన్న కొన్నవైనా...తన పుట్టింటినుంచి తెచ్చుకున్నవయినా సరే!
ఏడ్చి రాగాలు పెట్టి ఇచ్చేవరకూ ఊరుకునేదికాదు.
మీఅమ్మకు తన ప్రవర్తన బాధ కలిగించిన మీనాన్న
నచ్చజెప్తే వినేది తప్ప... అలిగి పుట్టింటికి వెళ్లి
వేరింటి కాపురం పెట్టేవరకు రానని మొండికేస్తే...అలాచేయలేదు. సహనం గల పిల్ల అని అనుకొనేవాళ్ళం.
చిన్నప్పుడు ఎంతపెంకిదో... పెద్దయాక ఆఅల్లరంతా ఏమయిందో...మారిన అత్త తెలుసు నీకు.
ఇప్పడంటే తోచుబాటు కాకపోవచ్చు...నీకడుపున కూడ ఒక కాయ కాస్తే అప్పుడు తీరుబడే ఉండదు...అంతవరకు ఏదోవిధంగా కాలక్షేపం చేసుకోవాలి...!"
కొద్దిసేపు వారి మధ్య మౌనం రాజ్యమేలింది.
"బేబీ! కంగారేమిలేదు. నిదానంగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నువ్వు చెప్పింది కరక్టే...అప్పటి రోజులుకి ఇప్పటి రోజులకు చాలా మార్పు కనిపిస్తోంది. అప్పట్లో అవగాహన లోపించిన దంపతులమధ్య ఎన్నిపొరపొచ్చాలున్న చాలా మంది ఆడపిల్ల తల్లిదండ్రులు సర్దుకు బ్రతకమనేవారు తప్పించి ఆదరించేవారుకాదు. ఆఖరికి భర్త కొట్టినా తిట్టినా శాడిస్ట్ అయినా సరే.
ఇపుడు ఆడపిల్లలు తమకాళ్ళమీద తాము నిలబడే స్థితిలో ఉన్నారు. అయితే చాలా కుటుంబాల్లో దంపతులమధ్య సామరస్యము లోపించి విడిపోయిన వాళ్ళను చూస్తున్నాము. చిన్న చిన్న మాటపట్టింపులకే తెగతెంపులు చేసుకొనేది కాదమ్మా...
దాంపత్య జీవితమంటే!"
"నాన్నా! మీరుకూడ అమ్మలాగే అంటున్నారు. నేను ఆయనతో విడిపోతానని అనడంలేదే?"
"నువ్వనలేదురా! అర్థం చేసుకుంటావని చెప్తున్నాను అంతె. సరే పొద్దున్న మాట్లాడుకుందాం పడుకోతల్లీ...!"
పడుక్కుందన్నమాటేగాని...చాలాసేపు నిద్ర రాక ఆలోచిస్తూనే ఉంది. తండ్రితో 'నేనేం బాధపడడంలేదు' అని అంది కాని వచ్చినప్పటినుంచి దిగులుగానే ఉంది తనకు. అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తోంది. రమ్మని పిలుస్తాడేమోనని చిన్ని ఆశ. పంతంతో వచ్చేసిన తను రమ్మనకుండా వెళ్తే లోకువైపోతాను అనే భయం...
"నాన్నా!" ఉదయం ఆఫీసుకు బయలు దేరివెడుతోన్న తండ్రిని పిలిచింది. "మీ అల్లుడు పిలవకుండా ఇంటికి వెళ్ళాలంటే...!"
చెప్పడానికి సంశయిస్తున్న కూతురి మనసు
అర్థం చేసుకున్న ఆయన "భార్యాభర్తలమధ్య
ఉండవలసినది పరస్పర అవగాహన, అనురాగమే కాని
పంతాలు, పట్టింపులుకాదమ్మా...! పోనీ నన్ను రమ్మంటావా...?"
"వద్దులెండినాన్నా...నేనేబయలుదేరివెళ్తాను" మాట్లాడుతూన్న శరణ్య చేతిలో మొబైల్ ఫోన్ రింగ్ వింటూనే ఆశ్చర్యానందాలు ఒక్కసారిగా ముప్పిరిగొనగా లిఫ్టు చేసి చెవిదగ్గర చేర్చి వింటూండిపోయింది.
"రాణీగారి అలకతీరలేదా?" భర్త గొంతు పలికిన తీరుకు ఆమెకళ్ళల్లోనీళ్ళు నిలిచాయి.
"వచ్చేయిరా శరణ్యా! నువ్వు లేకపోతే నాకిక్కడ బాగోలేదు. నీకు అంతగా జాబ్ చేయాలనే కోరికను నేను కాదనడం తప్పే! Sorry! వస్తావుకదూ!"
శరణ్యకు ఫోన్ చేసి మాట్లాడుతున్నదెవరో అర్థమయిపోయింది ఆ ముగ్గురికి. వర్ధనమ్మ, కృష్ణవేణి ఒకరినొకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు.
పార్వతీశం కూతురి తల నిమిరి "వస్తానమ్మా" అంటూ ఆఫీసుకు బయలుదేరి వెళ్లాడు.

No comments:

Post a Comment

Post Top Ad