కదిరి వెంకటరెడ్డి

Telugu Lo Computer
0


కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేసి, ఆయన 1972 సెప్టెంబర్ 15 చెన్నైలో మరణించారు. 

కె.వి.రెడ్డి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో తన మేనమామల వద్ద పెరిగారు . చిన్నతనంలో అతని అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు. చదువూ చక్కగానే చదివేవారు.  తర్వాతి కాలంలో తనను సినిమా రంగంలోకి తీసుకువచ్చి దర్శకుడిని చేసిన వ్యాపారవేత్త మూలా నారాయణస్వామితో తాడిపత్రిలోనే కలిసి చదువుకున్నారు. మేనమామల ప్రోద్బలంతో, సహాయంతో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరిన కె.వి. అక్కడే మెట్రిక్, డిగ్రీ పూర్తిచేశారు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమై, చిన్న వ్యాపారం చేస్తూండగా మూలా నారాయణస్వామి పిలవగా సినిమా నిర్మాణ శాఖలో కెరీర్ ప్రారంభించారు.  

వాహినీ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజరుగా ప్రారంభమై 1942లో భక్త పోతన సినిమాకు దర్శకత్వం వహించారు.   సినిమా మంచి విజయం కావడంతో వాహినీ ప్రొడక్షన్స్ ఏర్పడి, అందులో కె.వి.రెడ్డి నిర్మాణ భాగస్వామిగా చేరారు.  ఆపైన ప్రధానంగా వాహినీ, విజయా వంటి నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీశారు.   జయంతి అనే స్వంత సంస్థ నెలకొల్పి 3 సినిమాలు తీశారు.   ఇవి కాక అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఎన్.ఏ.టి. సంస్థలకు ఒక్కో సినిమా తీశారు. అతని విజయవంతమైన సినిమాల్లో మాయాబజార్ (1957) వంటి పౌరాణిక నేపథ్యం ఉన్న చిత్రం, శ్రీకృష్ణార్జున యుద్ధము (1963), శ్రీకృష్ణసత్య (1972) వంటి పౌరాణిక చిత్రాలు, గుణసుందరి కథ (1949), పాతాళ భైరవి (1951), జగదేకవీరుని కథ (1961) వంటి జానపదాలు, పెద్దమనుషులు (1954), దొంగ రాముడు (1955) వంటి సాంఘిక చిత్రాలు, భక్త పోతన (1943), యోగివేమన (1947) వంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు ఉన్నాయి. కె.వి.రెడ్డి సినిమాలు భారీ విజయాలు సాధించి, నిర్మాణ సంస్థలకు విపరీతమైన లాభాలు, ఎంతో పేరు తెచ్చిపెట్టేవి. దీనితో 1950ల్లో మొదలై 60ల తొలినాళ్ళ వరకూ అతనితో సినిమాలు తీయడానికి పోటీపడే పరిస్థితి ఉండేది. 60వ దశకం మలి భాగంలో కె.వి.రెడ్డి తీసిన సత్య హరిశ్చంద్ర (1964), ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968), భాగ్యచక్రం (1968) సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో అతనితో సినిమా చేయడానికి ఎవరూ ముందుకురాని స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో కె.వి.ని గురువుగా భావించే ఎన్.టి.రామారావు అతనిపై గౌరవాభిమానాల వల్ల తన స్వంత సంస్థ అయిన ఎన్.ఏ.టి. ద్వారా శ్రీకృష్ణసత్య (1971) సినిమా తీయించారు. పరాజయాల వల్ల సినిమా తీసే అవకాశం లేని దుస్థితిలో కెరీర్ ముగించాల్సి వస్తుందన్న భయాందోళనల నుంచి విడిపిస్తూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. మంచి సినిమా తీసిన సంతృప్తితో 1972లో కె.వి.రెడ్డి మరణించారు.  

కె.వి.రెడ్డికి దర్శకత్వంలో ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. ఒక సినిమా చేసేప్పుడు పూర్తి శ్రద్ధ దాని మీదే పెట్టేవారు.   చాలా కసరత్తు చేసి స్క్రిప్టు పూర్తిచేయడం, ఒక్కసారి బౌండ్ స్క్రిప్టు పూర్తయ్యాకా ఇక దానిలో చిత్రీకరణ దశలో ఏమాత్రం మార్పుచేయకపోవడం అతని పద్ధతి. ఆ స్క్రిప్టు కూడా కె.వి. స్క్రిప్టు చేతిలో ఉంటే ఎవరైనా దర్శకత్వం చేయవచ్చు అనే స్థాయిలో ఉండేది. ఎన్ని అడుగుల ఫిల్మ్ తీయాలనుకుంటే అన్నే అడుగులు తీయగలగడం అతని ప్రత్యేకతల్లో ఒకటి. ముందు రిహార్సల్స్ చేయించి, సంతృప్తిగా వచ్చాకే షూటింగ్ చేసేవారు.   దుక్కిపాటి మధుసూదనరావు, ఎన్.టి.రామారావులు తమకు కె.వి.రెడ్డి గురుతుల్యుడని చెప్పుకునేవారు. అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించాకా తొలి చిత్రం కె.వి.రెడ్డితో తీసి, అతని పద్ధతులు నేర్చుకుని, తమ సంస్థను ఆ ప్రకారం నడుపుదామన్న ఉద్దేశంతో రెండేళ్ళు వేచి చూసి మరీ సినిమా తీశారు. ఎన్.టి.రామారావు తాను దర్శకత్వం వహించడం మొదలుపెట్టాకా కె.వి.రెడ్డిని చూసి నేర్చుకున్న పద్ధతులను సాధ్యమైనంత అనుసరించేవారు.   కె.వి.రెడ్డి తీసిన భక్త పోతన సినిమా విజయం వల్ల వాహినీ ప్రొడక్షన్స్ (అంతకుముందున్న వాహినీ పిక్చర్స్ పంపిణీ సంస్థగా మిగిలిపోయింది) ఏర్పడగా, పాతాళ భైరవి సాధించిన ఆర్థిక విజయం విజయా సంస్థ స్థిరపడడానికి సహకరించింది. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, అల్లు రామలింగయ్య వంటి నటులు, పింగళి నాగేంద్రరావు, డి.వి.నరసరాజు, కొసరాజు రాఘవయ్య చౌదరి వంటి కవి రచయితల సినిమా కెరీర్లు స్థిరపడడానికి కె.వి.రెడ్డి సినిమాల ప్రభావం చాలా ఉంది. ప్రత్యేకించి అప్పటివరకూ కృష్ణుడి పాత్రలో పెద్దగా విజయం సాధించని ఎన్.టి.రామారావును కృష్ణుడిగా నిలబెట్టి, అతని పౌరాణిక చిత్రాల కెరీర్ కు పునాదులు వేసింది కె.వి.రెడ్డే. అతని సినిమాల్లో పెద్దమనుషులు, పెళ్లినాటి ప్రమాణాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతి సంపాదించుకోగా 2013లో సిఎన్ఎన్-న్యూస్ 18 నిర్వహించిన పోటీల్లో భారతీయ ప్రేక్షకులు ఇప్పటి వరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో అత్యుత్తమంగా మాయాబజార్ ఎంచుకున్నారు.

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో తేళ్ళమిట్ట పల్లెలో 1912 జూలై 1న కె.వి.రెడ్డి జన్మించారు.  అతని పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. తల్లిదండ్రులు వెంకట రంగమ్మ, కొండారెడ్డి. చిన్నతనంలోనే అతని తండ్రి మరణించారు.  దాంతో తల్లితో పాటు తాడిపత్రిలోని అమ్మమ్మ గారి ఇంటికి వచ్చేశారు.  అకాలంలో వైధవ్యం మీద పడ్డ అతని తల్లి, జీవితం మీద  వైరాగ్య భావంతో గడుపుతూ ఉండడంతో చిన్ననాట కె.వి.రెడ్డి అల్లరికి పట్టపగ్గాలు ఉండేవి కాదు.

తాడిపత్రిలో అతని బాల్యమంతా అల్లరి, ఆటపాటల్లో సంతోషంగా గడిచింది. చెరువుల్లో ఈతలు, కొండలు గుట్టలు ఎక్కడాలు, చేపలు పట్టడాలు, చెట్లూ పుట్టల వెంబడి తిరగడాలు, మహిమలు చేసే శక్తులు సంపాదించేందుకు శ్మశానాల్లో ఎముకలు సేకరించడం వంటి సాహసాలు, అల్లరులు చేసేవారు.  ఒకసారి అడవుల్లో తిరుగుతూ కె.వి.రెడ్డి, అతని మిత్రులు ఎలుగుబంటి కనిపిస్తే దాని మీద రాళ్ళు వేసి దాన్ని రెచ్చగొట్టారు. అది కోపంతో వెంబడిస్తే అందరూ పారిపోయారు. పారిపోతున్న పిల్లలని వదిలి ఎలుగుబంటి వెనక్కి వచ్చి చూస్తే కె.వి.రెడ్డి మాత్రం భయం వల్ల దారితోచక అక్కడే ఉండిపోయారు. భయంతో వణుకుతున్న కె.వి.రెడ్డిని చూసి అది జాలిపడి విడిచిపెట్టేస్తే అతని ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటన తర్వాతికాలంలో గుర్తుచేసుకున్న కె.వి.రెడ్డి "జంతువులకు కూడా జాలి, దయ వంటి సుగుణాలు ఉంటాయని ఆ సంఘటన వల్లే తెలిసిందని" చెప్పారు. గుణసుందరి కథ సినిమాలో ఎలుగుబంటి పాత్ర రూపకల్పన వెనుక చిన్నతనంలో అతను చూసిన జాలిగుండె గల ఎలుగుబంటి స్మృతి ఉంది.

ఆటపాటలలో మునిగితేలుతున్నా కె.వి.రెడ్డి తొలినుంచి బాగా చదివేవారు. చదువుతో పాటుగా ఫుట్ బాల్, హాకీలాంటి ఆటల్లోనూ ముందుండేవారు. ఈ పాఠశాల దశలోనే మూలా నారాయణస్వామితో స్నేహం ఉండేది. కె.వి. స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక మేనమామలు, ఇతర కుటుంబ పెద్దలు సమీపంలోని అనంతపురం కళాశాలలో కాక ప్రతిష్టాత్మకమైన మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల లోనే చదివించాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. మద్రాసులో విక్టోరియా హాస్టల్లో ఉంటూ,  ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకునేవారు. పల్లెటూళ్ళలో చెరువుల్లో మునుగుతూ, కొండలెక్కుతూ ఉత్సాహభరితంగా గడిపిన కె.వి.రెడ్డికి హఠాత్తుగా మద్రాసు నగర జీవితం చాలా ఒంటరిగా, విసుగ్గా తోచింది. దాంతో నగర జీవితంలో ప్రాచుర్యం పొందుతున్న సినిమా థియేటర్ల మీద అతని దృష్టి పడింది. కాలక్షేపం కోసం సినిమాలు చూడడం మొదలుపెట్టి ఆదివారాల్లో మూడు ఆటలూ చూడసాగారు. అలా డిగ్రీ పూర్తిచేశారు. దర్శకుడు పి. పుల్లయ్య గ్రాడ్యుయేషన్లో కె.వి.రెడ్డికి సీనియర్. కె.వి. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేనాటికే పుల్లయ్య సినిమాల్లోకి ప్రవేశించి హరిశ్చంద్ర సినిమాకు దర్శకత్వం వహించారు. కాలక్షేపం కాక సినిమాలు చూసినా చాలా శ్రద్ధతో సినిమాల్లోని అంశాలు పరిశీలించే అలవాటు కె.వి.రెడ్డికి ఉండడంతో పి.పుల్లయ్య అతనితో సినిమాలకు పనికివచ్చే కథల గురించి చర్చలు చేస్తూండేవారు. పుల్లయ్య, కె.వి.రెడ్డి స్టార్ కంబైన్స్ లాడ్జిలో కలిసి రాత్రి తెల్లవార్లూ సినిమా కథల గురించి చర్చించేవారు.

చదువు పూర్తికాగానే కె.వి.రెడ్డి ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. డిగ్రీ ఆనర్స్ పాసైన కె.వి. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రయత్నించినా కనీసం ఆరు నెలల విద్యాబోధన అనుభవం లేదన్న కారణంతో తిరస్కరించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో వైఫల్యంతో విసిగి వేసారిన కె.వి.రెడ్డి, ఎ.ఎ.వి.కృష్ణారావు అన్న స్నేహితునితో కలిసి "ది స్టాండర్డ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ" ని స్థాపించారు. 250 రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ పాఠశాలలు, కళాశాలల్లో ప్రయోగశాలలకు ఉపకరించే శాస్త్రోపకరణాలను తయారుచేసేది. 1936-37 మధ్యకాలంలో ఏడాది పాటు చేసిన ఈ వ్యాపారం లాభాలను సంపాదించి పెట్టింది.

కె.వి.రెడ్డి భార్య శేషమ్మ. ఆ దంపతులది చాలా అన్యోన్యమైన దాంపత్యం. పున్నమి దగ్గర పడే కొద్దీ రాత్రిళ్ళు డాబా మీదికి భార్యని తీసుకువెళ్ళి వెన్నెల్లో గడపడం కె.వి.కి సరదా. అలానే ఉదయాన్నే భార్య తల దువ్వనిదే బయటకు అడుగు పెట్టేవారు కాదు. అవుట్ డోర్ షూటింగులు లేక చెన్నైలోనే ఉన్నప్పుడు నిత్యం తన భార్య చేతి వంటే తినేవారు. వయసు పెరిగే కొద్దీ బలపడిపోయిన ఆ అనుబంధం చివరికి భార్యకు క్యాన్సర్ అనీ, తగ్గడం కష్టమనీ తెలిసిన తర్వాత తాను రోజూ వేసుకోవాల్సిన రక్తపోటు, మధుమేహం మందులు వేసుకోవడం మానేసే వరకూ వెళ్ళిపోయింది.

కె.వి.రెడ్డి-శేషమ్మ దంపతులకు తొమ్మిది మంది సంతానం. తన పిల్లలు సాంకేతిక నిపుణులుగానో, వైద్యులుగానో స్థిరపడాలని ఆశించాడే తప్ప, వారు సినిమా రంగంలోకి రావాలని కోరుకోలేదు. ఆ ప్రకారమే కొడుకులు సినిమా రంగానికి బయటే వేర్వేరు రంగాల్లో పనిచేశారు. అల్లుళ్ళను కూడా సినిమా రంగం నుంచి తెచ్చుకోలేదు. పిల్లలను క్రమశిక్షణతో పెంచారు. సినిమా రూపకల్పనలో హడావుడి ఉన్నా ఉదయం, మధ్యాహ్నం పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించి, వారిని తానే చదివించేవారు.

శాస్త్రోపకరణాల తయారీ వ్యాపారంగా చేస్తున్న కె.వి.రెడ్డిని అతని బాల్య స్నేహితుడు మూలా నారాయణస్వామి తాను భాగస్వామిగా ఓ సినిమా నిర్మాణమవుతోందని ఆసక్తి ఉంటే నిర్మాణ శాఖలో పనిచేయవచ్చని ఆహ్వానించారు. కె.వి.రెడ్డి అలా వచ్చి రోహిణీ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న గృహలక్ష్మి సినిమాకి క్యాషియర్ ఉద్యోగం చేశారు. 1938లో గృహలక్ష్మి సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అయినా సినిమా నిర్మాణంలో విలువల విషయమై హెచ్.ఎం.రెడ్డి ధోరణి బి.ఎన్.రెడ్డికి నచ్చకపోవడంతో బి.ఎన్.రెడ్డి, మూలా నారాయణస్వామి రోహిణీ పిక్చర్స్ నుంచి విడిపోయి, తమ వాటా సొమ్ముతో బయటకు వచ్చేశారు. మూలా నారాయణస్వామి, బి.ఎన్.రెడ్డి స్వంతంగా వాహినీ పిక్చర్స్ సంస్థ ప్రారంభించారు. వాహినికి మూలా నారాయణస్వామి ఛైర్మన్, బి. ఎన్. రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్. కె.వి.రెడ్డి కూడా వీరితో వచ్చి వాహినీ సంస్థలో చేరారు.  వాహినీ వారు తీసిన వందేమాతరం (1939), సుమంగళి (1940), దేవత (1941) సినిమాలకు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశారు. క్యాషియర్‌గా గృహలక్ష్మికి పనిచేసిన నాటి నుంచీ ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్నా సినిమా నిర్మాణంలో ఇతర అంశాల పట్ల కూడా అవగాహన పెంచుకున్నారు

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)