యాధృచ్ఛికం ..... !

Telugu Lo Computer
0


ఇరవై సంవత్సరాల క్రితం వీసా కోసం చెన్నై వెళితే ఆ వీసమ్మకు నా ముఖారవిందం నచ్చలేదేమో ఇవ్వను పొమ్మంది. ఆ తరువాత మళ్ళీ అప్లై చేసుకుంటే ఈ సారి వీసయ్యకు నా ముఖారవిందం నచ్చిందేమో ఏ ప్రశ్నా అడగకుండానే యు కెన్ గో అని పర్మిషన్ ఇచ్చేసాడు. అప్పటికి డాక్టర్ ఇచ్చిన డేట్ రెండురోజులే ఉంది. అమ్మాయి డెలివరీ టైం కు అందగలుగాతానో లేనో, మొదటి సారి ఒక్కదాన్ని అంత దూరం ప్రయాణం భయంతో, టెన్షన్ తో  ఫిబ్రవరి మూడో తారీఖున  మొత్తానికి అట్లాంటాకు వచ్చేసాను. 

అమ్మాయి ని కుశలం అడిగాక, అమ్మాయో, అబ్బాయో చెప్పారా అని అడిగాను కొద్దిగా కుతూహలం తో. లేదమ్మా ఆ సస్పెన్స్ ఉండనీద్దామనుకున్నాము అంటూనే అబ్బా అని మూలిగింది. వెంటనే సెల్ అందుకొని మాట్లాడటం మొదలు పెట్టింది. నొప్పులు వస్తుంటే హాస్పిటల్ కు వెళ్ళకుండా  ఎవరితో మాట్లాడుతోంది? ఏమి జరుగుతోంది? అయోమయంలో ఉండగానే ఓ పూట గడిచి హాస్పిటల్ కు వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఇంకా అయోమయం! నన్ను ఉండమంటారేమిటీ డెలివరీ రూంలో? నేనూ మా అల్లుడూ ఉండాలట. ఇదేమన్నా కామెడీ సినిమానా చూస్తూ ఉండటానికి? అసలుకే హాస్పిటల్సూ, రక్తమూ అంటేనే భయం. పైగా ఏవేవో వైర్లు తగిలించారు. ఇది ఫీటస్ గుండె కొట్టుకోవటం అంటారు. ఇంకోటి నొప్పులు తెలీకుండా ఏదో ఇంజెక్షన్ అట. ఇంకేదో ఏవో. ఇవన్నీ కాకుండా అల్లుడుగారు కొత్త. ఇప్పటి వరకు హలో బాగున్నారా? మేము బాగున్నాము తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. ఆ వాతవరణమూ, మొన్న సాయకాలం వచ్చినప్పుడు ఏమితిన్నానో, నిన్న హాస్పిటల్ కు వచ్చే ముందు తినమన్నా నా మొహం ఏమి తింటాను ఏమీ తినలేదు. పైగా జట్ లాగో ఫట్ లాగో అదిట! నీరసం కళ్ళు తిరిగిపోతున్నాయి. నేను మా అమ్మాయి చేయి పట్టుకున్నానో, తను నా చేయి పట్టుకుందో తెలియదు! ఆ అయోమయం లోనే ఆ పూటా గడిచిపోయింది. ఏమనుకుందో మా అమ్మాయి ఏదో ఫోన్ చేసింది. కాసేపటికి తన ఫ్రెండ్ శాంతి వచ్చింది. శాంతి మా అమ్మాయికి ఇంటర్ నుంచే ఫ్రెండ్. నాకూ బాగా తెలుసు. తనను చూడగానే ప్రాణం లేచొచ్చింది."నువ్వెక్కడ నుంచి వచ్చావు?" అడిగాను.

"నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను ఆంటీ. నేను ముందే చెప్పమన్నాను సంజుకు వస్తానని. చెప్పలేదు. ఇదో ఇప్పుడు చెప్పింది. మీరు ఇలా రండి.”  అని నన్ను లాంజ్ లోకి తీసుకెళ్ళి, ఓ సోఫాలో కూర్చోబెట్టింది. ఓ బాగ్ లో నుంచి, టిఫిన్ బాక్స్ తీసి, అందులోని వేడివేడి వెజిటబుల్ ఉప్మా ఇచ్చి, "ఇది తిని, ఈ ఫ్లాష్క్ లో కాఫీ ఉంది తాగండి. రెస్ట్ తీసుకోండి. నేనుంటాను సంజు దగ్గర" అంది.

అమ్మయ్య అనుకొని హాపీగా ఉప్మా తిని, కాఫీ తాగి, వెనక్కి వాలాను.

ఏదో గోడలా ఉంది. దానికి మెట్లు. ఆ మెట్లెక్కి లోపలికి వెళ్ళాను. అది చిన్న గుడి. ఎదురుగా ఎర్రటి, జరీ అంచు చీర, పసుపచ్చ జాకిట్ వేసుకొని, చేతుల నిండుగా ఎరుపు, ఆకుపచ్చ గాజులతో, మొహాన పసుపు, నుదుటన ఎర్రటి కుంకుమ బొట్టుతో, నవ్వుతూ అమ్మవారి విగ్రహం. అప్రయత్నంగా చేతులు జోడించి, కనులారా వీక్షిస్తూ, "నమస్తే మహామాయే, సురపూజితే" అని అమ్మవారిని స్తుతించి, బయటకు నడవబోయాను. 

అప్పుడు అక్కడున్న పూజారి చేతిలో ఒక చీర, దాని మీద ఒక కాగితం ముక్కలో కుంకుమ, పక్కన కొన్ని పచ్చటి అక్షితలు పట్టుకొని, "అమ్మా ఇవి తీసుకోండి" అని పిలిచాడు.

"నేను అమ్మవారికి చీర ఇవ్వలేదండి" అని కుంకుమ మాత్రం తీసుకోబోయాను.

"పరవాలేదు. తీసుకోమ్మా. ఇది అమ్మవారి ప్రసాదం"అన్నారు ఆయన.

భక్తిగా రెండుచేతులతో తీసుకొని, కళ్ళకద్దుకుని బయట వరండాలోకి వచ్చి, కుంకుమ పెట్టుకొని, అక్షితలు కాసిని తలపై వేసుకొని, చీర తీసి చూసాను. మంచి మస్టర్డ్ యెల్లో కు, ఎరుపు బార్డర్, ఎరుపు కొంగు ఉన్న మధురై కాటన్ చీర. దానిని అలా చూస్తుండగానే శాంతి వచ్చి " ఆంటీ పాప పుట్టింది" అని చెప్పింది.  ముద్దులొలికే మురిపాల మనవరాలు అలసట, టెన్షన్ అంతా మటుమాయం! 

ఇక ఇప్పుడు అట్లాంటా నుంచి హైదరబాద్ కు పదండి. కాలం; ఆగస్ట్;

అనుకోకుండా అబ్బాయి పెళ్ళి కుదరటమూ, మనవరాలు వచ్చిన ఆరునెలలకే కోడలు రావటమూ, పిల్లలంతా తిరిగి అట్లాంటా వెళ్ళిపోవటమూ, ఏమండీ ఆయన పనిలో బిజీ కావటమూ, కొత్తగా వచ్చిన వియ్యపురాలుతో గుళ్ళూ, సినిమాలూ, నా పార్లర్ తో నేనూ బిజీ కావటమూ చకచకా జరిగిపోయాయి. 

అదో ఆ రోజులల్లో ఓ రోజు పొద్దునే వియ్యపురాలు ఫోన్ చేసి "మాలా ఈ రోజు నేను కట్ట మైసమ్మ గుడి కెళుతున్నాను. వస్తారా?" అని అడిగింది.

"నేను ఇప్పటి వరకూ ఎప్పుడూ వెళ్ళలేదు ఆ గుడికి. వస్తానండి." అని ఆవిడతో వెళ్ళాను. 

పెద్దగోడ ముందు ఆగింది ఆటో. ఆ గోడను చూస్తూ, అక్కడ మెట్లెక్కుతూ "ఇక్కడికి ఎప్పుడో వచ్చాను. గుర్తు రావటం లేదు" అన్నాను ఆవిడతో.

"ఈ గుడికి ఎప్పుడూ రాలేదన్నారు కదా?" అంది ఆవిడ.

"అవును రాలేదు. కానీ చూసినట్లుగా వచ్చినట్లుగా అనిపిస్తోంది" అంటూ లోపలికి వెళ్ళాను. ఎర్రటి జరీ చీర, పసుపు జాకిట్టూ, మొహాన పసుపూ, నుదుటన కుంకుమ బొట్టూ, చేతులకు ఎరుపు, ఆకుపచ్చ గాజులతో, నన్నెక్కడ చూసావో గుర్తొచ్చిందా అంటూ, ప్రసన్నవదనముతో దర్శనం ఇచ్చింది అమ్మవారు. శరీరములో అణువణువూ పులకించిపోయింది. తెలియని ఉద్వేగంతో, చిన్నగా వణుకుతూ  చేతులు జోడించి స్తుతించి, బయటకు నడవబోయాను.

"అమ్మా ఇవి తీసుకోండి" పూజారిగారు చేతిలో చీర, దాని మీద చిన్నపేపర్ ముక్కలో కుంకుమ, పక్కన పచ్చటి  అక్షింతలు.

అప్రయత్నంగా " నేను అమ్మవారికి చీర తేలేదండి" అంటూ కుంకుమ మాత్ర తీసుకోబోయాను.

"పరవాలేదమ్మా. ఇది అమ్మవారి ప్రసాదం తీసుకో" అన్నారు. రెండు చేతులతో తీసుకొని కళ్ళకద్దుకున్నాను.
బయట వరండా లో కూర్చొని చీర తీసి చూస్తే డార్క్ మస్టర్డ్ పసుపు రంగుకు, ఎరుపు అంచు, ఎరుపు కొంగు ఉన్న మధురై కాటన్ చీర!
అది లోయర్ టాంక్ బండ్ దగ్గర ఉన్న కట్టమైసమ్మ గుడి. అంతకు ముందు అసలు అటువైపు నేనెప్పుడూ వెళ్ళలేదు. ఈ సంఘటన తరువాత చాలా సార్లు వెళ్ళాను. అంతే ఇంక చెప్పేదేమీ లేదు! ఇలా నాకు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. వాటిని భ్రమలనుకోవాలో, ఏమనుకోవాలో నాకైతే తెలిలేదు.
43
41 Comments
Like
Comment

Post a Comment

0Comments

Post a Comment (0)