భూమి - జాతీయకరణ

Telugu Lo Computer
0


భూమి సకల సంపదలకు మూలం , శ్రామికుల భవిష్యత్తు భూ సమస్య పరిష్కారం మీదే ఆధారపడి ఉంది . స్వంత ఆస్తి గురించి పలువురు మేధావులు , తత్వవేత్తలు , రాజకీయార్ధికవేత్తలు చేసిన ప్రతిపాధనలు గురించి నేను ఇక్కడ చర్చించదలుచుకోలేదు . అందరిదీ అయిన భూమిని మోసపూరితంగా కొద్ది మంది బలవంతంగా లాక్కోవడాన్నీ వీరందరూ సహజమైన హక్కు అనే ముసుగులో దాచిపెడుతున్నారనే విషయాన్ని మొట్టమొదట చెప్పదలుచుకున్నాను . కొద్దిమంది అందరికి చెందాల్సిన భూమిని బలవంతంగా లాక్కోవడం సహజమైన హక్కు అయితే , మెజారిటీ ప్రజలు తాము కోల్పోయిన భూమిని తిరిగి సొంతం చేసుకోవడానికి తమ శక్తియుక్తులను కూడగట్టుకోవలసి ఉంది .

చరిత్ర గమనంలో , ఎవరైతే అందరికీ చెందాల్సిన భూముల్నీ క్రూరమైన పద్దతులను ఉపయోగించి బలవంతంగా ఆక్రమించుకున్నారో , వాళ్ళే ఆ భూముల మీద సర్వహక్కులని తాము చేసిన చట్టాలు ద్వారా తమకు తాము కలగచేసుకున్నారు .
యావత్తు మానవజాతి ఆమోదంతోనే ఇదంతా జరిగిందని , స్వంత ఆస్తికి చట్టబద్ధత కల్పించబడిందని తత్వవేత్తలు చెప్పనారంభించచారు . భూమి మీద యాజమాన్య హక్కులనేవి సర్వజనామొదంతో కల్పించబడలేదని , అధిక సంఖ్యాకులైన ప్రజలు ఎప్పుడైతే స్పష్టంగా అర్ధం చేసుకుంటారో , అప్పుడే స్వంతాస్తి భావన లేకుండా పోతుంది .
ఆస్తిహక్కు మీద చర్చని పక్కన పెట్టినట్లైతే , ఆర్ధికాభివ్రుద్ధి , జనాభా పెరుగుదల , పెరుగుతున్న జనసాంధ్రత , పెట్టుబడీదారి ఆర్ధిక వ్యవస్థ లో రైతులు సంఘటితంగా యంత్రపరికరాల సహయం తో శ్రమ చేయవలసి రావటం , సమాజంలో ప్రజలందరి అవసరాలు సంత్రుప్తికరంగా తీర్చగలగరావలసిన అవసరం మొదలగునవి భూమి జాతీయకరణ యొక్క సామాజిక అవసరాన్నీ ప్రాముఖ్యత ను తెలియ చేస్తున్నాయి .దీనికి వ్యతిరేకంగా స్వంతాస్తిని సమర్ధిస్తూ ఏమి చెప్పినప్పటికి పెద్దగా ప్రయోజనం ఉండదు .
వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం అనేది సాగును కొద్దిమంది ఇష్టానుసారంగా వదిలివేయడం ద్వారా జరగదు . పెద్దకమతాల్లో నీటిపారుదల ,మురుగుకాల్వలు , రసాయనిక ఎరువులు వాడకం లాంటి ఆధునిక వ్యవసాయ పద్దతులని అనుసరించి సాగుచేయడం ద్వారాను , శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడం ద్వారాను ఉత్పత్తి ని భారీగా పెంచగలం . చిన్న కమతాలతో పోలిస్తే , పెద్ధకమతాల్లో వ్యవసాయం లాభదాయకం ( రైతు ఆరుగాలం గానుగెద్దుల కష్టపడే ప్రస్తుత పెట్టుబడీదారి విధానంలో కూడా ) ఇది జాతీయ ఉత్పత్తి ని పెంచడానికి ఉత్తేజాన్నిస్తుంది .
నిత్యం పెరిగిపోతున్న ప్రజల అవసరాలు ఒక పక్క , రోజురోజుకు పెరిగిపోతున్న వ్యవసాయోత్పత్తుల ధరలు మరొకపక్క , భూమిని జాతీయం చేయవలసిన సామాజిక అవసరాన్నీ బలపరుస్తున్నాయి . వ్యక్తులు సక్రమంగా సాగు చేయకపోవడం వలన ఉత్పత్తి పడిపోతుంది .జాతీయ ప్రయేజనాల కోసం ప్రభుత్వ నియంత్రణ లో పెద్ద పెద్ద భూకమతాల్లో వ్యవసాయం జరిగితే ఉత్పత్తి పెరుగుతుందే తప్ప తరగదు .
భూమి జాతీయకరణ భూస్వామ్య వ్యవస్థ ఉన్న బ్రిటన్ లో కంటే ఫ్రాన్స్ లో కష్టతరమైనది , ఎందుకంటే భూమి మీద చిన్న రైతులకున్న యాజమాన్య హక్కు మూలంగా భూమి కొనగలిగిన వారు స్వంతదారులు కాగలరు . దీని వల్ల భూమి చిన్న చిన్న కమతాలుగా విభజింపబడి , చిన్న చిన్న పరికరాలను ఉపయోగించి , రైతులు , వారి కుటుంబాల చేత సాగు చేయబడుతుంది . ఈ రకమైన భూయాజమాన్యం చిన్న కమతాల సాగుని అనివార్యం చేసి , మెరుగైన ఆధునిక వ్యవసాయ పద్ధతులను వినియోగించుకోకుండా చేస్తుంది . ఈ విధానం చిన్న రైతుల్ని భూమి జాతీయకరణ కి , సామాజిక అభివృద్ధి కి వ్యతిరేకులుగా మార్చుతుంది . రైతుని తనకున్న చిన్న ముక్క భూమి కి బందీని చేసి , తనకున్న శక్తియుక్తులన్నిటినీ ఖర్చులు , వడ్డీలు , శిస్తులు పోను మిగిలే స్వల్ప ఆదాయం కోసం వినియోగించేల చేస్తుంది .ఇంతే కాకుండా భూమితో తనకున్న బాధవ్యం , స్వంతదారుడననే భావన రైతును సామాజిక ఉధ్యమాలకు దూరం ఉండేలా చేస్తుంది .ఇది ఫ్రాన్స్ లో రైతుని పారిశ్రామిక కార్మికవర్గానికి బద్ద శత్రువుగా మార్చుతుంది . భూమి జాతీయకరణ కి రైతు భూ యాజమాన్యమే పెద్ద అడ్డంకి . అందువల్ల ఫ్రాన్స్ ఇంత పెద్ద సమస్యకు పరిష్కారం చూపలేదు .
దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది .భూమి గ్రామీణ సహకార సంఘాల యాజమాన్యం క్రింద గానీ , యావత్ జాతి యాజమాన్యం క్రింద గానీ ఉండాలి . సామాజిక ఉద్యమాలు భూమి అంతా జాతి సొంతం అనే నిర్ణయానికి ప్రజలు రావటానికి దోహదపడతాయి . భూమి యాజమాన్యాన్నీ గ్రామీణ పేదలచేతిలో వదిలి వేయడంవలన మొత్తం సమాజం ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి దారుల వర్గానికి లోబడిపోతుంది .
భూమి జాతీయకరణ కార్మికులకి , పెట్టుబడికి ఉన్న సంభాదాలను పూర్తిగా మార్చివేస్తుంది . గ్రామీణ , పారిశ్రామిక ఉత్పత్తి లో ఉన్న పెట్టుబడీదారి ఉత్పత్తి సంబందాలను అంతం చేస్తుంది . పెట్టుబడీదారి విధానం మీద ఆధారపడ్డ , వర్గ వ్యత్యాసాలు , వర్గ ఆధిపత్యం మాయమైపోతాయి . ఇతరుల శ్రమ మీద బతకడం జ్ఞాపకం గా మిగిలిపోతుంది . అధికసంఖ్యాకుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం కానీ , రాజ్యశక్తి కానీ ఇక ఏమాత్రం ఉండవు .
వ్యవసాయం , గనులు , వస్తువుల తయారీ , ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రంగాల్లో, అన్ని రకాల ఉత్పత్తి ఒక సక్రమమైన మార్గంలో జరుగుతుంది. ఉత్పత్తి సాధనాలను జాతీయం చేసి , స్వేచ్ఛ , సమానత్వం కలిగిన ఉత్పత్తి సంఘాల ద్వారా , చక్కని , హేతుబద్దమైన , అందరికీ ప్రయోజనకరమైన ప్రణాళిక ద్వారా సమాజాన్నీ నడిపించవచ్చు .

Post a Comment

0Comments

Post a Comment (0)