క్యూబన్‌ శాస్త్రవేత్తల ఘన విజయం !

Telugu Lo Computer
0

 

ఒక వైపు నుంచి కోవిడ్‌-19, మరొక వైపు నుండి అమెరికా క్రూర దిగ్బంధనాం ఈ రెండింటినీ దీటుగా ఎదుర్కుంటూనే 48 గంటల వ్యవధిలో రెండు అద్భుతాలను క్యూబన్‌ సైంటిస్టులు ఆవిష్కరించారు.

మొదటిది సొబెరనా 02. ఫిన్లే ఇన్‌స్టిట్యూట్‌ లోని శాస్త్రవేత్తలు ఇతర పరిశోధనా సంస్థల సహకారం కూడా తీసుకుని ఆవిష్కరించిన వ్యాక్సిన్‌ ఇది. 62 శాతం సామర్ధ్యం దీనికి ఉన్నట్టు ప్రయోగాలలో నిర్ధారించుకున్నాక, ఒక స్వతంత్ర అధ్యయన బృందం దీనిని ధ్రువీకరించింది.

రెండు డోసుల సొబెరన 02 తో బాటు సొబెరన ప్లస్‌ అనే మరో వ్యాక్సిన్‌ ను కూడా కలిపి తీసుకుంటే కొత్తగా తలెత్తుతున్న కరోనా వేరియంట్లను కూడా దీటుగా ఎదుర్కొనవచ్చునని, అందుకు సంబంధించిన ప్రయోగాల ఫలితాలను కూడా త్వరలో వెల్లడిస్తామని ఫిన్లే ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.

రెండవది: అబ్దాలా. దీనిని క్యూబాలోని సెంటర్‌ ఫర్‌ జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ (సిఐజిబి) శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ప్రయోగాలలో దీని సామర్ధ్యం 92.28 శాతంగా ఉన్నట్టు రుజువైందని వారు ప్రకటించారు. ఐకా లాబరేటరీస్‌ దీనిని ఉత్పత్తి చేసి సరఫరా చేస్తుంది. దీనిని మూడు డోసులలో తీసుకోవాలి.

క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్‌ దియాజ్‌ కానెల్‌ బెర్ముడెజ్‌ క్యూబన్‌ శాస్త్రవేత్తలను అభినందించారు. ఆ సందర్భంగా '' మనం సాధించిన మేధో సంపత్తి విలువ అది ఎంతమంది ప్రాణాలను కాపాడిందన్న దానిని బట్టి ఉంటుంది'' అన్న జోస్‌ మార్టి వ్యాఖ్యలను ఉటంకించారు. 

కోవిడ్‌-19 సవాలునే గాక అమెరికా దిగ్బంధనాన్ని కూడా తట్టుకుని ప్రజలకు 48 గంటల వ్యవధిలో రెండు అద్భుతమైన వ్యాక్సిన్‌ లను అందించినందుకు శాస్త్రవేత్తలను కొనియాడారు. '' మనల్ని వెలివేసిన వారికే తిరిగి మనం మరో రెండు రోజుల్లో రెండు వ్యాక్సిన్‌ లను కానుకగా ఇచ్చి ఆ వెలిని ఓడిద్దాం'' అని బెర్ముడెజ్‌ ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)