స్వీయానుభవం

Telugu Lo Computer
1


"అర్జంట్ గా ఆక్సిజన్ తీసుకురా ఆ రూమ్ లో పేషెంట్ కి చాలా ప్రమాదం గా ఉంది "అని అరుస్తూ ఆక్సిజన్ తరలిస్తున్న శబ్దాలు అరుపులు విని నిద్ర లో ఒక్కసారి తుళ్ళిపడ్డాను. అప్పటికే రెండు రోజులు గా కోవిడ్ తీవ్ర రూపం దాల్చడం తో హాస్పిటల్ లో ఉన్న నాకు గుండె చప్పుడు చుట్టూ ఉన్నవారికి ఒక్కసారి వినిపించేంత దడ , ఆ క్షణం బతుకుతానా అన్న భావన కలిగింది.

ఐదు రోజులు హాస్పిటల్ లో వుంటుండగా తమ ప్రాణాలు సహితం పణంగా పెట్టి పగలు రాత్రి పి పి యి కిట్స్ వేసుకుని ,తిండి తిప్పలు మర్చిపోయి సేవలు చేస్తున్న నర్సలు డాక్టర్స్,ఇతర వైద్య బృందం శుభ్రపరిచే వారు నిజంగా దైవ స్వరూపంగా కనిపించారు,అసలు మనిషి బతకాలంటే ప్రాణ వాయువు ఎంత ముఖ్యమో పిసరంత మనోధైర్యం కూడా అంతే అవసరం అని నాకు స్పష్టంగా అర్ధమైన కాలం ఇది.
ఆర్ధికంగా స్థోమత లేకపోయినా తమ వారికి అప్పో సోప్పో చేసి తమ వారిని బతికించుకోడానికి హాస్పిటల్ లో రోగుల అటెండెంట్స్ పడే యాతన ,వాళ్ళ ఆరాటం చూస్తే ఈ తాపత్రయం కోసం అయినా భగవంతుడు వీళ్ళని బతికిస్తాడు అని అనిపించింది.తమ వారికి వచ్చింది ముట్టుకుంటే అంటుకునే ప్రమాదకారి అని తెలిసినా మాస్క్ పెట్టుకుని పక్కనే ఉండి సపర్యలు చేస్తున్న కోవిడ్ పేషెంట్స్ అటెండెంట్స్ ని చూసాక మన ప్రేమ ఎదుటివారికి ఎంత ధైర్యం ఇస్తుందో తెలియజేసిన సమయం అది.
అమ్మో నాకు ఊపిరి ఆడట్లేదు అనే భావన లో కూడా నా కుటుంబం కోసం నన్ను ప్రేమించే వారికోసం నన్ను నేను కాపాడుకోవాలి అనే ధైర్యం కూడగట్టుకోవడం ఎంత అవసరమో నాకు బాగా తెలిసి వచ్చింది గడిచిన 25 రోజుల సమయం,ఇంట్లో నాన్నగారికి పోసిటివ్ వచ్చి అమ్మ ఆయనకి సాయం గా నిలిచే పరిస్థితుల్లో ఇంట్లో 83 ఏళ్ల బామ్మ గారిని చూసే దారి ఎలా అన్న ఆలోచన తో ఉన్నపాటున బయల్దేరి విశాఖపట్నం వచ్చేసా ,వచ్చిన మర్నాడే నాన్నగారిని 5 రోజులు హాస్పిటల్ లో పెట్టి మా నాన్న స్నేహితుల సాయంతో వైద్యం చేయించగలిగాము అని నేను తమ్ముడు కాస్త ధైర్యం కూడదీసుకుంటుంటే ఇంట్లో అమ్మ కి ,తమ్ముడి భార్య కి కూడా లక్షణాలు కనిపించాయి,వారు ముగ్గురిని విడివిడిగా గదుల లో ఉంచి నేను తమ్ముడు వారికి భోజనం మందులు వంటివి చూస్తున్నప్పుడు,"ఇంత మందికి ఒకసారి ఎలా చేస్తారు పాపం అనుకుంది"కాబోలు మా బామ్మ ఏప్రిల్ 26 వ తేదీ పొద్దున్నే "ఇలా నా పక్కనే వుండు అంటూ తెల్లవారి నుండి నా చేయి వదలలేదు ,చివరకు తొమ్మిది గంటల వేళ శివైక్యం చెందారు."
ఎదో మా నాన్న స్నేహితుల సాయం తో మా బామ్మ గారికి తుది వీడ్కోలు పలికి వచ్చాక నాకు తమ్ముడికి లక్షణాలు తారాస్థాయికి చేరు కున్నాయి ఒక వారం పాటు ప్రతి ఆరు గంటలకి తెర్మోమెటర్ 100 డిగ్రీలు పైన తప్ప దిగలేదు, డాక్టర్ చెప్పిన మందులు వేస్తున్న ఈ లక్షణాలు వదలలేదు,ఆరో రోజు సిటీ స్కాన్ తీస్తే ఇన్ఫెక్షన్ ఎక్కువుంది ఇన్ఫెక్షన్ తగ్గించే మార్గంగా అమ్మనాన్న మా వారు,తమ్ముడు అందరూ ఒక నిర్ణయం తీసుకుని అప్పటికప్పుడు హాస్పిటల్ లో చేర్పించి ,హై డోసేజ్ రెమెడిసివేర్ ఇంజక్షన్ ల తో పాటు మిగతా మందులు ఎక్కించి, సమయానికి తిండి తిప్పలు చూసారు, డాక్టర్స్ నర్సులు అందించిన వైద్య సహాయం ,భగవంతుడు దయ వల్ల గండం గడిచింది. మనిషి కి మనిషి ఆసరా ఎంత అవసరమో ,ఈ గంట మనం బ్రతికితే తర్వాత ఏమి చెయ్యాలో ఆలోచించవచ్చు అనే పరిస్థితి దాటి వచ్చిన నాకు అర్ధం అయ్యింది ఏంటంటే
• ప్రకృతి ముందు మన మేధస్సు తెలివి అన్ని అతి చిన్నవి
• .మనకు ఫేస్బుక్ వాట్సాప్ ఫోన్ లో వేలల్లో కాంటాక్ట్స్ వుండొచ్చు,కానీ నీకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు నీకు పక్కన నిలిచిన వాడే నీకు దేవుడు.
• మనిషికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో మనో ధైర్యo కూడా అంతే అవసరం,ఈ మహమ్మారి బారిన పడిన సరి అయిన వైద్య సాయం తో పాటు ధైర్యం కూడా లోపలికి తీసుకుంటే కచ్చితంగా గెలవొచ్చు.
• నా కుటుంబానికి అవసరం గనక నేను వచ్చి నాకు తోచిన సాయం చేసిన సందర్భంలో నేను ఈ మహమ్మారి బారిన పడినప్పుడు వెనకాల చాలా మాటలు విన్నాను ఎవరు రామన్నారు,జాగ్రత్త చూస్కోవద్దా అని కానీ నా వరకు నా కుటుంబానికి నా అవసరం వున్నప్పుడు వెనక్కి తగ్గే ఆలోచన రాలేదు.
• మనకి మనోధైర్యం సన్నగిల్లే సమయం లో మనకోసం ఇందరు వున్నారు అని ఒక్కసారి గుర్తు చేసుకుంటే అది మన పాలిట సంజీవని అవుతుంది అనేది నేను ఈ కొద్దీ కాలం లో నేర్చుకున్న సత్యం.
ప్రస్తుతం ఉన్న కరోనా నేపధ్యం లో మనిషి కి మనిషి మానసికంగా సాయం అనేది ఎంతో అవసరం, ఎదుటి వ్యక్తి కి నేను వున్నాను అని తెలియజేసే అతి చిన్న విషయం ఆఖరికి ఒక పూట భోజనం పెట్టడమో, ఒక మందు ని మందుల షాప్ నుండి తెచ్చి వాకిట్లో ఇవ్వడమే,అవసరం అనుకున్నప్పుడు తెలిసి ఉన్న వైద్యుల సలహా ఇప్పించడం వంటివి ,ఇంట్లో ఒక గ్లాస్ కాఫియో కషాయమో చేసి ఆ రోగం బారిన పడ్డ కుటుంబానికి అందించడమో మనకే తెలియకుండా ఎదుటి వ్యక్తి కి కొండంత బలం ఇచ్చినవారం అవుతాము.
మనిషికి మనిషి కోట్లు సర్దక్కర్లేదు ,మాట సాయం, చిన్న చిన్న సహకారము అందించ గలిగితే అదే కోట్ల కన్నా విలువైనది.
-అశ్విని

Post a Comment

1Comments

  1. మీ స్వీయానుభవం నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.

    ReplyDelete
Post a Comment