ఇసుకతో చేసిన శివలింగం

Telugu Lo Computer
0



*కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి దక్షిణంగా పవిత్ర పెన్నానది ఒడ్డున ముక్తి రామేశ్వర క్షేత్రం ఉంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతోంది. అందుచేత ఇది రామేశ్వరం అయింది. కోరిన భక్తులకు ముక్తినిస్తుంది కాబట్టి ముక్తి రామేశ్వరం అయిందని ఒక అభిప్రాయం.

ఈ ముక్తి రామేశ్వరానికి సంబంధించిన స్థలపురాణం ఇలా ఉంది.
‘యుద్ధంలో రాముడు రావణుని చంపాడు. రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం రాముణ్ణి పిల్లి రూపంలో వెంటాడింది. దండకారణ్యంలో శివున్ని ప్రతిష్టించాలనుకొన్నాడు. ముహూర్తం నిర్ణయించాడు. శివలింగం కోసం హనుమంతుని కాశికి పంపాడు. హనుమంతుడు సమయానికి రాలేదు. శ్రీరాముడు ఇసుకతో లింగాన్నిచేసి ప్రతిష్టించాడు. ఆలస్యంగా వచ్చిన ఆంజనేయుడు విచారంలో పడ్డాడు. హనుమంతుని మనశ్శాంతి కోసం ఆయన తెచ్చిన లింగాన్ని రాముడు కొంతదూరంలో ప్రతిష్టించాడు. మొదట పూజ హనుమంతుడు కాశీ నుండి తెచ్చిన లింగానికి, తరువాతి పూజ ట్టన ఇసుక లింగానికీ జరుగునట్లు రాముడు అనుగ్రహించాడు’.
ఈ ప్రతిష్టలు అయిన తరువాత పిల్లి నదిఒడ్డు దాకా నడిచి అదృశ్యమయింది. పిల్లి పాదాల గుర్తు ఉందంటారు. పిల్లి నదిలోదిగిన చోటున 'పిల్లి గుండం” అంటారు.
రామేశ్వరంలో శివలింగం నేలమట్టానికి అయిదారు అంగుళాల ఎత్తుఉంటుంది. లింగంపై అదిమి పట్టిన వేలి ముద్రలు కనిపిస్తాయి.
రామలింగేశ్వర స్వామికి ప్రక్కగా రాజరాజేశ్వరి, శ్రీ చక్రం ప్రతిష్టించారు. ఆలయప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు.
రాజ గోపురాన్ని, ప్రాకారాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించినట్లు శాసనాలున్నాయి. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి పది రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి .
కార్తీక సోమవారాల్లో భక్తులు విశేషంగా రామలింగేశ్వరుని దర్శించి పూజిస్తారు. రామలింగేశ్వర ఆలయానికి వెనుక యోగిమునెయ్య ఆలయం, అందులో సమాధి ఉంది. ప్రతి ఏటా మునెయ్య తిరుణాల ఘనంగా జరుగుతుంది. ఇక్కడ భావనారుషి ఆలయం కూడా ఉంది.
రామేశ్వరం ఆలయం బయట సప్తమాతృకల శిల్పాలతో కూడిన అరుదైన శిలాఫలకం ఉంది. ఈ సప్తమాతృకలనే అక్కదేవతలని వాడుక భాషలో పిలుస్తారు. అలాగే గుడిబయట, గుడి ప్రాంగణంలో అనేక శాసనాలున్నాయి.
* శాసనం: శ్రీ కృష్ణదేవరాయల కాలంలో మంత్రి తిమ్మరుసు సోదరుడు సాళువ గోవిందయ్య దేవాలయ అంగరంగ వైభవాలకు, నైవేద్యానికి దానం ఇవ్వడంతోపాటు, అలయప్రకారాన్నీ, మంటపాన్నీ నిర్మిస్తూ క్రీ.శ. 1508 లో వేయించిన శాసనం.
-తవ్వా ఓబుల్ రెడ్డి

Post a Comment

0Comments

Post a Comment (0)