ఆయన మనతోటే ఉన్నాడు !

Telugu Lo Computer
0

 


నాన్నా నన్ను ఒక్కడినే పంపు నేనేమైనా చిన్నపిల్లాడినా !! కొడుకు గట్టిగా అడిగితే కాదనలేకపోయాడు సత్యమూర్తి !

.

కొడుకుచిన్న పిల్లవాడుగా ఉన్నప్పటినుంచీ వాడిని వెంటపెట్టుకొని ఎక్కడో ఢిల్లీ నుండి నెల్లూరుదాకా ప్రతి వేసవిసెలవులలో తన తల్లితండ్రులను చూడటానికి వచ్చేవాడు సత్యమూర్తి !

.

గత పదిహేడేళ్ళుగా ఇదే ఆనవాయితీ ! నడుస్తున్నది !

.

ఈసారి తానొక్కడే ముందువెళతాను అని పట్టుబట్టాడు కొడుకు !

.

ఒక్కగానొక్కకొడుకు ఎప్పుడూ ఒంటరిగా పంపలేదు ,కానీ వాడి పట్టుదల చూసిన తరువాత పంపక తప్పలేదు !

.

రిజర్వేషన్ చేయించాడు ! ప్రయాణం రోజు రానే వచ్చింది !

.

భార్యాభర్తలిద్దరు కొడుకును రైలెక్కించడానికి వచ్చారు !

.

జాగ్రత్త జాగ్రత్త చెపుతుంటే అబ్బ నాకు తెలుసులే నాన్నా అని కొడుకు విసుక్కుంటున్నా లెక్కపెట్టక రైలుకదలడానికి ఇంకొక నిముషమున్నదనగా బోగీలో కొడుకు ఉన్న బెర్తు దగ్గరికి వచ్చి ,నాన్నా ! ప్రయాణంలో ప్రమాదమనిపించి నీకు భయమేసినప్పుడు చీటీ విప్పి చూడు నీకు సహాయం దొరుకుతుంది! అని చెప్పి చీటీ జేబులో పెట్టి చకచక వెళ్ళిపోయాడు సత్యమూర్తి !

.

రైలు బయలుదేరి వేగమందుకుంది ! ఒక్కడే ప్రయాణం చేస్తున్నాడు

"s/o సత్యమూర్తి "మంచి థ్రిల్లింగ్ గా ఉన్నది !

.

ఆగినప్పుడు ఎక్కి దిగే వాళ్ళు బెర్తులమీద నడుం వాల్చే వాళ్ళు ,చంటిపిల్లలతల్లులు పిల్లల అరుపులు కేకలు !

.

ఓహ్ ఒకటేమిటి అన్నీ వింతగా ఉన్నాయి !

.

భోజన సమయమయ్యింది AC కంపార్ట్మెంట్ గావటం మూలాన ఎక్కడినుండో మంచి మాగాయపచ్చడి వాసన ఘుమఘుమలాడుతూ వస్తున్నది !అందరూ ప్యాకెట్లు విప్పారు అందరి వంటకాల వాసన కలగలసి అదో గమ్మత్తైన వాతావరణం నెలకొంది బోగీలో ! అమ్మ ఇచ్చిన ప్యాకెట్ విప్పి హాయిగా తినేశాడు !

.

భోజనం చేసి కొందరు పేకాటరాయుళ్ళు ఆట మొదలు పెట్టారు ! జోరుగా సాగుతున్నది కబుర్లు కులాసాగా మొదలయి ఒకళ్ళమీద ఒకరు జోకులు వేసుకుంటున్నారు ....

.

ఏమైందో ఏమో నెమ్మదిగా గొడవ మొదలయ్యింది అలాఅలా ఒక్కసారే వాతావరణం వేడెక్కి ఒకరినొకరు తన్నుకోవడం మొదలుపెట్టారు !

.

బోగీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది

చైనులాగి మరీ ఒకరినొకరు తోసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు కొందరువచ్చి

"s/o సత్యమూర్తి "మీద పడ్డారు ఒక్కసారిగా భయమేసింది ! ఇతగాడికి వణికిపోయాడు ! ఏం చేయాలో తోచలేదు !

.

ఇంతలో తండ్రి ఇచ్చిన కాగితం గుర్తుకు వచ్చింది గబగబ విప్పి చూశాడు !

.

నాన్నా! ....

అమ్మా ,నేను A2 లో 6,7 బెర్తులలో ఉన్నాము మా దగ్గరకు రా ! ....అని ఉన్నది ! అంతే ఒక్క గంతులో A1 నుండి A2 కి వెళ్ళిపోయాడు s/oసత్యమూర్తి !

.

మనలను భూలోక ప్రయాణానికి పంపిన భగవంతుడు ఒంటరిగా పంపాడా ? లేదు ! ఆయన మనతోటే ఉన్నాడు !

.

ఆయనను తలచుకోండి ! భక్తసులభుడు ఇట్టే ప్రత్యక్షమవుతాడు మన కనులముందు ! భయమూ మనలను ఏమీ చేయలేదు !

.

ఆయన మనతోటే ఉన్నాడు !

.

(ఒక ఆంగ్ల కధకు స్వేచ్ఛానువాదం )

వూటుకూరు జానకిరామారావు


Post a Comment

0Comments

Post a Comment (0)