గుర్తుకొస్తున్నాయ్ !....... - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 23 May 2021

గుర్తుకొస్తున్నాయ్ !.......  "అబ్బబ్బా!!  కరోనా కాదుగానీ ఖైదీ జీవితం అయిపోయింది. ఫ్రస్టేషన్లో పోట్లాటలు వచ్చేస్తున్నాయి"  విసుగ్గా అన్నాను. 

       వెంటనే అందుకుంది పంకజం ..." ఆయనతోనా ?..అత్తగారితోనా? చెప్పు వెంటనే గృహహింస కేసు పెట్టేద్దాం అంది విపరీతంగా ఉత్సాహపడిపోతూ .." .

     "అంతసీను లేదుగానీ, వచ్చిన పోట్లాటల్లా ఫ్రెండ్స్ తోనే"  అన్నాను. "ఎవరూ వెనకింటి పార్వతా? ఎదురింటి రాజ్యమా? పైనుండే కుమారి తోనా ఎవరితో ...ఓ పట్టు పట్టేద్దాం చెప్పూ"  అంది. 

   " అబ్బే ..వాళ్ళుకాదు. సాయంత్రం కొందరం షటిలు ఆడుకుంటాం కదా! "నా మాట పూర్తి కాకుండానే "అవునూ అయితే.... మీ పిల్లబాచ్ తో గొడవ పడ్డావా! ఏం చిన్నపిల్లవా నువ్వూ! వాళ్ళతో గొడవేంటీ"  అన్నది ముక్కున వేలు వేసుకోకుండా జాగ్రత్తపడుతూ పంకజం. 

      " గొడవ కాకపోతే ... వీధి వీధంతా ఖాళీ లేకపోతే ఏం చెయ్యాలి. ఇళ్ళలో ఉండలేక సాయంత్రానికి ఆటలకి పిల్లలూ, చల్ల గాలికి బెంచీల మీదికి మగవాళ్ళూ, మాలాంటి  బాచ్ వాళ్ళేకాక ఇప్పుడు పిల్లలు కొత్తగా  ఏడు పెంకులాట మొదలెట్టేరు. ఉన్న ఒక్కరోడ్డునీ పంచుకోలేక పోట్లాటలు"  అన్నాను. 

      పంకజం చీరకొంగు అడ్డంపెట్టుకుని కిసకిసుక్కుమ నవ్వి "ఇలా  చెప్పటానికి  నీకు సిగ్గుగా లేదూ, ఇద్దరుమనవరాళ్ళున్న అమ్మమ్మవి పిల్లల దగ్గర జాగా కోసం పోట్లాడుతున్నావా" అంది. 

    నేనూ నవ్వేసి " మనం దాటేసిన బాల్యాన్ని వాళ్ళదగ్గర వెదుక్కోడానికే ఈ స్నేహం. కాసేపు షటిల్ ఆడితే శరీరానికి ఆరోగ్యం. అలాగే పిల్లలతో గడిపితే మనసుకూ ఆరోగ్యం"  అన్నాను. 

    పంకజం కూడా నవ్వేసి " నీకు బాల్యమంటే అంతిష్టమా ..." అంది. "బాల్యం ఇష్టం లేనిదెవరికి? చదువులూ ... ఆటపాటలూ ... అల్లరి పనులూ అమ్మ చేతి  దెబ్బలూ.... అమ్మమ్మ గోరుముద్దలూ ...."

మధ్యలోనే అడ్డుకుంది పంకజం. " అమ్మచేత దెబ్బలు బానేతిన్నట్టున్నావు. బాగాగుర్తు పెట్టు కున్నావు" అంది  ఎగతాళిగా. 

      "ఆరోజుల్లో అమ్మచేతో, నాన్నచేతో,గురువు చేతో దెబ్బలు తినని వాళ్ళు అసలు ఉండరు తెలుసా? ...అసలు మా అమ్మ కొడితే ...." ఫ్లాష్ బ్యాక్  లోకి వెళ్ళిపోయాను. 

     " మా బాలయ్యనగర్ లో పిల్లలందరికీ ఉమ్మడి ఆస్తి బాలయ్య బావి పక్కనే ఉన్న పెద్ద ప్లే గ్రౌండు. అక్కడున్న పాతిక ముప్ఫై మంది పిల్లలూ సాయంత్రం నాలుగున్నర నుంచి అక్కడే ...."

    "ఆటపాటలూ , సినిమా కధలూ , డాన్స్ లూ ఒకటేమిటీ సాయంత్రం ఏడింటి వరకూ సందడంతా అక్కడే ఉండేది. "

    నెమ్మదిగా  చీకటి చిక్కబడుతుంటే ... తల్లులు ""ఒరే వెంకట్రావ్ ...". "ఒరే సిమ్హాచెలం ...". "అమ్మాయ్ రాజీ ...". ఇలా పిలుస్తుంటే ఒక్కొక్కరూ ఇళ్ళకు జారుకుని, పొయ్యిల మీద కాగిన ఉడుకు నీళ్ళు పోసుకుని, బువ్వలు తిని పడుకోవటమే ..."


    " ఎంత పెద్ద ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కిష్టిగాడి సినిమా కధైనా అలోపు అయిపోవాలి లేదా ఇంటర్వెల్ తెర పడాలిసిందే. సినిమా కధ చెప్పటమంటే సీన్ బై సీన్ చెప్పాల్సిందే." 

    " ఎన్టీఆర్ అయితే  ఢిష్యూం ఢిష్యూం అని కొడతాడు. ఏఎన్ఆర్ అయితే భిష్క్యాం భిష్క్యాం అని కొడతాడు. అదే క్రిష్ణ అయితే ...టక్చిక్ ...టక్చిక్ ...టక్చిక్ ....అని గుర్రం మ్మీద వెళుతూ ...ఠిష్క్యు ఠిష్క్యూ అని కాలుస్తాడు. ఇలా మాడ్యులేషన్ కూడా మారకుండా కధలు యాక్షన్ తో భలే చెప్పుకునే వాళ్ళం."  

    "ఆ విధం గా ఓరోజు నేను కధల  బాచ్ తోటీ, పిచ్చిబంతి బాచ్ తోటీ కలవకుండా అన్నయ్యా వాళ్ళ 'ఐస్ బాయ్' బాచ్ తో ఆడటం మొదలెట్టా." 

     " దీన్నే 'ఉడుమాట' అనికూడా అనేవాళ్ళు. దొంగ అందరినీ కనుక్కుని పేరు పెట్టి పిలిచి ఐస్ బాయ్ అని చెప్పాలి. నన్ను కనుక్కుంటే పద్మజా ఐస్ బాయ్ అనాలన్నమాట. తరు వాత, ప్రసాద్ ఐస్ బాయ్, రాణీ ఐస్ బాయ్ ఇలాగ.... "

    " మాకు దాక్కోడానికి బోలెడు తావులు ఉండేవి. ఒక కూలిపోయిన మిద్దే, మూతబడిన ఫ్యాక్టరీ, బాలయ్య బావి గట్టూ ఇలాగ. మొదట దొంగ అయింది నేనే ...ఎలాగోలా అందర్నీ కనుక్కున్నాక చివర్లో ఆన్నయ్య దొంగ అయ్యేడు." 

     " అప్పటికే చీకట్లు ముసురుకుని చాలాసేపు అయ్యింది. అన్నయ్య నన్ను కనుక్కోకుండా మాష్టర్ ప్లానొకటి వేసా. నేను సిమ్హా చెలం గాడి చొక్కా తొడుక్కుని తలగుడ్డ చుట్టుకున్నాను. వాడు చొక్కా లేకపోతే చీకట్లో అసలు కనపడడు. కానీ వాడి గంపలాంటి ఉంగరాల జుట్టు చూసి కనుక్కోవచ్చు." 

     " వాడు సీనుగాడి టోపీ తీసి పెట్టుకున్నాడు జుట్టు చూసి కనుక్కోకుండా. నే నేమో కొత్తగా ఎవరో పూరిల్లు కట్టుకుంటుంటే ఆ బద్దలున్న కప్పుమీదికి ఎక్కేశాను. ఒకవేళ అన్నయ్య  చూసినా నా పేరు పెట్టి పిలవక పోతే మళ్ళీ మొదట్నించీ అందరినీ కనుక్కోవాలి వాడు." 

     " వెన్నెల వెలుగుల్లో ఆట బ్రహ్మాండంగా సాగుతోంది. ఆటలో పడి టైం తెలియలేదు. చాలా చీకటి పడింది. ఇంతలో ఫాక్టరీలో దాక్కున్న సీను గాడిని ఎలుక కరిచిందట. వాడు పామేమోనని భయపడి ఇంటికి పరుగెత్తాడు." 

     " అన్నయ్య నన్ను చూశాడు గానీ ఎత్తులో ఇంటి కప్పుమీద ఉన్నానుగా గుర్తు పట్టలా ... కాసేపు అటూ ఇటూ తచ్చాడి వెళ్ళిపోయాడు. చెల్లి ఎప్పుడో ఇంటికెళ్ళిపోయినట్లుంది.  ఇంతలో మా అమ్మ కేకేసిందేమో అన్నయ్య కూడా  కామ్‌ గా ఇంటికి వెళ్ళిపోయాడు. " 

     " నేనూ భలే దాక్కున్నానని ఆనందపడి ఇంకో అరగంట చందమామని చూస్తూ ... ఇంకా పైకప్పు మీద  కూర్చున్నాను కదా దూరంగా కొండగాలికి ఊగుతున్న పైర్లూ, చెట్లూ చూస్తూ ఆదమరచి పాటలు పాడుకుంటూ కూర్చున్నా ..." 

    " కాసేపటికి మన్లోకంలోకి వచ్చి చూస్తే ఇంకెముందీ ఊరెప్పుడో నిద్రపోయింది. మిణుకు మిణుకుమనే బుడ్డీ దీపాలుకూడా ఆర్పేసి జనం నిద్రపోయారు!" 

     " నెమ్మదిగా ఆ నిట్టాడి గుడిసెదిగి ఇల్లుచేరా.... అన్నయ్యా , చెల్లీ ఏం పితూరీలు చెప్పారోగానీ ఇద్దరూ తిండి మెక్కేసి దుప్పట్లు ముసుగేసి బజ్జున్నారు." 

    " అమ్మేమో వాకిట్లో అపరకాళికలాగ ....నిలబడి ఉంది. ఫష్టు అడిగిన ప్రశ్న ఇప్పుడు టైమెంతైందీ ...అంది. తెలీదమ్మా అని మనం మర్యాదగా సమాధానం చెప్పొచ్చుగా ....అబ్బే ..." 

    " నాకెలా తెలుస్తుందీ ...నాదగ్గరేమైనా వాచీ ఉందా ... మన తలబిరుసు సమాధానం .... అమ్మకు బాగా ఎక్కింది కోపం." 

     " ఇంకేముందీ ....అదేదో సినిమాలో బ్రహ్మానందం వేణుమాధవ్ ను  నరసరావు పేట, చిలకలూరి పేట , సత్తెనపల్లి,  పిడుగురాళ్ళ ...బేకో ....బేకు అని తన్నినట్లు వీపు పంబరేగి పొయింది. మా అమ్మమ్మ అడ్డు రాకపోతే అయిపోయేదాన్నే ...." 

    " మా చెల్లి, అన్నా భయపడి పిల్లుల్లా  పడుకున్నారు. అటునించి ఇటు కదిలితే ఒట్టు!!  అమ్మమ్మ అమ్మను బాగా కోప్పడి నాకు స్నానం   చెయించి,  అన్నం పెట్టేసి, కందిన వీపుకు చల్లగా వెన్నరాసి పక్కన బజ్జోపెట్టుకుంది. " 

     " తెల్లారి తెలిసిన విషయమేమంటే ...శీను గాడు  ఎలుక కరిచేసరికి పామనుకుని ఇంటికివెళ్ళి ఏడ్చాడట. వాళ్ళ నాన్న పాము మంత్రమేసే సాంబయ్య దగ్గరికి తీసుకు వెళితే కాటుచూసి భయమేమీలేదు కరిచింది పాముకాదని మందురాసి పంపించాట్ట." 

     " శీను వాళ్ళమ్మేమో చీకట్లో  ఆటలేంటి ...ఈ సిమ్మ్హాచలం గాడికీ, ఆ బాపనోళ్ళ పిల్లలకీ భయమే లేదమ్మా!! చీకట్లో పడి ఆ ఆటలేంది.పురుగూ పుట్రా తిరిగే చోట అందిట." 

     " అమ్మ కోపానికి, ముందొచ్చి వాళ్ళు బతికిపోయారూ ... నేను దొరికిపోయాను అదన్నమాట సంగతి అన్నాను నవ్వుతూ ..." 

     " దెబ్బలు పడేదాక ఆడావుగా ఎన్నింటి దాకా ఆడావేంటి"  అంది పంకజం. " ఎన్నింటి దాకానా ఇప్పట్లా అనుకున్నావా ... ఎనిమిదిన్నరదాకా అంటే ఆరోజుల్లో ఎంత నేరమనుకున్నావ్? ఏడున్నరకల్లా చదువులు కట్టేసి అన్నం తిని బజ్జోవాలి మరి" అన్నాను.

    "గూట్లో దీపం నోట్లో ముద్దా అన్నమాట  బాగుంది"  అంది పంకజం నవ్వేస్తూ ..."ఇప్పటి పిల్లల్లా అర్ధరాత్రిదాకా మెళకువతో ఉండేవాళ్ళం కాదు అన్నాను నేను. 

     " ఉంటే ఇంకేమన్న ఉందా ...అమ్మచేతిలో ..... " అని వెక్కిరించింది పంకజం. 

   "అమ్మ ప్రేమ ఎంత గొప్పదో ...దెబ్బలు కూడా అంతే ... ఆ మాట కొస్తే. అమ్మచేతి దెబ్బ తినని వాళ్ళెవరనీ ... ఛాలెంజ్ ! అలాంటి వాళ్ళుంటే చెప్పమనూ"  అన్నాను నేను. 

                                                                                                                             -పద్మజ కుందుర్తి

No comments:

Post a Comment

Post Top Ad