పుక్కిటి పురాణం!

Telugu Lo Computer
0

 


కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోంది. ఐతే ఆ రణరంగం మధ్యలో ఒక పెద్ద చెట్టు అడ్డంగా వుంది. అది రథ, గజ, తురగాలు వెళ్ళేదారిలో అడ్డు వస్తుంది. అందుకని ఆ చెట్టుని తొలగించబూనుకున్నారు. ఆ చెట్టుకు తాడు కట్టి ఒక ఏనుగు చేత లాగిస్తున్నారు. ఆ మైదానంలో శ్రీకృష్ణపరమాత్మ, అర్జునుడు నిలబడి జరిగేది చూస్తున్నారు. ఇంతలో ఆ చెట్టు మీద తన నలుగురు కూనలతో కాపురం ఉంటున్న ఒక చిన్నపిట్ట ఎగురుకుంటూ వచ్చి శ్రీకృష్ణుని పాదాల మీద వాలింది. శ్రీకృష్ణుడు దానికేసి ప్రశ్నార్థకంగా చూసాడు.
ఆ పిట్ట అంది, "శరణు పరమాత్మా, శరణు. నేను ఈ చెట్టు మీద కాపురం వుంటున్నాను. ఆ చెట్టు కూలిపోతే మేము అనాథలయి, జరగబోయే సమరంలో దిక్కులేని చావు చస్తాము. మాకు నీవే దిక్కు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ."
శ్రీకృష్ణుడు చెయ్యి చాచి ఆ పిట్టకు అభయమిచ్చాడు.
ఆ పిట్ట ఆనందంగా పరమాత్మకు నమస్కరించి ఎగిరిపోయింది.
తరువాత అర్జునుని కేసి తిరిగి అన్నాడు, "అర్జునా! నీ గాండీవం ఒకసారి నాకు ఇయ్యి."
అర్జునుడు హేళనగా నవ్వి అన్నాడు, "ఎవరి ఆయుధాలు వారే వాడాలి బావా! నా గాండీవం ఉపయోగించడం నీకు చాతకాదు కదా! అందుకని నీ సుదర్శన చక్రమే ప్రయోగించు."
శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, అతడి చేతిలోని గాండీవం తీసుకుని ఎక్కుపెట్టి ఒక బాణాన్ని ఆ చెట్టును లాగుతున్న ఏనుగు మీదకు వదిలాడు.
ఆ బాణం ఏనుగుకు తగలకుండా దాని మెడలో ఉన్న గంటకు తగిలి ఆ పెద్దగంట ఠంగుమని చప్పుడు చేసుకుంటూ నేలమీద పడింది.
అర్జునుడు పగలబడి నవ్వాడు, "చూసావా బావా? నీ గురి తప్పేసింది కదా?"
శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.
కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. రణరంగమంతా సైనికుల, గుఱ్ఱాల, ఏనుగుల కళేబరాలతో భీభత్సంగా వుంది. శ్రీకృష్ణుడు ఆ మైదానంలో దేనికోసమో వెతుకుతున్నాడు. ఒకచోట ఆగి తవ్వసాగాడు. అర్జునునికి అర్థం కాలేదు. "బావా! దేనికోసం వెతుకుతున్నావు?"
శ్రీకృష్ణుడు సమాధానం చెప్పకుండా తవ్వకం కొనసాగించి, నేలలోంచి ఏనుగు మెడలోంచి కిందపడిన గంటను తీసాడు. దానిక్రింద శరణు కోరిన పిట్ట తన నాలుగు కూనలతోను సురక్షితం గా వుంది.
శ్రీకృష్ణుని చేయి తాకగానే అది ఆయన పాదాలకు నమస్కరించి, తన నాలుగు కూనలతోను రివ్వున పైకి ఎగిరిపోయింది.

అర్జునుడు నివ్వెరపోయి శ్రీకృష్ణునికి నమస్కరించాడు. "ఆర్తత్రాణ పరాయణా! తెలియక నిన్ను పరిహసించాను. నన్ను మన్నించు" అని వేడుకున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)