అన్నా కెరనినా - మంచి నవల

Telugu Lo Computer
0

 


రష్యన్ మహా రచయిత టాల్ స్టాయ్ 144 సంవత్సరాల క్రిందట వ్రాసిన మహాద్భుతమైన నవల ఈ అన్నా కెరనీనా. ఇందులో అన్నా భార్య అయితే కెరనినా భర్త. వాళ్ళది ఆనాటి రష్యాలోని ఓ కులీన సమాజానికి చెందిన కుటుంబం. భార్యా భర్తలమధ్య ఇరవై ఏండ్ల వయసు వ్యత్యాసం వుంటుంది. వారికి ఎనిమిదేండ్ల ఓ కుమారుడు వుంటాడు.

అన్నా ఓసారి తన తమ్ముడు అబ్లాన్ స్కీకీ అతని భార్యకు మధ్య ఏర్పడిన కలహాన్ని పరిష్కరించేటందుకు మస్కో నుండి పీటర్స్ బర్గ్ వస్తుంది. రైల్వే స్టేషన్లో ఆవిడకు వ్రాన్ స్కీ అనే మీలటరీ యువ కౌంట్ తో పరిచయం అవుతుంది. అన్నా అందాన్ని చూసిన అతను ఆవిడపట్ల ఆకర్షితుడవుతాడు. ఆవిడా అంతే.అనేక సంఘటనల తరువాత సమాజంలో, ప్రభుత్వంలో ఎంతో పలుకుబడి కలిగిన భర్తను,కన్న కొడుకునూ కాదని వ్రాన్ స్కీతో వెళ్ళిపోతుంది.అతని ద్వారా అన్నా ఒక కూతుర్ని కంటుంది అన్నా. మరోపక్క స్వంత భర్త కెరనినా విడాకులు ఇవ్వనంటాడు. కొడుకు పట్ల ప్రేమతో కుమిలిపోతుంటుంది.
రోజులు గడుస్తున్నాకొద్ది అన్నా,వ్రాన్ స్కీ లమధ్య పొరపొచ్చాలు ఏర్పడతాయి. అన్నా అభద్రతతో మానసికంగా కుంగిపోతూ మత్తు మందుకి అలవాటు పడుతుంది. అటు విడాకులు రాక, ఇటు వ్రాన్ స్కీతో పెండ్లికాకపోవడంతో అతను తనను పక్కన పెడుతున్నాడన్న మానసిక సంఘర్షణకు లోనవుతుంటుంది.ఆకోపంలో అతనికి గుణపాఠం నేర్పాలన్న తప్పుడు ఆలోచనతో ఆత్మహత్యకు పాల్పడుతుంది అన్నా! స్థూలంగా ఇది నవలాంశం.
ఈ పాయింట్ తోపాటు ఆనాటి రష్యా సమాజంలో ముఖ్యంగా కులీన సమాజాల్లోని అనేక పార్శ్వాలను, చీకటివెలుగులను ఎంతో విపులంగా చర్చిస్తూ 866 పేజీల విస్తృతితో తీర్చిదిద్దిన నవల ఇది.
అన్నా పాత్ర పాఠకులకు మొట్టమొదటిసారిగా రైల్వేస్టేషన్ లోనే పరిచయం అవుతుంది. చివరికి రైల్వేస్టేషన్ లోనే అంతమవుతుంది. దాన్ని మనం మనసుపెట్టి ఆలోచిస్తే ఆపాత్ర పుట్టుక,కొనసాగింపు,ముగింపు పట్ల రచయిత ఎంత సమగ్రమైన ఆలోచనతో వున్నాడో అర్ధమవుతుంది.
నవలలో మరో ముఖ్యమైన జంట కిట్టీ లేవిన్ లది.ఈజంట నవల ఆరంభం నుండి ముగింపు వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా లేవిన్ పాత్ర ద్వారానే రచయిత ఆనాటి రష్యా కులీన సమాజాల్లోని అన్నికోణాలను స్ప్రుశించాడని చెప్పవచ్చు. ప్రధానంగా క్రైస్తవ మత ధర్మానికి సంబంధించిన అనేక విషయాలను ఎంతో విపులంగా చర్చించాడు.
ఆనాటి రష్యాలో వ్యవసాయమే ప్రధాన జీవన కార్యకలాపం. కాబట్టి లేవిన్ పాత్ర ద్వారా ఆ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు వివరిస్తాడు రచయిత. వ్యవసాయభూములన్నీ కులీనులచేతుల్లోనే వుంటాయి. వ్యవసాయ క్షేత్రాల్లో శ్రమ మాత్రం కర్షకులు,కూలీలు పడుతుంటారు.దాని ఫలితంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.
నవల పొడవునా ప్రభువర్గాల మనస్తత్త్వాలను, స్త్రీ పురుష సంబంధాలను,వ్యవసాయ సంబంధ విషయాలను,మత రాజకీయ అంశాలను ప్రస్తావించే సందర్భాలలో రచయిత మితిలేని వివరణలతో పాఠకులను ఒకింత విసిగించినట్టు అన్పిస్తుంది.ఉదా.కిట్టీకి పురిటి నొప్పులు మొదలై కాన్పు అయ్యేవరకు జరిగిన సంఘటనలను దాదాపుగా పదహారు పేజీలకు విస్తరించి వ్రాస్తాడు. ఓ విషయానికి సంబంధించిన ప్రతికోణాన్నీ లోలోతుల్లోకి వెళ్ళి పాఠకులకు చూపించాలన్న లౌల్యంలో ప్రపంచస్థాయి రచయిత కూడా పడిపోయాడా!? ఏమో? విజ్ఞులకే తెలియాలి.
అయితే నవల ఆరంభం "సుఖపడే సంసారాలన్నీ ఒక్కలాగే వుంటాయి.సుఖంలేని సంసారాలకి మాత్రం దేని బాధలు దానివి"అన్న వాఖ్యంతో మొదలు పెడతాడు. ఆ ఆరంభ వాఖ్యంతోనే నవలలో తానేం చెప్పాలనుకున్నాడో టాల్ స్టాయ్ మనకు చెప్పకనే చెప్పారన్పిస్తుంది.
ఇంతగొప్ప నవలను సాహితీ ప్రచురణలు, విజయవాడ వారు 2018లో తిరిగి వెలుగులోకి తీసుకొచ్చారు.ధర 500.00 రూ.లు. ఈ కరోనా గృహనిర్బంధ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా చదవాల్సిన పుస్తకం అన్నా కెరనినా.

Post a Comment

0Comments

Post a Comment (0)