వైరాగ్యం .....

Telugu Lo Computer
0


 జీవితపు ఒక్కో దశలో... మనిషిలో ఒక్కోరకమైన మార్పు వస్తుందేమో ! ఏడాది వయసున్న బాలుడికి, అన్నీ రుచి చూసి, స్పర్శించి, పరిశోధించాలని ఎంత ఆసక్తి ఉంటుంది... వాడిని ఈడ్చుకొచ్చి, కసిరి కూర్చోపెట్టినా... మళ్ళీ ఒక నిముషం తర్వాత... షరా మామూలే !

రానురాను వస్తు పరిశోధన తగ్గి, బాల్య దశ నుంచి యవ్వన దశ వరకూ, సమాజంలోని రకరకాల మనస్తత్వాలు అర్ధం చేసుకోవడం, వారితో మెలిగే విధానం నేర్చుకోవడం... చదువులు కొనుక్కోవడం... ఇవన్నీ... ఆ తర్వాత... ఇక పెళ్లి, సంసారం, పిల్లలూ... ఈ దశలోనే ఒక నిర్వికార, నిస్సంగ స్థితి అలవడుతుందేమో ! అసలు, మాటల కంటే, మౌనంగా పరమాత్మను ధ్యానించడమే మధురంగా తోచే ఈ స్థితి కలగడం కూడా గురు అనుగ్రహమేనేమో ! దృశ్యమాన జగత్తు మాయ అని... బ్రహ్మ సత్యం జగన్మిధ్య ... అని తెలుసుకునే ఆత్మజ్ఞానం కలగాలంటే... పరిపూర్ణ దైవానుగ్రహం అవసరమేమో !
కాని, కాటికి కాళ్ళు చాపుకునే వయసు వచ్చినా, కొందరికి విషయవాసనలు అసలు వదలవు. ఆహార్యం, నగలు, డాబుల మీద మోజు, పేరు కోసం పరుగులు... ఇవన్నీ నెమ్మదించేది ఎప్పుడు ?
దాదాపు మన దేశంలోని గొప్ప రాజులు అంతా... బోలెడు డబ్బులు పోసి, కాశీ నగరంలో కోటలు కట్టినవారే ! పవిత్ర గంగా తీరంలోని ఘాట్ లు దర్శిస్తూ, పడవ ప్రయాణం చేస్తుంటే... ఆ తీరం వెంట ఎందరో రాజులు కట్టిన కోటలు దర్శనం ఇస్తాయి... ఇప్పుడా రాజులు కట్టిన కోటలు... బైరాగులకు ఇరవైనాయి. కొన్ని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుని, హోటల్ లకు అరువిచ్చాయి. చాలా వరకూ శిధిలావస్థ లో ఉన్నాయి. అంత గొప్ప యుద్ధాలు చేసిన రాజులు... డాబుగా, దర్పంగా బ్రతికి, విడిది కోసం కోటలు కట్టిన రాజులు, వారి ఠీవి, రాజ్య కాంక్ష, డబ్బు, ఆర్జించిన రాజ్యాలు... ఏవి ఇవన్నీ ? చివరికి ఏదైనా మన్నులో కలవాల్సిందేగా... కళ్ళెదుట కాలే శవాల్ని చూస్తుంటే, "మరి ఇవన్నీ అశాశ్వతం అయితే, ఏది శాశ్వతం ?" అన్న సందేహం కలుగక మానదు.
మట్టిపై కట్టిన కోటలు... మట్టిపాలు... కాని, జగతః పితరులైన ఆదిదంపతుల హృదయ సామ్రాజ్యం అనే కోటలో... భక్తితో, ఆర్తితో, ప్రేమతో... ఎన్ని సార్లు దారి మళ్ళినా, ఆ మనసును ఈడ్చుకొచ్చి, లగ్నం చేసి, కాస్తంత చోటు సంపాదించుకున్నామా... మన జన్మ ధన్యమైనట్లే ! ఈ ఒక్క విషయం తెలిసే సరికి... అనేక జన్మలు కాలప్రవాహంలో కలిసిపోతాయి. స్వయం ప్రకాశకమైన కాశీ క్షేత్రం - దివ్య మణి లాగా ముముక్షువులకు జ్ఞాన మార్గం చూపిస్తుందట !
ఈ క్షేత్రంలో మరణిస్తే జీవన్ముక్తి నిశ్చయంగా కలుగుతుందని, ఎందరో ఇక్కడికి వచ్చి చనిపోవాలని, కోరుకుంటారు. ఇక్కడ మరణించబోయే వారి తలను భవాని ఒళ్ళో పెట్టుకు సేద తీరుస్తుంటే, గణేశుడు వీవెన వీస్తుంటే, ఈశ్వరుడు శేష కర్మను క్షణ కాలంలో అనుభవింపజేసి, వారికి తారక మంత్రం ఉపదేశించి, ముక్తిని ప్రసాదిస్తాడట ! కాని, ఇక్కడ చావాలన్నా, శివానుగ్రహం ఉండాల్సిందే ! కాశీ క్షేత్రంలో, అడుగడుగునా అదృశ్య రూపంలో ఉండే దేవతల దీవెనవల్ల మనసు లోతుల్లోంచి... ఒక విధమైన నిస్సంగత్వం కలుగుతుందట. అలలు లేని సముద్రంలా, నిర్మలంగా, ప్రశాంతంగా మారిన నా అంతరంగం...

Post a Comment

0Comments

Post a Comment (0)