సమయస్ఫూర్తి .....

Telugu Lo Computer
0

 

ఒకరోజు కాళిదాసు,దండి యిద్దరూ రాజవీధిలో నడుస్తూ ఒక చోట తాంబూల సేవనం కోసం ఆగారు.తీరా చూస్తే దండి గారి దగ్గర సున్నం అయిపొయింది,కాళిదాసు గారి దగ్గర తమలపాకులు నిండుకున్నాయి. యిద్దరూ అక్కడే వున్న ఒక దుకాణానికి వెళ్ళారు. అ దుకాణాన్ని ఒక పడుచుపిల్ల నడుపుతున్నది. ఆ పడుచుతో దండి కవిగారు లలితంగా యిలా అన్నారు.
'తూర్ణ మానీయతాం చూర్ణం పూర్ణ చంద్ర నిభాననే'
అర్థము:--త్వరగా సున్నం యిప్పించవమ్మా ఓ! పూర్ణ చంద్రుని వంటి మోముగల చినదానా
కాళిదాసు తమలపాకులు కూడా కావాలని కోరుతూ శ్లోకం పూర్తీ చేశాడు
'పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంత కీర్ణ లోచనే'
అర్థము:--చెవుల వరకూ కూ వ్యాపించిన విశాల నేత్రాలు గల సుందరీ బంగారు వన్నె గల తమలపాకులు కూడా ఆ చేత్తోనే యిప్పించు.
ఆ చిన్నది ముందు కాళిదాసుకు ఆకులు అందించి తర్వాత దండికి సున్నం అందించింది.దండి కొంచెం చిన్న బుచ్చుకున్నాడు.ముందు సున్నం అడిగింది నేను, తర్వాత ఆయన ఆకులడిగాడు.మరి ముందు ఆయనకు ఆకులిచ్చి తర్వాత నాకు సున్నం యిచ్చావే.ఈ భోజరాజు లాగా నీవు కూడా కాళిదాస పక్షపాతివా?అన్నాడు కోపంగా.నిజానికి దారానగర ప్రజలందరి లాగే ఆ నెరజాణకూడా కవితా రసజ్ఞురాలే ఆమె .కాళిదాసు అభిమాని. ఆమె.అందుకే ముందు ఆయనకు 'అగ్రతాంబూలం' యిచ్చింది.కానీ ఆమె లౌక్యం తెలిసిన వ్యవహార దక్షురాలు.ఉన్నమాట చెప్పి దండి గారి మనసును నొప్పించ దలుచుకోలేదు.
అయ్యా! నేను దుకాణంలో సరుకు అమ్మటానికి కూచున్నాను.నాకు పక్షపాతాలూ అవీ లేవు.నాది చిన్న బుర్ర. కాళిదాసు గారు చెప్పిన శ్లోక పాదం లో నా చెవికి అయిదు ''ణ' లు వినిపించాయి.మీరు చెప్పిన పాదం లో మూడు 'ణ' లే వినిపించాయి.మూడు నాణాల కంటే అయిదు నాణాలు ఎక్కువ కదా! అందుకని పెద్ద బెరానికే ముందు ప్రాధాన్యత యిచ్చాను.మిమ్మల్ని నొప్పించి వుంటే క్షమించండి.అన్నది ఆ చిన్నది.

దండికి కోపం పోయి నవ్వు వచ్చింది.'ఈ ధారనగర వాసులతో యిదే చిక్కు.యిక్కడ అందరూ కవులే పండితులే మంచి సమయస్ఫూర్తి గలవారే అనుకుంటూ తాంబూలం నములుతూ కాళిదాసు తో కలిసి వెళ్లి పోయాడు. .

Post a Comment

0Comments

Post a Comment (0)