రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు...!

Telugu Lo Computer
0


దేశంలో జీఎస్టీ సెప్టెంబర్ నెలకు గాను రూ.1,47,683 కోట్లు వసూలు అయినట్లు  కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే 26 శాతం వృద్ధిగా ఉంది. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లపైగా నమోదు కావడం ఇదే ఏడోసారి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో భారీ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి. ఇదే విషయాన్నికేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ నెల జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ రూ.25,271 కోట్లుగా ఉంది. ఎస్‌జీఎస్టీ రూపంలో రూ.31, 813 కోట్ల ఆదాయం వచ్చింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,464 కోట్లుగా ఉంది. సెస్ రూపంలో మరో రూ.10,137 కోట్లు సమకూరిందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. గత నెలలో దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం 39 శాతం పెరిగింది. ఇటు దేశీయ లావాదేవీల ఆదాయంలో 22 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు ధృవీకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వచ్చాయి. తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వసూళ్లు 12 శాతం వృద్ధి నమోదు అయ్యింది. తెలంగాణలో గతేడాది సెప్టెంబర్‌లో రూ.3,494 కోట్లుగా ఉంది. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.3,915 కోట్లుగా నమోదు అయ్యింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. మొత్తంగా ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లలో 21 శాతం వృద్ధి నమోదు అయ్యింది. గతేడాది సెప్టెంబర్‌ నెలలో రూ.2,595 కోట్లుగా జీఎస్టీ వసూళ్లు ఉండగా, ఈఏడాది అదే నెలలో రూ.3,132 కోట్లకు పెరిగింది. ఈవిషయాన్ని జీఎస్టీ కౌన్సిల్, ఆర్థిక శాఖ అధికారికంగా తెలిపాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)