సౌర శక్తి - మన వేదాలు

Telugu Lo Computer
1



1945 లో బెంగాలు కు చెందిన ఎం. కె. ఘోష్ సూర్య రశ్మితో పనిచేసే పరికరం రూపొందించాడు. సౌర శక్తి కి చాల శక్తి వున్నదని, ఇప్పటి శాస్త్రజ్ఞులు గ్రహించి సౌర శక్తి తో ఎన్నో పనులు సాధిస్తున్నారు. వంట చేసుకోడానికి .  సోలార్ హీటర్లు తయారు చేశారు.అయితే యెంతోకాలం క్రితమే మన పూర్వులైన ఋషులు గ్రహించారు అందుకే సూర్యుడిని దేవుడుగా భావించి పూజలు చేసేవారు. రథసప్తమి నాడు సూర్యున్ని పూజించి పొంగలి తయారు చేసి నైవేద్యం పెడతారు .సూర్యజయంతి ఉత్సవాలు జరుపుతారు. ఇప్పటికీ తమిళనాడులో రథసప్తమి రోజు బయట పొయ్యి పెట్టి పొంగలి తయారు చేస్తారు. సౌర శక్తి వినియోగ ప్రస్తావన 500 ఏళ్ళ క్రితమే మన తెలుగు కవి శ్రీనాథుడు తన కాశీఖండ మనే కావ్యంలో చేశారు. భారతీయుల మేధా సంపత్తి విశేషమని అనేక సంవత్సరాల పూర్వమే ఋజువైంది.ఇది శ్రీనాథుడు రచించిన కాశీఖండ కావ్యం లోనిది. దివోదాసుడనే రాజు కాశీ పట్టణమును పాలించేవాడు. అతడు సూర్య వంశజుడు, ధర్మాత్ముడు. ఈయనకు రిపుంజయుడు అనే పేరు కూడా వుంది. ఒక సమయం లో దేవతలు ఆగ్రహించటం వలన కాశీ పట్టణం లో అగ్ని జ్వలించ లేదట. ( వేదాల్లో వున్న సూర్య బీజాక్షరాలు చదివితే సౌర శక్తి లభిస్తుందని మన ఋషులు బోధించారు). ఆ సమయంలో ఆయన సూర్య కిరణాల సాయం తో వుడికిన పదార్థాలు తిన్నాడట. ఈ పద్యం చదవండి.

అంబుజ బాంధవాన్వయ నృపాగ్రణి బోనము నేడు సూర్య పా 

కంబున నాయితనంబయిన కబ్జము భోజన శాల లోన బ 

ల్యం బిడినారు. పంకజదళాక్షులు రెండవ ఝాము ఘంట వ్రే 

యంబడి నారగింప సమయంబని చెచ్చెర విన్నవించినన్ 

వేల్పు లొనరించినట్టి దుర్వృత్తి యగుట 

నెరిగి యింతియె గాక  యొండేమి యనుచు 

నారగించె దివోదాసుదారక కిరణ 

తాప పక్వంబులగు పదార్థంబు లెలమిన్ 

అర్థము:--పరిచారికలు వచ్చి సూర్యవంశ ప్రభువుల్లో గొప్పవాడా రిపుంజయ మహా రాజా! ఈ రోజు భోజనం సూర్య కిరణాల వేడితో తయారయింది. భోజనశాలలో పద్మ దళాలవంటి కన్నులు గల భామినులు పళ్ళెం లో పెట్టినారు రెండో ఝాము ఘంట మ్రోగింది త్వరగా తినడానికి రండి అని పిలుస్తారు. అప్పుడు రిపుంజయుడు (దివోదాసు) దేవతలు అగ్నిని నిరోధించడం కంటే యింకేమి చేయగలరు అంటూ సూర్య కిరణాల వేడిమి తో తయారైన పదార్థాలు తిన్నాడట. ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం యిప్పుడు  ఆవిష్కరించిన ఇలాంటి విషయాలేన్నింటికో మన సాహిత్యం లో తార్కాణాలున్నాయి. పరిశోదించాలనే ఉత్సుకత ఉన్నవారికి పెన్నిధి మన తెలుగు సాహిత్యం.

"కాశీఖండ మయః పిండం నైషధం విద్వదౌషధం" కాశీఖండము" అను శ్రీనాథుడు రచించిన కావ్యము

యినుపముద్దవలె గట్టిగా వుంటుంది.(అంటే అంత త్వరగా అర్థం కాదు అని) ఇంక నైషధం విద్వాంసులకు ఔషధము వంటిది.

మనవాళ్ళు  వేరే దేశం వాళ్ళు చెప్తేనే కానీ నమ్మరు  కదా! మన వేదాల్లో ఎన్నో ఇలాంటివి వున్నాయి.వాటిని చదివే వాళ్ళే కరువైనారు.అది మన దురదృష్టం

Post a Comment

1Comments

Post a Comment